మయన్మార్ కేంద్రంగా భారీ భూకంపం పలు దేశాలను వణికించింది. థాయ్ లాండ్, మయన్మార్, బంగ్లాదేశ్ దేశాల్లో భూకంప తీవ్రతకు బహుళ అంతస్తుల భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. మయన్మార్ లో 7.7, 6.4, 4.9లుగా వరుసగా మూడు భూకంపాలు సంభవించాయి. బంగ్లాదేశ్, థాయ్ లాండ్ లలో 7.3 తీవ్రతో భూకంపం సంభవించినట్లు రిక్టర్ స్కేల్ పై నమోదైంది. భూకంపం ధాటికి మయన్మార్ లో రోడ్లకు చీలికలు వచ్చాయి. మయన్మార్ లో 12 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు భూకంపం సంభవించింది. థాయ్ లాండ్ లో ఆ దేశ ప్రధాని ఎమర్జెన్సీ ప్రకటించారు. మయన్మార్ లో భూకంప కేంద్రం ఉన్నట్లు జర్మనీ శాస్త్రవేత్తలు గుర్తించారు.
అదేవిధంగా ఇండియాలోనూ మయన్మార్ భూకంప ప్రభావం కనిపించింది. మణిపూర్, కోల్ కతా, ఇంఫాల్, మేఘాలయాల్లో భూకంప ప్రభావం కనిపించింది. మేఘాలయాలోని ఈస్ట్ ఘార్ హిల్స్ లో భూకంప తీవ్రతను 4గా గుర్తించారు. భూ ప్రకంపనలతో ప్రజలు భవనాల నుంచి పరుగులు తీశారు. కాగా భూకంప ప్రభావ దేశాలకు అవసరమైన సహాయ చర్యలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈమేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖను ఆదేశించారు. భూకంప ప్రాంతాల్లోని ప్రజలంతా క్షేమంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు.