ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి చట్టం అమలుకు కలెక్టర్లే మార్గదర్శకులని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయా పథకాల ఫలితాలు పేదల గుడిసె వరకు చేరాలని ఆయన కోరారు. ఈనెల 8వ తేదీన కలెక్టర్లతో సచివాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణా ప్రభుత్వం దార్శనికతతో తీసుకువచ్చిన భూభారతి చట్టం అమలు, పేదల కలలను సాకారం చేసే ఇందిరమ్మ ఇండ్ల పధకాన్ని సమర్ధవంతంగా అమలు చేసి వాటి ఫలితాలు పేదలకు అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని మంత్రి అన్నారు. ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ రెండు పధకాలను విజయవంతంగా అమలు చేయడానికి జిల్లా కలెక్టర్లు నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు.
బుధవారం డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో నిర్మల్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల , వనపర్తి జిల్లాల కలెక్టర్లతో భూభారతి, ఇందిరమ్మ ఇండ్లపై సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ “ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడితే స్వరాష్ట్రంలో పదేళ్లలో ఎదుర్కొన్న భూ సమస్యలకు విముక్తి లభిస్తుందని , సొంతింటి కల నెరవేరుతుందని తెలంగాణ ప్రజానీకం అత్యంత నమ్మకం విశ్వాసంతో మాకు అధికారం అప్పగించారు. వారి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనల మేరకు రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా భూభారతి చట్టానికి, అలాగే ఇందిరమ్మ ఇండ్ల పధకానికి శ్రీకారం చుట్టాం’ అని చెప్పారు.

‘చట్టాన్ని రూపొందించడం ఒక ఎత్తైతే దాన్ని అమలు చేయడం మరో ఎత్తు. ఈ చట్టం ఫలితాలు ప్రతి పేదవానికి అందినప్పుడే చట్టం సార్ధకత నెరవేరుతుంది. ఈ చట్టాన్ని క్షేత్రస్ధాయిలో పటిష్టంగా అమలు చేయాల్సిన గురుతరమైన బాధ్యత మీ అందరిపై ఉంది. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. రెవెన్యూ కార్యాలయానికి వచ్చే సామాన్యుడు సైతం సంతోషపడేలా రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలి.’ అని మంత్రి పొంగులేటి కోరారు.
దేశానికి మోడల్‌గా తెలంగాణ డిజాస్టర్ మేనేజిమెంట్:
ప్రకృతి వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొని వీలైనంత వరకు ప్రాణ నష్టం, ఆస్ధి నష్టం జరగకుండా ఉండేలా తెలంగాణ డిజాస్టర్ మేనేజిమెంట్ అధారిటీ (తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్ధ)ని బలోపేతం చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేశానికి ఒక మోడల్‌గా ఉండేలా వ్యవస్ధను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణా సంస్ధ (TGSDMA) ను పునర్వ్యవస్ధీకరించినట్లు వెల్లడించారు. ఈ సంస్ధకు ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా ఉంటారని ఇందులో రెవెన్యూ, హోమ్, ఆర్ధిక, వైద్య ఆరోగ్యం, భారీ నీటిపారుదల, రహదారులు భవనాలు, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రులు సభ్యులుగానూ, చీఫ్ సెక్రటర్ మెంబర్ కన్వీనర్‌గాను, రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రత్యేక ఆహ్వానితునిగా ఉంటారని తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో గోదావరి, కృష్ణా నదీ పరివాహక జిల్లాల్లో వరద నిర్వహణపై ఆయా జిల్లాల కలెక్టర్లు , ఇతర ఉన్నతాధికారులతో చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు, విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌తో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ “వాతావరణ మార్పుల వల్ల ఆకస్మికంగా వచ్చే వరదలు, వర్షాల సమాచారాన్ని ఐఎండీతో సమన్వయం చేసుకొని శాస్త్రీయంగా విశ్లేషించుకొని ఎప్పటికప్పుడు పై స్ధాయి నుంచి కింది స్ధాయి వరకు అందించేలా వ్యవస్ధను రూపొందించుకోవాలి.సమాచార వ్యవస్ధ మరింత బలోపేతం కావాలి. రాష్ట్ర స్దాయిలో వర్షాలు, వరదలకు సంబంధం ఉన్న ఇరిగేషన్, విద్యుత్, హెల్త్, వ్యవసాయం, పోలీస్, రవాణా తదితర విభాగాలకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలను మనం అడ్డుకోలేం కానీ వాటి ప్రభావాన్ని తగ్గించడానికి ముందస్తుగా పటిష్టమైన చర్యలు తీసుకుంటే నష్టాన్ని వీలైనంతవరకు తగ్గించగలుగుతాం. ప్రధానంగా కృష్ణా గోదావరి పరీవాహక ప్రాంతాల అధికార యంత్రాంగం వరద ముంపును ముందుగానే గుర్తించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. దీనివలన మనం నష్టాన్ని తగ్గించినవారమవుతాం.’ అని అన్నారు.
‘నదీపరివాహక ప్రాంతాల్లో ఏ మేరకు వరద ఉధృతి వస్తే ఏఏ గ్రామాలు ముంపునకు గురౌతాయోనన్న సమాచారాన్ని నీటిపారుదల శాఖ ముందుగానే అందించాలి. ఇతర రాష్ట్రాలలో వచ్చే వరద వివరాలు, స్ధానికంగా పడిన వర్షం వివరాలు, ఎంత నీటిని విడుదల చేస్తారనే విషయాలు సవివరంగా ఉండాలి. నదీ పరివాహక ప్రాంతాల్లోని నివాసితులను వరదలు వచ్చిన ప్రతిసారీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం కంటే వారికి శాశ్వత నివాసం కల్పించాలి. ఇందుకు సంబంధించి నివాసితుల వివరాలను గుర్తిస్తే అదనపు కోటా కింద ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తాం. భారీ వర్షాలు, వరదల సమయంలో వాగుల్లో వంకల్లో చెరువుల్లో చిక్కుకు్న్నవారిని రక్షించడానికి ఎయిర్ లిఫ్ట్ మెకానిజాన్ని సిద్దం చేసుకోవాలి. ఈ ఎయిర్ లిఫ్ట్ వ్యవస్ద సరిగా లేకపోవడం వల్ల గత ఏడాది నా నియోజకవర్గం పాలేరులో చిక్కుకున్న బాధితులను రక్షించుకోలేకపోయాం’ అని ఈ సందర్బంగా మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.