Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

ఇప్పుడంతా రివర్స్.. పాపం పిల్లగాళ్లు!

(By Dr. Mohammed Rafee)
పెళ్ళి చేసుకున్నాక హనీమూన్ అంటేనే అబ్బాయిలు భయపడేలా చేసేశారు. బ్లూ డ్రమ్ములో వేసి సిమెంట్ తో మూసేస్తున్నారు. మోరీల్లో కుక్కేస్తున్నారు. సంపుల్లో నెట్టేస్తున్నారు. లోయల్లోకి తోసేస్తున్నారు. ఏం భయపెట్టేశారమ్మా ముక్కు పచ్చలారని అబ్బాయిలను! అమాయక జీవులు పెళ్ళి అంటేనే హడలి చస్తున్నారు.

ఒకప్పుడు పెళ్ళి అంటే ఆడపిల్లలు భయపడే వాళ్ళు! అబ్బాయి ఎలాంటి వాడో, ఎలా చూసుకుంటాడోనని అమ్మాయి తలిదండ్రులు హడలిపోయే వారు. అత్తారింటికి అల్లుడు వెళితే రాజభోగంలా ఉండేది. ఏం వండి పెట్టేవారు? కాలు కింద పెట్టనిచ్చే వారు కాదు! ఎక్కడ అలుగుతాడో, అమ్మాయిని ఎక్కడ ఇబ్బంది పెడతాడేమో అని బిక్కుబిక్కుమంటూ చూసుకునే వాళ్ళు.

ఇప్పుడంతా రివర్స్. పెళ్లయ్యాక అత్తారింటికి అబ్బాయి వెళుతుంటే తల్లిదండ్రులు వణకిపోతున్నారు. బాబు తిరిగి ఇంటికి వస్తాడో రాడో అని భయపడిపోతున్నారు. ప్రాణంతో తిరిగి వస్తే దేవుడా అవి చెల్లిస్తాం.. ఇవి చెల్లిస్తాం.. అంటూ మొక్కుకుంటున్నారు. ఎలాంటి రోజులు వచ్చాయి?

ఇష్టం లేనప్పుడు అమ్మాయిలు ఎందుకు చేసుకుంటున్నారు? చేసుకున్నాక తాపీగా ప్రాణాలు ఎందుకు తీస్తున్నారు! భార్య అంటే ఒక నమ్మకం. భార్య అంటే ఒక భరోసా. కానీ, ఇటీవల కాలంలో దేశంలో వివిధ రాష్ట్రాల కేసులను పరిశీలిస్తే, వధువులే వరసగా కొత్త మొగుళ్లను చంపేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పాపం కొత్త పెళ్ళి కొడుకులు బ్లూ డ్రమ్ములు చూస్తే భయపడుతున్నారు. ఫ్లైట్ టికెట్లు చూసి వణికి పోతున్నారు. కొండ ఎక్కాలన్నా, జలపాతంలోకి దిగాలన్నా, లోయలోకి వెళ్లాలన్నా, అఖరికి రాత్రిళ్ళు కారు ప్రయాణాలు చేయడానికీ విలవిల్లాడిపోతున్నారు. ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో ఏమోనని నిద్ర కూడా సరిగా పట్టక అల్లాడిపోతున్నారట పాపం!

పెళ్ళికి ముందే ప్రేమలు.. ఇంట్లో చెప్పలేని పరిస్థితులు! ఎదిరించలేక పెద్దల మాటకు కట్టుబడి తాళి కట్టించుకుని, హనీమూన్ పేరిట ఎటో తీసుకెళ్లి ప్రియుడి సాయంతో లేపేస్తున్నారు. పోలీసులకు దొరికిపోతున్నారు. మరో వైపు నిత్య పెళ్ళి కూతుర్ల గోల. ఇంతకు ముందులా ఎన్ని ఎంక్వయిరీలు చేసుకున్నా చివరకు ఏమి జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు సమాజంలో నెలకొని ఉన్నాయి. పాపం అబ్బాయిలను ఇక దేవుడే కాపాడాలి!

Popular Articles