ప్రధాని మోదీ ప్రశంసల వర్షంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తడిసి ముద్దయ్యారు. ప్రధాని తనను పొగుడుతుంటే చంద్రబాబు తనివితీరా ఆస్వాదించారు. ఏపీ రాజధానిలో దాదాపు రూ. 60 వేల కోట్ల విలువైన అమరావతి పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సాలు చేసిన అనంతరం సభలో ప్రధాన నరేంద్ర మోదీ ప్రసంగించారు. చంద్రబాబును మిత్రునిగా, పవన్ కళ్యాణ్ ను శక్తిమంతునిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. తన పూర్తి ప్రసంగంలో పలుసార్లు ప్రధాని చంద్రబాబును ప్రశంసించారు.. ప్రసంగాన్ని తొలుత తెలుగు పదాలతో ప్రారంభించిన ప్రధాని మధ్య మధ్యలోనూ తెలుగులోనే ప్రసంగించడం విశేషం.

కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. ఇంద్రలోకం పేరు అమరావతి అని చెబుతూ, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ అభివర్ణించారు. స్వర్ణాంధ్ర విజన్ కు అమరావతి శక్తినిస్తుందన్నారు. అమరావతి కేవలం ఒక నగరం కాదు, ఒక శక్తిగా పేర్కొన్నారు. టెక్నాలజీ తనతో మొదలైనట్లు చంద్రబాబు ప్రశంసిస్తున్నారని, కానీ నేనో రహస్యం చెబుతానంటూ.. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, హైదరాబాద్ లో ఐటీని చంద్రబాబు ఏరకంగా డెవపల్ చేస్తున్నారో చూసి అధ్యయనం చేయాలని అధికారులను పంపినట్లు ప్రధాని చెప్పారు.

తన అనుభవంతో చెబుతున్నానని, భారీ స్థాయిలో ప్రాజెక్టలు చేపట్టాలన్నా, వాటిని త్వరగా పూర్తి చేయాలన్నా, నాణ్యతతో నిర్మించాలన్నా.. ఇటువంటి విషయాల్లో దేశంలోనే చంద్రబాబును మించి మరెవరూ లేరని సభాముఖంగా చెబుతున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. తాను 2015లో ప్రజారాధాని అమరావతికి శంకుస్థాపన చేశానని, కేంద్రం అన్ని రకాలుగా మద్ధతుగా నిలిచిందని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో మరింత వేగంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు వెడుతుందని చెప్పారు.

వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం ఎన్టీఆర్ కలగన్నారని, మనందరం కలిసి ఎన్టీఆర్ కలను నిజం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘చంద్రబాబుగారూ.., బ్రదర్ పవన్ కళ్యాణ్.. ఇది మనం చేయాలి.. ఇది మనమే చేయాలి’ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో పిలుపునిచ్చారు. అమరావతి నిర్మాణానికే కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని, బాసటగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

ప్రధాని ప్రసంగానికి ముందు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు కూడా ప్రసంగించారు. చంద్రబాబు తన ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రస్తుతం గంభీరంగా ఉన్నారని చెప్పారు. ఎప్పుడూ ఆహ్లాదంగా ఉండే ప్రధాని తాను అమరావతికి రావాలని ఆహ్వానించడానికి వెళ్లినపుడు గంభీరంగా ఉన్నారని, అందుకు పహిల్గం ఉగ్రదాడే కారణమని చెప్పారు. సభలో ప్రసంగం పూర్తి చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రధాని పిలిచి చాక్లెట్ ఇవ్వడం ఆసక్తికరం.