Top 5 This Week

Related Posts

మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం విస్తృతంగా పర్యటించారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాల్లో మంత్రి పర్యటించారు. తొలుత తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ లోని ఏదులాపురం మున్సిపాలిటీలో పర్యటించి రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

గుర్రాలపాడులో రూ. 2.85 కోట్లతో గుర్రాలపాడు నుండి కొత్త నారాయణపురం వరకు బీ.టీ. రోడ్డు నిర్మాణం, వెంకటగిరిలో రూ. 2.4 కోట్లతో వెంకటగిరి ఎస్సీ, బీసీ కాలనీ నుండి ఖమ్మం గుదిమళ్ళ జెడ్పీ రోడ్డు వరకు బీటీ రోడ్డు, గుదిమళ్ళలో రూ. 1.95 కోట్లతో గుదిమళ్ల నుండి తొర్రివాగు డొంక రైస్ మిల్లు వరకు చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.

ఏదులాపురం మున్సిపాలిటీలో రోడ్డు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేసిన చిత్రం

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, వర్షాకాలంలోపు, అత్యంత వేగంగా ఏదులాపురం మునిసిపాలిటీలో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా ప్రజలకు రోడ్లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రజల అవసరాల మేరకు చేయవలసిన రోడ్డు నిర్మాణ పనులకు ప్రతిపాదనలు అందించాలని మంత్రి అధికారులకు సూచించారు. అనంతరం మంత్రి పొంగులేటి గుదిమళ్లోని తిరుపతమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు.

కొత్తగూడెంలో ఓ వ్యాపార సంస్థ షోరూంను ప్రారంభిస్తున్న మంత్రి పొంగులేటి

ఆ తర్వాత కొత్తగూడెం నియోజకవర్గంలోని చంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వ్యాపార సంస్థ షోరూంను మంత్రిపొంగులేటి ప్రారంభించారు. భద్రాచలంలో ఏర్పాటు చేసిన రెండు అధికారిక కార్యక్రమాల్లోనూ మంత్రి పాల్గొన్నారు. మంత్రి వెంట ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, ఊకంటి గోపాల్ రావు, ఆళ్ల మురళి, బానోత్ విజయబాయి తదితరులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Popular Articles