ఖమ్మం నగరంలో గత రాత్రి కొందరు వ్యక్తులు హైవేపై సృష్టించిన ‘రౌడీ’యిజపు వీరంగం తీవ్ర కలకలం రేపింది. కొందరు యువకులు ఖమ్మం-రాజమండ్రి జాతీయ రహదారిపై, ఎస్ఆర్ గార్డెన్స్ సమీపాన తమ చేష్టలతో భయానక వాతావరణం కలిగించారు. హైవేపై అడ్డగోలుగా సంచరిస్తూ వచ్చీపోయే వాహనదారులకు భయాందోళన కలిగించారు. అంతేకాదు ఎస్ఆర్ గార్డెన్స్ సమీపాన గల ఓ షాపు నిర్వాహకులతో ఘర్షణకు దిగి, ఓ వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత షాపు ముందు గల బైకుపై పెట్రోల్ పోసి నిప్పంటించి దహనం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైఎస్ఆర్ కాలనీకి చెందిన యువకులు కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.
