తుమ్మల నాగేశ్వర్ రావు.. తెలుగు రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని కాకలుతీరిన ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుత తెలంగాణా ప్రభుత్వంలో కీలక వ్యవసాయ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న తుమ్మల నాగేశ్వర్ రావు తన వాక్చాతుర్యంతో రాజకీయ ప్రత్యర్థులను బెంబేలెత్తించగలరు. వాక్చాతుర్యం మాత్రమే కాదు సుమీ, ప్రభుత్వం ఏదైనా, తాను లక్ష్యంగా ఎంచుకున్న అభివృద్ధి పనులను పూర్తి చేసి విమర్శకులకు సవాల్ విసరడం తుమ్మలది ప్రత్యేక శైలిగానే చెప్పవచ్చు.
ఇదే సందర్భంలో ఏదేని సభలోగాని, సమావేశంలోగాని తాను చెప్పదల్చుకున్న అంశాన్ని సూటిగానే చెప్పడం, తనదైన ప్రత్యేక శైలిలో ప్రసంగించడం తుమ్మల సహజ ధోరణిగా ఆయన గురించి తెలిసిన రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తుంటారు. అంతేకాదు సభా వేదికపై తాను చేసే వ్యాఖ్యలు ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు, నాయకులకు అర్థమయ్యేలోపు తన ప్రసంగాన్ని ముగించి సభికులకు ధన్యవాదాలు చెప్పడం కూడా తుమ్మల ప్రసంగంలో గమనించాల్సిన ప్రత్యేకాంశంగా చెబుతుంటారు. రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లా కమ్మ సంఘం సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఎమ్మెల్సీ తాతా మధును ఉద్ధేశించి చేసిన ప్రసంగంలోని వ్యాఖ్యలు రాజకీయపరంగానే కాదు, కమ్మ సామాజిక వర్గంలోనూ తీవ్ర చర్చకు దారి తీశాయి. తుమ్మల ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు తాతా మధు అదే వేదికపై ఉండడం కూడా గమనార్హం. కమ్మ జాతి ఔన్నత్యం గురించి విశదీకరిస్తూనే తాతా మధు పొలిటికల్ ప్రస్థానం గురించి తుమ్మల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయనే చెప్పాలి.
బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షునిగానూ బాధ్యతలు నిర్వహిస్తున్న తాతా మధు గురించి, కమ్మ సామాజికవర్గం గురించి తుమ్మల నాగేశ్వర్ రావు చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశం ఆయన మాటల్లోనే..
‘‘మనం ఉన్నటువంటి స్థలం చాలా చరిత్ర, ప్రాశస్త్యం గల స్థలం. ఆ రోజుల్లోనే.. జొన్నలు పండే రోజుల్లోనే మనవాళ్లు మన పిల్లలకు విద్య ఉండాలని తలచి, పెద్ద పెద్దవాళ్లు కలిసి కూర్చుని కమ్మ హాస్టల్ భవన నిర్మాణం చేసి, ఈ రాష్ట్రంలోనే ఒక గుర్తింపు తీసుకువచ్చినటువంటి ఖమ్మం జిల్లా కమ్మ సంఘానికి మీరు ఇప్పుడు బాధ్యులు. అందుకనే గత చరిత్రను దృష్టిలో పెట్టుకుని, వాళ్ల త్యాగాన్ని, వాళ్ల దాతృత్వాన్ని, ముందు చూపును మనం మనుసులో పెట్టుకుని దానికి తగ్గట్టుగా నడుచుకోవలసినటువంటి అవసరం ఉంది. ఏ కులంలో పుట్టాలనేది మనం డిసైడ్ చేయలేం గాని, ఆ భగవంతుడు.. మనల్ని ఈ కులంలో పుట్టించినందుకు మనం గర్వించాలి. ఎవరూ కూడా ఇందులో పుట్టాలి.. అందులో పుట్టకూడదని అనుకోరు. కానీ భగవత్ నిర్ణయం. కులాలు కూడా అప్పుడు లేకపోవచ్చు, మన వృత్తుల ద్వాారా మనకు కులాలను ఆపాదించారు. మనం కాదన్నా, ఔనన్నా తాతా మధు కమ్మే అంటారు.. ఆయన చెప్పుకున్నా, చెప్పుకోకపోయినా. కులం వల్ల కూడా కొన్ని అవకాశాలు వస్తుంటాయి. ఈ జిల్లాలో ఎవరికైనా వస్తే ‘కమ్మ’ బేస్డ్ మీదనే ఒస్తుంటయి. ఆఁ ఒక్కటన్న ‘కమ్మ’కు ఇయ్యకపోతె ఎట్టా అంటే తాతా మధుగారు దొర్కుతడు. ఈయన్ని నేనొక్కసారి పాపం అమెరికా పోయినప్పుడు.. నన్ను ఒక దగ్గర్నించి ఇంకో డెస్టినేషన్ కు తీసుకెళ్లటానికి కారు తోల్తడు.. నన్ను ఎక్కిచ్చుకున్నడు. నేనిట్లిట్టా.. ఫలానా, ఫలానా అండీ, నాది పాలేరు, నా కథ ఇదీ, నా యవ్వారమిదీ.. అని చెప్పుకుంటూ తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన తర్వాత అప్పుడున్న రాజకీయ పార్టీల్లో ఏదో ఒక పార్టీలోకి వెళ్లి ఆయన యవ్వారం జేయాలని ప్రయత్నం జేస్తుండు. అరే.. అది కరెక్టు కాదోమోనని చెప్పి చెప్పా నేను. మధుగారూ.., నువ్వేదో పాపం అమెరికా బోయినవ్.. పచ్చబడ్డవ్.. కరక్టు లైనప్పుడు, కరక్టు సమయంలో, కరక్టు నిర్ణయం జేయాలి, తొందరొద్దని చెప్పా. చెప్తే మరెందుకో మొత్తం డ్రాపైండు అప్పుడు. తర్వాత మళ్లీ నాతోటి ఓ పార్టీలోకొచ్చాడు. ఆయనిప్పుడు అధ్యక్షుడైండు, చట్టసభలో సభ్యుడైండు.. కేవలం కులమే. ఏంటంటే..? కమ్మ, ఖమ్మానికియ్యాలె కాబట్టి, తాతా మధుగారికి అవకాశం.. అంటే.. కులం కూడా మనకు అవకాశాలిస్తది. కానీ ఆ కులం యొక్క చరిత్ర, ఆ కులం యొక్క దాతృత్వం, ధీరత్వం, వీరత్వం.. మనం అందులో పుట్టినందుకు దాన్ని నిలపటానికి ప్రయత్నం జెయ్యాలె. దాన్నింకా పెంచితే పెంచండి, కానీ మన పూర్వీకులు సృష్టించినటువంటి చరిత్రకు మచ్చ ఒచ్చేటట్టుగా మనం బతకొద్దూ.. అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా.’’
ఇవీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కమ్మం సంఘం సమావేశంలో చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు. అయితే తన ప్రసంగంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తాతా మధును మంత్రి తుమ్మల పొగిడారా? లేక పొలిటికల్ పంచ్ లు విసిరారా? అనే ప్రశ్నలు ప్రామాణికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయా వర్గాల్లోనే కాదు, కమ్మ సామాజికవర్గంలోనూ భిన్నరీతుల్లో చర్చ జరుగుతోంది. తుమ్మల ప్రసంగపు శైలి గురించి తెలిసినవారు ఎవరికి తోచినవిధంగా వారు అన్వయించుకుంటూ ఆయన వ్యాఖ్యలపై చర్చించుకుంటుండడమే అసలు విశేషం. తుమ్మల ప్రసంగంలోని వ్యాఖ్యలకు సంబంధించి ఓ సీనియర్ జర్నలిస్ట్ ఏమంటారంటే.. పొగడ్తకు అవసరమైన రాజకీయ మిత్రుత్వంగాని, తెగడ్తకు సంబంధించిన శత్రుత్వంగాని తుమ్మల, తాతా మధుల మధ్య లేదని ఆయన నిర్వచించడం గమనార్హం.