(‘సమీక్ష’ ప్రత్యేక కథనం)
ఏబీ వెంకటేశ్వరరావు గుర్తున్నారు కదా? రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా పని చేశారు. రాష్ట్ర విభజనకు పూర్వం 1994 ప్రాంతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఆయన పలు అనుభవాలను ఎదుర్కున్నారు. ఇందులో ‘రాజకీయ’ అంశాలు ఎలా ఉన్నప్పటికీ, నక్సల్స్ అణచివేతకు సంబంధించి వివిధ ప్రభుత్వాల విధానాలను పోలీసు అధికారిగా ఆయన అమలు చేశారు. వివిధ జిల్లాల ఎస్పీగా, డీఐజీగా, ఐజీగా, ఇంటెలిజెన్ డీజీ హోదాల్లో నక్సల్స్ అణచివేతలో ఏబీవీ కూడా తన విధినిర్వహణను పూర్తి చేసి పదవీ విరమణ చేసి, ప్రస్తుతం విశ్రాంత ఐపీఎస్ అధికారిగా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల తాజా పరిస్థితిపై ఏబీ వెంకటేశ్వరరావు అత్యంత ఆసక్తికర వ్యాసాన్ని రాశారు. ఈ వ్యాసం ‘ఆంధ్రజ్యోతి’ ఎడిట్ పేజీలో గురువారం ప్రచురితమైంది. వాస్తవానికి ఐపీఎస్ అధికారులకు శిక్షణా కాలంలో నక్సల్ సబ్జెక్టుపైనా బోధనలు చేస్తారు. తీవ్రవాద సబ్జెక్టుపై పుస్తకాలు రాసిన ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. అయితే నక్సల్స్, ముఖ్యంగా మావోయిస్టుల తాజా పరిస్థితి, గతంలో ఆ సంస్థ అనుసరించిన విధానాలను సృశిస్తూ రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు ఈ కథనాన్ని అత్యంత లోతుగా, విశ్లేషణాత్మకంగా రాయడం గమనార్హం.

ఈ వ్యాసంలో ఆయన ప్రస్తావించిన అంశాలు అనేకం ఆలోచనాత్మకంగా పలువురు భావిస్తున్నారు. మావోల ఉద్యమాన్ని కాకుండా వాళ్లు అనుసరించిన విధానాలను, దారి తప్పిన తీరును ఏబీవీ ఆక్షేపించడం గమనార్హం. నక్సల్స్ త్యాగాలవల్ల అధికారం ఎవరు చెలాయిస్తున్నారనే అంశాన్ని అంతర్లీనంగా చెప్పారు. నిలకడలేని విధానాలు పాలకపాార్టీలకు ఉపకరించడమేగాక, ఎవరూ నమ్మని స్థితిని తెచ్చుకున్నారని చెప్పకనే చెప్పారు. వర్తమాన పరిస్థితులకు, పరిణామాలకు ‘విప్లవ బద్దకం’ కూడా కారణంగా ప్రస్తావించారు. ఒక ఐపీఎస్ అధికారి నక్సల్ ఉద్యమంపై ఇంత లోతైన విశ్లేషణ చేయడమే అసలు విశేషం. మొత్తంగా ప్రాణత్యాగాలు చేసిన నక్సల్స్ కు ఆయన ‘లాల్ సలాం’ అర్పించడం ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం.

