Friday, October 17, 2025

Top 5 This Week

Related Posts

‘విలేకరి’ కోసం ఖమ్మంలో రౌడీషీటర్ల ఘర్షణ! ఒకనికి తీవ్ర గాయాలు

ఖమ్మం నగరంలో ఒక మాజీ రౌడీ షీటర్, మరోఇద్దరు రౌడీ షీటర్లు ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ రౌడీ షీటర్ తీవ్రంగా గాయపడ్డాడు. దసరా పండుగ సందర్భంగా పరస్పర శుభాకాంక్షలు చెప్పుకున్న ఈ ముగ్గురు ఆ తర్వాత ఘర్షణకు దిగి, దాడులు చేసుకోవడం గమనార్హం. ఖానాపురం హవేలీ పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. గురువారం సాయంత్రం నగరంలోని శ్రీనగర్ కాలనీలో జరిగిన ఉదంతపు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.

నగరంలోని శ్రీనగర్ కాలనీలో నివాసముండే గోలెపు గణేష్ అనే వ్యక్తి ఇంటికి ఇల్లెందుకు చెందిన జేకే మహేష్, ఖమ్మంలోని కాల్వొడ్డుకు చెందిన భద్రుల్లా అనే వ్యక్తులు వెళ్లారు. ఈ సందర్బంగా పరస్పరం దసరా శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఓ విలేకరి అంశంలో ముగ్గురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ విలేకరికి వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తున్నావు? అంటూ భద్రుల్లా, జేకే మహేష్ లు తనను దుర్భాషలాడుతూ దాడి చేశారని గణేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఇద్దరితోపాటు మరో పది మంది వారి అనుచరులు తన ఇంటిపక్కనే గల ఖాళీ స్థలంలోకి తనను లాక్కువెళ్లి బీరు సీసీలతో, రాడ్లతో దాడి చేశారని, తాను చనిపోయినట్లు భావించి వదిలేసి వెళ్లారని గణేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించాడు.

దాడిలో గాయపడిన గణేష్

కాగా ఈ సంఘటన ఖమ్మం నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఘర్షణకు పాల్పడిన ఆయా ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు పోలీస్ రికార్డుల్లో రౌడీ షీటర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. భద్రుల్లా అనే వ్యక్తి మాజీ రౌడీ షీటర్ గా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఇతనిపై రౌడీ షీట్ ఉండేదని, ఇటీవలే ఎత్తివేశారని ఆ వర్గాలు తెలిపాయి. అయితే ఓ ‘విలేకరి’ కోసం తనపై ఆయా వ్యక్తులు దాడికి పాల్పడినట్లు గణేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. ఫిర్యాదులో ‘విలేకరి’ పేరును కూడా బాధితుడు ప్రస్తావించాడు. దీంతో ఆ ‘విలేకరి’కి, దాడికి పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కుంటున్న వ్యక్తుల మధ్య గల సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గణేష్ ఇచ్చిన ఫిర్యాదుపై ఖానాపురం హవేలీ పోలీసులు గత రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Popular Articles