Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

భగ్గుమంటున్న ‘భూపాలపల్లి మర్డర్’ ఘటన.. పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా!?

భూపాలపల్లిలో గత రాత్రి జరిగిన హత్యోదంతం రాజకీయంగానూ భగ్గుమంటోందా? ఈ హత్యపై తాజాగా గురువారం చోటు చేసకున్న వరుస పరిణామాలు ఇదే ప్రశ్నను రేకెత్తిస్తున్నాయి. భూపాలపల్లి మున్సిపల్ కౌన్సిలర్ సరళ భర్త రాజలింగ మూర్తి నిన్న రాత్రి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ కోర్టులో కేసు దాఖలు చేసిన రాజలింగమూర్తి జిల్లా కేంద్రం నడిబొడ్డున హత్యకు గురి కావడం సంచలనంగా మారింది. తన భర్త హత్య వెనుక బీఆర్ఎస్ నాయకుల ప్రమేయమన్నట్లు హతుని భార్య సరళ ఆరోపిస్తున్నారు. దరిమిలా ఇప్పుడీ ఘటన రాజకీయంగానూ ప్రకంపనలు రేపుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గాంధీ భవన్ లో గురువారం మీడియాతో మాట్లాడుతున్న మంత్రి కోమటిరెడ్డి

రాజలింగమూర్తి హత్యకు దారి తీసిన పరిస్థితులపై, పరిణామాలపై సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సమాచార సేకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ హత్యపై గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, కోర్టుల్లో కేసులు వేస్తే న్యాయపరంగా కొట్లాడాలేగాని, చంపేస్తారా? అని ప్రశ్నించారు. అంతేకాదు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి రాజలింగమూర్తిని చంపించినట్లు మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని ఆయన అన్నారు. మరోవైపు కేసీఆర్ పై న్యాయపోరాటం చేస్తున్న చక్రధర్ గౌడ్ కు రక్షణ కల్పిస్తామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ నుంచి ప్రాణ భయం ఉన్నవారు ప్రభుత్వాన్ని సంప్రదించాలని, కాళేశ్వరం ప్రాజెక్టు దోపిడీపై రాజలింగమూర్తి పోరాడాడని, హత్యోదంతంపై సీఎం రేవంత్ రెడ్డిని తాము కలవనున్నట్లు కూడా కోమటిరెడ్డి వెల్లడించారు.

రాజలింగమూర్తి హత్యపై మీడియాతో మాట్లాడిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ

మరోవైపు రాజలింగమూర్తి హత్యోదంతపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కూడా స్పందించారు. ఈ ఘటనను తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. హత్యపై విచారణ జరపాలని, సీఐడీ ద్వారా విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. రౌడీయిజాలు, గూండాయిజాలు పునరావృతం కాకుండా చూడాలని, హత్య వెనుక ఎవరున్నా లోతుగా విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజలింగమూర్తి హత్య వెనుక ఎంతటివారున్నా ఉపేక్షించేంది లేదని ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు.

హత్యతో తనకు సంబంధం లేదని మీడియాకు వివరిస్తున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి

అయితే రాజలింగమూర్తి హత్యతో తనకెటువంటి సంబంధం లేదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. ఈ హత్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, రాజలింగమూర్తి హత్యపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు బాధాకరమని, హత్య కేసును ప్రభావితం చేసే యోచన కనిపిస్తోందని వెంకట రమణారెడ్డి అన్నారు. స్థానిక పోలీసు అధికారులకు ఈ హత్యపై వాస్తవాలు తెలుసని, హతుడు లిటిగెంట్ వ్యక్తిగా గండ్ర వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. కాగా భూపాలపల్లి హత్య కేసు విచారణ సీఐడీకి అప్పగించే అవకాశమున్నట్లు ప్రభుత్వ అనుకూల న్యూస్ ఛానల్ నివేదించడం గమనార్హం.

Popular Articles