Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

దేవునితోనైనా కొట్లాటకు సిద్ధం: సీఎం కేసీఆర్

తెలంగాణ వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకునే విషయంలో దేవునితోనైనా కొట్లాటకు సిద్ధమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందని, స్వరాష్ట్రంలో వ్యవసాయ రంగంలో పండుగ వాతావరణం నెలకొన్నదన్నారు. పంటల దిగుబడిలో తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా నిలిచాడని, తెలంగాణ రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా మారిందని పేర్కొన్నారు. సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తూ నదీజలాలను ఒడిసిపట్టుకొని తెలంగాణ బీళ్లను సస్యశ్యామలం చేస్తున్నామన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణకు గోదావరి, కృష్ణా నదీ జలాల్లో హక్కుగా వచ్చే ప్రతీ నీటిబొట్టును కూడా వినియోగించుకొని తీరుతామన్నారు. ఈ దిశగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ నదీ జలాల అంశంపై ఈనెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరపున బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాన్ని గురువారం ప్రగతిభవన్ లో జలవనరులశాఖ ఉన్నతాధికారులతో జరిపిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం ఖరారు చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి. వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు అబ్రహం, సురేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎంఓ అధికారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, నీటిపారుదలశాఖ సలహాదారు ఎస్.కే.జోషి, ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, ఈఎన్సీలు మురళీధర్ రావు, బి.నాగేందర్ రావు, హరిరాం, సీఈలు నర్సింహ, శంకర్, రమేశ్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.

Popular Articles