నాలుగు ఉమ్మడి జిల్లాలు.. జిల్లా ఇంచార్జ్ లు సహా ఏడుగురు మంత్రులు.. ఇద్దరు ప్రభుత్వ విప్ లు.. ఇరవై మంది ఎమ్మెల్యేలు.. పార్టీ అధ్యక్షుడు.. రాజకీయంగా కాకలు తీరి మంత్రుల హోదాలో గల ఉత్తమ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సీతక్క.. ఇంత మంది యోధానుయోధ అధికార పార్టీ నాయకులు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఎన్నికల్లో గెలిపించలేరా? మొత్తం 3 లక్షల 59 వేల 672 మంది గ్రాడ్యుయేట్లను తమ ప్రచారం ద్వారా ప్రభావితం చేయలేరా? ఎందుకీ ప్రశ్నలంటే..?
మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో కూడుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార రంగంలోకి దిగడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసిందనే చెప్పాలి. రాష్ట్ర శాసన మండలి ఎన్నికల చరిత్రలోనే సీఎం స్థాయి నాయకుడు ప్రచారంలో పాల్గొన్న ఉదంతం ఇప్పటి వరకు లేదనే చెప్పాలి. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసిన దిలీప్ కుమార్ విజయం కోసం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రచారంలో పాల్గొన్నప్పటికీ, ఆ సమయంలో ఆయన సీఎం హోదాలో లేకపోవడం గమనార్హం. గుర్తున్నంత వరకు… ఎన్టీఆర్ రద్దు చేసిన శాసనమండలి పునరుద్ధరణ తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగాని, కిరణ్ కుమార్ రెడ్డిగాని, కొణిజేటి రోశయ్యగాని ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనలేదు. ఒకరిద్దరు సీఎంలు పార్టీ విజయం కోసం మానిటరింగ్ మాత్రమే చేశారు.
ఇందుకు భిన్నంగా సీఎం సీటులో గల రేవంత్ రెడ్డి వంటి నాయకుడు నేరుగా రంగంలోకి దిగి, ఒకే రోజు మూడు బహిరంగ సభల్లో పాల్గొనడమే అసలు విశేషం. ‘పట్టభద్రుల సంకల్ప సభ’ పేరుతో నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేశారు. తమ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. కేవలం ఓ ఎమ్మెల్సీ సీటు గెల్చినా, ఓడినా ప్రభుత్వానికి జరిగే నష్టమేమీ లేదని చెబుతూనే, తాము చేసిన మంచిని పరిగణనలోకి తీసుకుని డిగ్రీ హోల్డర్లు ఓటు వేయాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఒకేరోజు జరిగిన మూడు సభల్లో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలను అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ పార్టీలు తమకు అనుకూలంగా మల్చుకుని ఎదురుదాడి తరహా ప్రచారానికి దిగారనేది వేరే విషయం.

కానీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం స్థాయి నాయకుడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే రాజకీయంగా జరుగుతున్న వేడివేడి చర్చ. సాధారణ ఎన్నికలను మరిపించేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జరిగిందనే చెప్పాలి. హోర్డింగులు, అభ్యర్థులు కటౌట్లు, ప్రచార రథాలు, వాయిస్ ఎస్మెమ్మెస్ లు, టెలీకాలర్లతో ఫోన్లు, ఇంటింటి ప్రచారం వంటి కార్యక్రమాలను అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు పోటాపోటీగా నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి తరపున ఆ పార్టీ నాయకుడొకరు ప్రత్యేక మేనిఫెస్టోను కూడా తయారు చేయడం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సరళిలో ఓ విశేషం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థితో పోటీ పడుతున్నది బీజేపీ అభ్యర్థి మాత్రమే. ఓటమి భయంతో కాబోలు బీఆర్ఎస్ కనీసం అభ్యర్థిని పోటీలో నిలపలేకపోయింది. ఈ సమయంలోనే జరుగుతున్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సైతం అభ్యర్థులను నిలపలేదు. కానీ పీఆర్టీయూ తరపున పోటీ చేస్తున్నవారు కాంగ్రెస్ అభ్యర్థులుగానే ప్రచారంలో ఉన్నారు. గెలిస్తే ఈ అభ్యర్థులు కాంగ్రెస్ ఖాతాలోకే వెడతారని అంటున్నారు.
ప్రస్తుతం ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టి. జీవన్ రెడ్డి ఉండగా, ఈసారి ఆయన పోటీ చేయడం లేదు. దీంతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ భారీ కసరత్తునే చేసినట్లు స్పష్టమవుతోంది. ఉత్తర తెలంగాణాలో నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలను కలిగి ఉన్న బీజేపీ అభ్యర్థితోనే కాంగ్రెస్ అభ్యర్థి తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత సంప్రదాయానికి తెర దించుతూ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడంపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రచార సభల్లో ఆయన పేర్కొన్నట్లు కాంగ్రెస్ అభ్యర్థి గెల్చినా, ఓడినా ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ ఉండకపోవచ్చు. కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ విజయం సాధించిన ఎనిమిది ఎంపీ స్థానాల్లో నాలుగు మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ సీట్లే కావడం ఈ సందర్భంగా గమనార్హం.

ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు భావించవచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమిపాలైతే ప్రభుత్వానికి, పార్టీకి ఇప్పటికిప్పుడు వచ్చే నష్టమేమీ ఉండకపోవచ్చు. కానీ పొరుగున ఆంధ్రప్రదేశ్ లో గతంలో జరిగిన నాలుగు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో ఓటమిని చవి చూసింది. విపక్ష తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఫలితంగా జగన్ ప్రభుత్వం ఓడిపోతోందనే మౌత్ టాక్ పబ్లిసిటీ బీభత్సంగా జరిగింది. ఆ తర్వాత ఏపీలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఫలితాలేమిటో తెలిసిందే. ఆయా ఘటనను పరిశీలించినపుడు ఇదే కోణంలో రేవంత్ రెడ్డి సీఎం స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారపు మొత్తం ఎపిసోడ్ లో తాను పాల్గొన్న మూడు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ గా ఎంచుకుని విమర్శనాస్థ్రాలు సంధించారనే వాదన ఉండడం. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులెవరూ పోటీలో లేకపోయినా, గులాబీ పార్టీ తీరుపైనే కామెంట్స్ చేస్తూ ఎక్కువ సేపు సీఎం ప్రసంగం సాగింది. బీఆర్ఎస్ పార్టీ లోపాయికారిగా బీజేపీ గెలుపునకు సహకరిస్తోందని, చీకటి ఒప్పందంలో ఇదో భాగమని ఆరోపించారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాన్ని సీఎం రేవంత్ రెడ్డి రెఫరెండంగా తీసుకుంటారా? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసురుతున్నారు. ఇంకో అడుగు ముందుకేసి తమది ఇండియా టీం అని, కాంగ్రెస్ ది పాకిస్థాన్ టీం అని సంజయ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. మొత్తంగా పరిశీలించినపుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడం వెనుక ఉత్తర తెలంగాణాలో బీజేపీ దూకుడుకు బ్రేక్ వేయడమే లక్ష్యంగా భావించవచ్చు. ఆయన ప్రయత్నం ఫలిస్తుందా? లేదా? అనేది వేచి చూడాల్సిన అంశం.