హైదరాబాద్ చందానగర్ లో గల పట్టపగలే ప్రముఖ జ్యువెల్లరీ దుకాణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇక్కడి ఖజానా జ్యువెల్లరీ షాపులో మంగళవారం ఉదయం దోపిడీకి వచ్చిన ఆరుగురు దుండగులు తుపాకులు తీసి కాల్పులు జరిపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దోపిడీని అడ్డుకోబోయి ఎదురు తిరిగిన సిబ్బందిపై, షాపు డిప్యూటీ మేనేజర్ పైనా దోపిడీ దొంగలు కాల్పులు జరిపారు. సీసీ కెమెరాలను సైతం తుపాకీ కాల్పులతో ధ్వంసం చేశారు. షాపు తెరిచిన కొద్ది సమయంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం.
కాగా గత రాత్రి KPHB ఏడో ఫేజ్ లోని ఎంఐజీ-2, నెం. 14 నివాసంలో దారుణం చోటు చేసుకుంది. రిటైర్డ్ ఉద్యోగులు కొల్లా నాగేశ్వర్ రావు, సరస్వతి దంపతుల ఇంట్లోకి చొరబడిన దుండగులు వారిపై దాడి చేసి 20 తులాల బంగారం, మూడు లక్షల రూపాయల నగదును దోచుకువెళ్లారు. పక్కనే గల మరో ఇంట్లోకి కూడా దోపిడీకి దుండగులు ప్రయత్నించారు. అయితే ఆ ఇంట్లోనివారు మేల్కొని ఎదురు తిరగడంతో దుండగులు పారిపోయారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులే చందానగర్ లోని జ్యువెల్లరీ షాపులో దోపిడీకి ప్రయత్నించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ రెండు ఉదంతాలపై హైదరాబాద్ పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. దుండగుల కోసం 10 బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దుల్లో కాపుకాస్తూ దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.
