Friday, October 17, 2025

Top 5 This Week

Related Posts

మల్లోజుల ‘లొంగుబాట’లో ఇదీ అసలు సిసలు న్యూస్ స్టోరీ

గడ్చిరోలి: మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ తోపాటు మరో 60 మంది సాయుధ నక్సలైట్లు తమ ఆయుధాలను అప్పగిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం లొంగిపోయిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ సహా 61 మంది మావోయిస్టుల గురించి మీడియా భిన్నకోణాల్లో వార్తలు అందించింది. ప్రింట్ మీడియాలో ఈ ఉదంతానికి సంబంధించి రేపటి సంచికల్లో భారీ స్థాయిలోనే వార్తా కథనాలు, ఫాలో అప్ స్టోరీలు రావచ్చు. కానీ నక్సలైట్లు లొంగిపోయిన ఈ ఘటనలో ‘విస్తార్ డిజిటల్’ అనే ఓ యూ ట్యూబ్ ఛానల్ సోదరుడు భిన్న కోణంలో అత్యంత ఆసక్తికర వార్తా కథనాన్ని అందించడం విశేషం.

మల్లోజుల వేణుగోపాల్ సహా 61 మంది మావోయిస్టులు లొంగిపోయిన సభా వేదిక వద్దే కనిపించిన ఓ స్టీల్ కంపెనీ జనరల్ మేనేజర్ ప్రభాకరన్ ను ఈ జర్నలిస్టు సోదరుడు భలే పట్టేసుకున్నారు. గన్ మైకు ముందు పెట్టి ఈ జర్నలిస్టు సోదరుడు అడిగిన పలు ప్రశ్నలకు సదరు స్టీల్ కంపెనీ జీఎం ప్రభాకరన్ అత్యంత ఆసక్తికర సమాధానాలివ్వడం విశేషం. ఇంతకీ ప్రభాకరన్ ఏమంటారంటే.. గడ్చిరోలి ప్రాంతలో గల తమ స్టీల్ కంపెనీలో సోనుదాదా అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ కేగాక, లొంగిపోయిన మిగతా మావోయిస్టులకు కూడా ఉద్యోగాలిస్తామని చెప్పారు. జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్లకు ఆరునెలల పాటు సరైన శిక్షణనిచ్చి ఉద్యోగాల్లోకి తీసుకుంటామన్నారు.

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముందు తుపాకీతో సహా లొంగిపోయిన మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్

ప్రభుత్వానికి లొంగిపోయిన మావోలు స్థానికులే కాబట్టి వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. అంతేకాదు ప్రస్తుతం తమ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులను షేర్ హోల్డర్లుగా మార్చామని, ఆయా షేర్ల విలువ ప్రస్తుతం లాభదాయకంగా పెరిగిందని కూడా చెప్పారు. ప్రస్తుతం లొంగిపోయిన నక్సల్స్ కు ఉద్యోగాలిచ్చి తమ స్టీల్ కంపెనీలో ఉపాధి కల్పిస్తామని, వారినీ షేర్ హోల్డర్లుగా మారుస్తామని ఆయన పేర్కొన్నారు. నక్సలైట్లు లొంగిపోయిన సభా వేదికవద్దే కనిపించిన గడ్చిరోలిలోని స్టీల్ కంపెనీ జీఎం ప్రభాకరన్ ఈ అంశంలో ఇంకా ఏమంటున్నారో దిగువన గల వీడియో లింక్ ద్వారా వీక్షించవచ్చు..

Popular Articles