ఖమ్మం: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు సంయుక్తంగా విజయవంతం చేయాలని మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు కోరారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, జారే ఆది నారాయణ, మాలోతు రాందాస్ నాయక్, తెల్గం వెంకట్రావు, కోరం కనకయ్య, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంా 99 రోజుల కార్యక్రమంలో చేపట్టే కార్యాచరణను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ వివరించారు.

ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 99 రోజుల కార్యాచరణను ప్రణాళిక ప్రకారం అమలు చేయాలన్నారు. ఆర్థిక స్థితిగతులు సహకరించకపోయినా పేదల సంక్షేమంకోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజల గడపకు చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు.
రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నారు. రైతులు పండించే పంటకు బోనస్ అందించి వారిలో విశ్వాసం కల్పించడమే కాకుండా పేదలకు నాణ్యమైన సన్న బియ్యం రేషన్ ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్నదని చెప్పారు. గతంలో మధ్యవర్తులు లబ్దిదారుల పేరిట మీద ఇండ్లు మంజూరు చేయించుకొని డబ్బులు వసూలు చేసుకున్నారని, నేడు అటువంటి లబ్దిదారులకు ఇండ్లు లభించకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో మంజూరు చేసే ఇందిరమ్మ ఇండ్లలో పేదల పట్ల అధికారులు మానవతా దృక్పథంతో పని చేయాలని అన్నారు.

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పేదలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేసుకునే ఉద్దేశంతో ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రోగ్రాం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమం ప్రతి గ్రామం, పట్టణానికి చేరువ చేసేందుకు అనుసరించాల్సిన విధానంపై చర్చించేందుకు ఉమ్మడి జిల్లా స్థాయిలో సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పది సెక్టార్లకు సంబంధించి రూపొందించిన ప్రణాళిక క్షేత్ర స్థాయిలో కట్టుదిట్టంగా అమలు అయ్యేలా చూడాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్స్ కు తహసిల్దార్ క్యాడర్ కు తగ్గకుండా ఒక అధికారిని ఇంచార్జిగా నియమించాలన్నారు. వీరు ప్రతి వారానికి ఒకసారి వెళ్లి అక్కడ భోజనం నాణ్యత పరిశీలించాలని, అక్కడ ఏదైనా తప్పు జరిగితే సంబంధిత అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. గ్రౌండింగ్ కాని ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఆసక్తి లేని పక్షంలో అదే గ్రామంలో మరో లబ్ధిదారునికి కేటాయించాలని మంత్రి తెలిపారు. మార్చి చివరి వరకు మొదటి విడత మంజూరు చేసిన ప్రతి ఇల్లు గ్రౌండ్ కావాలన్నారు.
99 రోజుల కార్యాచరణలో భాగంగా హెల్త్ సెక్టార్ పని తీరు మెరుగ్గా ఉండాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులవద్ద అందుబాటులో ఉన్న యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించేందుకు అవసరమైన స్టాఫ్ అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యత ఆధారంగా ఈ కార్యక్రమం అమలుకు నిధులు కేటాయిస్తుందన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా డ్రైయిన్ వల్ల ఇబ్బందులు ఎక్కడ ఉంటున్నాయో పరిశీలించి అక్కడ అవసరమైన మరమ్మత్తు పనులు చేపట్టాలన్నారు. మార్చి 12న ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలన్నారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య ఉన్న భూ సమస్యలు జాయింట్ సర్వే ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని, వీటిని సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ నిధుల వినియోగం ఎలా జరుగుతుందో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎకో పార్కుల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు వ్యవసాయ రంగంలో చాలా అంశాల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పంట మార్పిడి, ఎరువుల, రసాయనాల వినియోగం తగ్గించడం, ఆధునిక సాగు పద్ధతులు వంటి అంశాలను ప్రచారం కల్పించాలని మంత్రి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఈ సమావేశంలో ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, భద్రాచలం ఐటిడిఎ పీవో బి. రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, వివిధ శాఖల ఉమ్మడి జిల్లా అధికారులు, మునిసిపల్ చైర్ పర్సన్లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
