(వ్యాసకర్త: తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి)
క్రమశిక్షణ,
అంకితభావం,
కష్టపడే తత్త్వం,
వెరసి..
వ్యవసాయక శాస్తవేత్త మారెడ్డి రంగారెడ్డి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా తన బాధ్యతలు కొనసాగిస్తూ రైతుల మనిషిగా మారెడ్డి రంగారెడ్డి పేరుగాంచారు. ముఖ్యంగా కుటుంబం, ఉద్యోగం, ఇది మాత్రమే తన జీవితంగా కాకుండా, రైతుల కోసం ఏదో చేయాలని తపిస్తూ, రైతులతోనే ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడిన అరుదైన ఉత్తమ ఉద్యోగి రంగారెడ్డి.
▪పరిచయం:
ప్రకాశం జిల్లా కంభంలో 1936 ఏప్రిల్ ఒకటవ తేదీన సాధారణ రైతు కుటుంబంలో రంగారెడ్డి జన్మించారు. మారెడ్డి బాలరంగారెడ్డి – కాశమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, ఒకరు రంగారెడ్డి, మరొకరు కోటిరెడ్డి. చిన్నతనం నుండే వ్యవసాయం మీద ఆసక్తి ఉండటంతో పాఠశాల మీద పెద్దగా ఆసక్తి కనబర్చలేదు రంగారెడ్డి. తన సోదరుడు కోటిరెడ్డి పాఠశాలకు వెళ్తుంటే, తాను మాత్రం వ్యవసాయ పొలాలు , పంటలు, పాడి, వీటి మీద అమితమైన ప్రేమ వాత్సల్యాన్ని కనబరుస్తూ, తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలో బాగా పెద్దవాడయ్యాక ఆలస్యంగా పాఠశాలలో చేరారు.
అగ్రికల్చర్ బిఎస్సీ తర్వాత 1960 -1966 లలో వ్యవసాయ కళాశాల బాపట్ల నుండి జన్యుశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత పిహెచ్.డి అవార్డు పొందారు. 1980లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా తన వృత్తిని ప్రారంభించి అనతి కాలంనే
అనూహ్య విజయాలు సాధించి పై మెట్టు చేరుకున్నారు. అత్యుత్తమ పత్తి బ్రీడర్‌గా తనని తాను నిరూపించుకున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి మొదట ఫారెస్ట్ విభాగంలో ఉద్యోగంలో చేరినప్పటికీ, తర్వాత తనకు ఎంతో ఇష్టమైన వ్యవసాయం కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంచుకున్నారు.

▪వృత్తిధర్మంలో:
కాటన్ స్పెషలిస్ట్, కాటన్ బ్రీడర్ వంటి వివిధ పదవులకు ఎదిగిన రంగారెడ్డి, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయవిశ్వవిద్యాలయం నంద్యాల శాఖలో సీనియర్ సైంటిస్టుగా చాలా కాలం పనిచేశారు. ఇక్కడి నుండే వ్యవసాయాధారితమైన భావి భారతానికి కొత్త వంగడాలను సృష్టించారు. ఈ క్రమంలో పత్తి, నూనె గింజలు, జొన్న, మొక్కజొన్న, రకాల్లో దిగుబడిని పెంచే రకాలకు ప్రాణం పోశారు. దర్శి, తెనాలి, మాధోల్, ఆదిలాబాద్, నంద్యాల్ వంటి పరిశోధనా స్టేషన్లలో పనిచేశారు. R.A.R.S. నంద్యాలకు ఒక గౌరవప్రదమైన స్థానం దక్కడంలో రంగారెడ్డి కృషి ప్రముఖమైనది.
▪కనుగొన్న వంగడాలు:
పత్తి ప్రాజెక్టుకు ఇన్‌చార్జిగా, పత్తి రకాలు సంకరజాతుల అభివృద్ధిలో రంగారెడ్డి కృషి గణనీయమైనది. ఇతను కనుగొన్న పత్తి రకాలు ప్రస్తుతం రైతుల ఆదరాభిమానాలను చూరగొంటున్నాయి. వాటి వివరాలు:
NA – 1280 (తెల్ల పురుగు నివారిణి )
NA – 1325 ( నరసింహ్మ)
NA – 920 (ప్రియ )
HYPS – 152
మహాలక్ష్మి ,విజయలక్ష్మి , దేశవాళి రకాలైన శ్రీశైలం , అరవింద , కనుగొన్నారు.
పత్తి సంకరాల్లో NHH 390, NCA 212 ,భాగ్యలక్ష్మి (ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడ్)మొదలైనవి.
దేశీ సంకరాల్లో NCA 176, NCA 205, NCA 212. మొదలైనవి.
న్యూక్లియస్ & ఫౌండేషన్ సీడ్ ప్రొడక్షన్, మంచి నాణ్యమైన న్యూక్లియస్ & బ్రీడర్ సీడ్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా వీరు దేశానికి సహాయం చేసిన శాస్త్రవేత్తల వరసలో నిలబడ్డారు.
రంగారెడ్డి కృషి పట్టుదలకు నిదర్శనాలు. ఇతని పరిశోధనా ఫలితాలు రైతుల పాలిట వరమే అయ్యాయి. రంగారెడ్డి సృష్టించిన రకాలు అధిక దిగుబడికి లాభాలకు ఆమోదయోగ్యంగా ప్రయోగశాలల నుండి నాణ్యతా గుర్తింపును సంపాదించుకున్నాయి.
RARS నంద్యాల్లో రంగారెడ్డి కృషి ఫలితంగా ఉద్భవించిన..
1) HYPS – 152 ( Big Boll & Good Staple Length )
2) NA 1325 (నరసింహ)
ఈ రెండు రకాలు కాటన్ హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్‌లో తల్లిదండ్రులుగా విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి.
