తన మంత్రి వర్గ సహచరులకు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి నుంచి అత్యవసర పిలుపు వచ్చింది. అందుబాటులో ఉన్న మంత్రులే కాదు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నఫలంగా రాజధానికి చేరుకోవాలని ముఖ్యమంత్రి నుంచి పిలుపు వచ్చింది. దీంతో రాష్ట్రంలో అందుబాటులో గల పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ ప్రాంతాల్లో పర్యటనలను రద్దు చేసుకుని, వాయిదా వేసుకుని మరీ హైదరాబాద్ కు పరుగు పరుగున బయలుదేరారు. దీంతో తెలంగాణాలో రాజకీయంగా ఏం జరుగుతోందనే అంశం సంచలన చర్చకు దారి తీసింది.
ప్రజాపాలన బాగుందా? ఫాం హౌజ్ పాలన బాగుందా? అంటూ తెలంగాణా కాంగ్రెస్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేసి సెల్ఫ్ గోల్ చేసుకుందనే వాదనల నేపథ్యంలో, తాజాగా తన ఫాం హౌజ్ లో కేసీఆర్ వ్యాఖ్యల పరిణామాల్లో సీఎం నుంచి మంత్రులకు, ఎమ్మెల్యేకు అత్యవసర పిలుపు రావడం గమనార్హం. దీంతో నిన్న మధ్యాహ్నమే జిల్లాకు చేరుకున్న కొందరు మంత్రులు రాత్రికి రాత్రే రాజధానికి తిరుగుముఖం పట్టడం విశేషం. తమకు అత్యంత సన్నిహితులైన వారి ఇళ్లల్లో జరుగుతున్న శుభకార్యాలకు కూడా వెళ్లకుండా మరికొందరు మంత్రులు తమ పర్యటనలను రద్దు చేసుకున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చేరుకుని, గత రాత్రి 10 గంటల సమయంలో పార్టీకి చెందిన ఓ ముఖ్యుని ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో తుమ్మల గండుగులపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. కానీ సీఎం అత్యవసర పిలుపుతో పాల్వంచలోని వివాహ వేదిక నుంచి అటునుంచి అటుగానే హైదరాబాద్ చేరుకున్నారు.
అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలు కూడా అర్థంతరంగా వాయిదా పడ్డాయి. శుక్ర, శనివారాల్లో ఆయన జిల్లాలో పర్యటిస్తారని అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి. అయితే ఈ పర్యటనలు అనివార్య కారణాలవల్ల వాయిదా పడినట్లు ఏరోజుకారోజు అవే అధికారిక ప్రకటనలు వెల్లడించాయి. మొత్తం సీఎం నుంచి వచ్చిన అత్యవస పిలుపు మేరకే అటు పొంగులేటి తన పర్యటనలను వాయిదా వేసుకోగా, ఇటు తుమ్మల అత్యవసరంగా పెళ్లి వేదిక నుంచే పయనమై హైదరాబాద్ చేరుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగానూ అందుబాటులో ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం నుంచి ఇదే తరహాలో అత్యవసర పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం 11 గంటలకు రాజధానికి చేరుకున్న మంత్రులతో, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం నుంచి అత్యవసర పిలుపు రావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను సంతరించుకున్నట్లు పరిశీలకుల అంచనా.