తన వ్యాసంలో ఏబీ వెంకటేశ్వరరావు ప్రస్తావించిన ముఖ్యాంశాలను ఓసారి పరిశీలిస్తే..
‘ఒక పక్క ఎన్నికలు బహిష్కరించమని పిలుపులిస్తూ, పోలింగ్ స్టేషన్ల మీద దాడులు చేస్తూ, బ్యాలెట్ బాక్సులు ధ్వంసం చేస్తూ, ఇంకో పక్క 1983, 85 ఎన్నికలలో ఎన్టీఆర్‌ను, 1989లో చెన్నారెడ్డిని, 1994లో మళ్లీ ఎన్టీఆర్‌ను సమర్థించి, 1999, 2004లో తెలుగుదేశానికి బద్ధ వ్యతిరేకంగా పనిచేసి ఏం సాధించారు? వీళ్లతో ఎప్పటికయినా ప్రమాదమే అని అన్ని ప్రధాన పార్టీలకూ సంకేతాలివ్వడం తప్ప! తీరా 2009 నాటికి ఎన్నికలలో ఏ ప్రభావమూ చూపలేని పరిస్థితికి దిగజారిపోయారు’ అని వ్యాఖ్యానించారు.
‘1995లో ఉత్తర తెలంగాణను విముక్త గెరిల్లా ప్రాంతంగా ప్రకటించుకుని, ప్రత్యేక తెలంగాణకు పిలుపునిచ్చారు. దాన్ని వీవీ, బాలగోపాల్, కోదండరామ్, హరగోపాల్, గద్దర్‌లు విస్తృతంగా ప్రజల్లోకి, విద్యార్థుల్లోకి తీసుకెళ్లారు. కానీ తీరా తెలంగాణ ఏర్పడే నాటికి ఆ ప్రాంతాల్లో సాయుధ పోరాట దళాలే కనుమరుగైపోయి, పొరుగు రాష్ట్రాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి. మరి ప్రత్యేక తెలంగాణ పోరాటం ఏ దోపిడీ వర్గాల ప్రయోజనం కోసం చేసినట్టు?’ అని ప్రశ్నించారు.
‘ఇలా చరిత్ర చౌరస్తాలో ఎన్నోసార్లు నిలబడ్డా, సాయుధ పంథాను, వాస్తవ పరిస్థితులను, ప్రపంచ గమనాన్ని, టెక్నాలజీ ప్రభావాన్నీ ఎప్పుడూ సీరియస్‌గా సమీక్షించకుండా, విప్లవ బద్ధకాన్ని ప్రదర్శించడం వల్లే, ఈ వారించదగిన ప్రాణనష్టం, పరువు నష్టం జరిగాయేమో అని ఆలోచించాల్సిన సమయమిది. పూర్తిగా అశక్తులై… అవకాశమివ్వండి, చర్చలకొస్తాం అని అభ్యర్థించే స్థాయికి రావడం వెనుక వ్యూహాత్మక తప్పిదాలు, మేధావి వర్గాల ఉపసంహరణ, కొట్టుకుపోయే ధోరణులు ఎంతవరకు కారణమో విశ్లేషించుకోవాలి.’ అని సూచించడం గమనార్హం.

‘నష్టపోయారు, ఓడిపోయారు కాబట్టి అపహాస్యం చెయ్యడం అనాగరికం. ఇరువైపులా పోయిన ప్రాణాలన్నీ మనవే. చరిత్రలోని ఈ అధ్యాయం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలను విస్మరిస్తే, భవిష్యత్తులో మరిన్ని కష్టాలు, నష్టాలు తప్పవు. స్వాతంత్య్ర పోరాటంలో మిలిటెంటు రాజకీయాల వల్ల జరిగిన ప్రాణ నష్టాలతో పోలిస్తే, తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన నష్టాలు ఎక్కువ. దానితో పోలిస్తే మావోయిస్టు సాయుధ ఉద్యమంలో జరిగిన ధన, ప్రాణ నష్టాలు కొన్ని వందల రెట్లు ఎక్కువ. ఈ మూడింట్లో ఏవీ నిరుపయోగంగా జరగలేదు. అన్నిటివల్లా సమాజానికి ఎంతో కొంత మేలే జరిగింది. కానీ అంతకన్నా తక్కువ త్యాగాలు, నష్టాలతో, ప్రత్యామ్నాయ పోరాట మార్గాలలో ఎక్కువ మేలు జరిగే అవకాశాలు ఉన్నాయా అని ఇప్పటికైనా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇన్ని పోరాటాలు చేసి, ఇన్ని త్యాగాలు చేసి, చివరకు రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను ఎటువంటి శక్తులకు అప్పజెప్పాం?’ అని కాస్త లోతుగానే ప్రశ్నించారు.
‘తుపాకులు, మందుపాతర్లు, ప్రజాకోర్టులు మాదకద్రవ్యాల్లాంటివి. అలాగే బూటకపు ఎన్‌కౌంటర్లు కూడా. ఒకసారి అలవాటుపడితే వెనక్కి రావడం కష్టం. ప్రజల మెదళ్లలో నెగళ్లు రాజేసి, వాళ్లనే ఆలోచనాపరుల్ని చేయనంతకాలం రాజకీయాలను అవుట్సోర్సింగ్‌కి ఇచ్చేయడానికే అలవాటుపడతారు. సమస్యలు వారివి అయినపుడు పరిష్కారాల కోసం ప్రత్యామ్నాయాలు వెతుక్కునే పని కూడా వారిదే. దానికోసం విస్తృత స్థాయిలో త్యాగాలు చెయ్యనక్కరలేదు. వకాల్తా పుచ్చుకుని ప్రాణ త్యాగాలు చేసినంత మాత్రాన ప్రేక్షకుల ఆలోచనాస్థాయి మారదు. బల ప్రయోగంతో బానిసల్ని చెయ్యగలరు గానీ, బలవంతాన ఎవర్నీ స్వతంత్రుల్ని చెయ్యలేం. ఈ సుదీర్ఘ పోరాట ప్రయోగంతో ‘చితి’కిపోయిన ప్రాణాలకు, కుటుంబాలకు లాల్ సలాం.’ అంటూ ఏబీ వెంకటేశ్వరరావు తన వ్యాసానికి ముగింపునిచ్చారు.