విత్తన పరిశ్రమల చేత కాటన్ హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో నోటిఫై చేయని HYPS152 పేరెంట్‌గా విస్తృతంగా ఉపయోగించబడుతున్న పరిస్థితుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పత్తి పండించే రైతులు వీటి కారణంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.
▪జాతీయ స్థాయిలో కథనాలు:
జాతీయ అంతర్జాతీయ పత్రికల్లో రంగారెడ్డి శాస్త్రీయ కథనాలు ప్రచురితమయ్యాయి. ఇతని వ్యాసాలు సంబంధిత పరిశోధనా సంస్థలకు , విత్తన పరిశ్రమలకు, వ్యవసాయ సంఘాలకు, తద్వారా దేశవ్యాప్త రైతులకు మార్గదర్శకత్వం వహించాయి.
▪కల్తీ విత్తనాల్ని అరికడుతూ..:
పత్తి రకాలలో లాభదాయకమైన సంకరజాతులను ఉత్పత్తి చేసి పత్తి రైతులకు వారు చేసిన సేవ ప్రస్తుతం ఫలితాల రూపంలో కనిపిస్తుంది. కాగా ఈ ఫలితాలను కాలరాసే ప్రయత్నంగా కొన్ని నకిలీ విత్తనాల పరిశ్రమలు బయలుదేరి రైతుల్ని నిలువునా ముంచే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాయి. ఈ క్రమంలో విత్తన జన్యు స్వచ్ఛతను గుర్తించడంలో అగ్రగామిగా ఉన్న రంగారెడ్డిని ఈ పరిశ్రమల పేరిట కొందరు అక్రమార్కులు ఆశ్రయించారు. నకిలీ విత్తనాలను శుద్ధి విత్తనాలుగా ప్రచారం చేస్తూ రంగారెడ్డి సంతకాన్ని ఆశించారు. . లక్షల లంచం ఎరజూపారు. కానీ ఒక రైతుగా రైతు పక్షపాతిగా ఈ మోసాన్ని వ్యతిరేకించారు రంగారెడ్డి. లక్షల రూపాయలని తిప్పి పంపించారు.
రోజు రోజుకు పెరుగుతున్న నకిలీ విత్తనాల విషయంలో రంగారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా స్వచ్ఛందంగా రైతుల కోసం తన విజ్ఞానాన్ని ధారపోయడం మొదలెట్టారు. కుటుంబాన్ని కూడా కలుసుకోకుండా గ్రామాలు పర్యటించడం మొదలెట్టారు. అవగాహనా పాఠాల నిమిత్తం రైతులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఇవన్నీ ఉద్యోగ ధర్మంలో భాగంగా కాదు, వ్యక్తిగతంగా కొనసాగించారు.
అక్రమంగా సంపాదించుకునే మార్గాలను నిస్వార్థంగా మూసివేసిన రంగారెడ్డి వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే., తాను మరణించే వరకు తనకు ఉన్నది ఐదు చొక్కాలు మాత్రమే. ప్రభుత్వం కేటాయించిన అద్దె ఇల్లు మాత్రమే. దీన్ని బట్టి రంగారెడ్డి గారి నిజాయితీని, నిరాడంబరతను అర్థం చేసుకోవచ్చు.

అవార్డులు:
ఉత్తమ శాస్త్రవేత్తగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మాత్రమే కాకుండా, జాతీయ స్థాయిలో కూడా ఆయనకు అవార్డులు లభించాయి. సెప్టెంబర్ 30, 2009 న సీడ్స్‌మెన్ అసోసియేషన్ హైదరాబాద్ – ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వారు తమ 14 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రంగారెడ్డి సేవలను గుర్తిస్తూ జీవిత కాల సాఫల్య పత్రాన్ని ప్రకటించారు.
▪ధర్మ గుణం:
స్వతహాగా ధర్మ గుణం కూడా ఎక్కువగా ఉన్న రంగారెడ్డి, తన పర్యటనల్లో పేద రైతులను గుర్తించి తన శక్తిమేర ఆదరించేవారు. తన వద్ద పనిచేసే కాంట్రాక్టు సిబ్బందిని పర్మనెంటు ఉద్యోగులుగా మార్చడంలో తనదైన చొరవ చూపించారు. రంగారెడ్డి వల్ల ఉద్యోగాలు పొందిన కుటుంబాలు ఇప్పటికీ అతన్ని గుర్తుకు చేసుకుంటున్నాయి. రెడ్లు ప్రకటించే విరాళాలతో అఖిల భారత రెడ్ల సంఘం శ్రీశైలం వారు నిర్మించే భవన సముదాయాల్లో కూడా రంగారెడ్డి వితరణ ఉండడం విశేషం.
▪కుటుంబం:
రంగారెడ్డి వివాహం 1960లో రాజకుమారితో జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు, ఉన్నారు.
👏మరణం:
1990 అక్టోబర్ 3న తన 54వ ఏట రంగారెడ్డి మరణించారు. అప్పటికి ఉద్యోగ నిర్వహణలోనే ఉన్నారు. నేల స్వభావాన్ని, పంటరకాలను పరిశీలిస్తూ పొలాల్లో తిరుగుతున్న సమయంలో కేవలం మేకు గుచ్చుకుని గాయం విషమించడం ద్వారా రంగారెడ్డి ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. లేదంటే మరిన్ని వంగడాలను సృష్టించి రైతు లోకానికి మరిన్ని సేవలు అందించేవారు. మొత్తంగా నిజాయితీకి మారుపేరుగా బతికి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తనదైన సామాన్య జీవితం ద్వారా రంగారెడ్డి నిరూపించారు.

