(By Dr. Mohammed Raffe)
బీజేపీ అధిష్టానం అంతే.. మనం ఆలోచించినట్లు ఆలోచించదు. ఉత్తరాది రాజకీయాలు చాలా వ్యాపారాత్మకంగా ఉంటాయి. ఎవ్వరూ ఊహించని విధంగా మాజీ ఎమ్మెల్సీ, పూర్వ అధ్యక్షులు రామచందర్ రావును తెలంగాణ బీజేపీ చీఫ్ గా రంగంలోకి దించింది. ఆంధ్రప్రదేశ్ లో పీవీఎన్ మాధవ్ ను అనూహ్యంగా ఖరారు చేసింది.
బీజేపీ రాజకీయాలు అలాగే ఉంటాయి. లోలోపల అనేక ఈక్వేషన్స్ ఉంటాయి. దేశంలో జాతీయ పార్టీలు పెద్దవి రెండే ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, రెండోది బీజేపీ. ఇప్పుడు బీజేపీ హవా నడుస్తోంది. బీజేపీ అధిష్టానం ఒక తీరు అయితే కాంగ్రెస్ అధిష్టానం తీరు ఇంకో రకం. కాంగ్రెస్ అంతా ఢిల్లీ కేంద్రంగా చేసుకుని చక్రం తిప్పుతూ ఉంటుంది. బీజేపీ అలా కాదు. ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీల గాలిని బట్టి నిర్ణయాలు తీసుకుంటుంది.
తెలంగాణలో గత ఎన్నికల ముందు బీజేపీ చాలా జోష్ లో వుండింది. అప్పటి పార్టీ చీఫ్ బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది. దాంతో బీజేపీ వేడి చల్లబడింది. అనూహ్యంగా రేవంత్ రెడ్డి దూసుకొచ్చారు. అటు ఇటు తేలని పరిస్థితుల్లో బీజేపీ చేసే రాజకీయం అదే! లోలోపల ఏ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుందో నేను ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఎమ్మెల్యే సీట్లకన్నా ఎంపీ సీట్లకు ప్రాధాన్యం ఇచ్చింది. అలా రాజకీయ వ్యూహంలో తెలంగాణలో మున్నెన్నడూ లేని విధంగా ఎనిమిది ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుంది.

ఇప్పుడు మళ్ళీ అదే వ్యూహంతో చక్రం తిప్పింది. ఈటెల రాజేందర్ ను ఊరించింది. కాసేపు ధర్మపురి అరవింద్ కు ఆశలు రేకెత్తించింది. ఒకానొక సమయంలో డీకే అరుణను రంగంలోకి దించాలనుకుంది. చివరకు రామచంద్రరావు వైపు మొగ్గు చూపింది. అంటే ఇక్కడ లోలోపల దోస్తానా ఎవరితోనో నేను ప్రత్యేకంగా చెప్పక్కర లేదు.
అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం. అ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని మార్చాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు ఒక పార్టీ అగ్రేసర నేత! అక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఏ కార్యక్రమం నిర్వహించాలన్న మూడు పార్టీల నేతలు వేదికఫై ఉండి తీరాలి. అలాగే యువరాజు తప్పని సరి. ఈ నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వేదికఫై కూర్చుని ఉండటం వేరేగా సంకేతాలు ఇస్తూ వచ్చారు. దాంతో అక్కడి పగ్గాలు మాధవ్ చేతిలో విధిగా పెట్టాల్సి వచ్చింది. బీజేపీ రాజకీయం ఇలాగే ఉంటుంది. వస్తే రాష్ట్రం. లేకపోతే ఏదొక లాభం. నష్టం అయితే ఉండకూడదు. అదే బీజేపీ గుజరాత్ రాజకీయం! ఆ రాజకీయమే ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది.
Update:
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ఇక లాంఛనమే. తెలంగాణా నుంచి రామచందర్ రావు, ఆంధ్రప్రదేశ్ నుంచి మాధ్ లు సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం అధికారికంగా కొత్త అధ్యక్షుల ఎన్నిక ప్రకటన లాంఛనంగానే పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.