కేసీఆర్.. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర ఎప్పటికీ మరువలేనిది. రాజకీయంగా, పదేళ్ల రాష్ట్ర పాలకునిగా కేసీఆర్ మంచోడా? చెడ్డోడా? అనేది వేరే చర్చ. కానీ తెలంగాణా చరిత్రలో కేసీఆర్ జీవితం పుటలు పుటలుగా నిక్షిప్తమై ఉంటుందనేది నిర్వివాదాంశం. రాజకీయ ప్రత్యర్థులు కేసీఆర్ పై చేసే విమర్శలు, ఆరోపణల అంకం వేరు. అందులో వాస్తవ, అవాస్తవాల నిశిత సమీక్ష కాదిది. రాజకీయ జీవితంలో సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ నాయకుడిగా ఎదిగిన అతికొద్ది మందిలో కేసీఆర్ కూడా ఒకరు అంటే కూడా కరెక్ట్ కాదేమో. తెలంగాణా ఉద్యమంలో ‘ఒక్కడు’గా పేరు గాంచడమే ఆయన ప్రత్యేక కారణం. తెలంగాణా రాజకీయాల్లో కేసీఆర్ ను ఓ చరిత్రాత్మక లీడర్ గా అభివర్ణించడంలోనూ అతిశయోక్తి లేదేమో! ఇప్పుడు కేసీఆర్ చరిత్ర గురించికాదు.. ఆయన తాజాగా ఎదుర్కుంటున్న పరిస్థితి గురించే అసలు సమీక్ష.
కేసీఆర్ గారాల తనయ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ, తదనంతర పరిణామాలు తెలంగాణా రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్. బీఆర్ఎస్ కు చెందిన ఓ ముఖ్యనాయకుడు వ్యాఖ్యానించినట్లు అసలు కూతురు తండ్రికి లేఖ రాయడం ఏంటి? తండ్రీ, కూతుళ్ల మధ్య మాటలు లేవా? కుటుంబ బంధం సజావుగానే ఉంటే విషయాన్ని నేరుగా తండ్రితోనే చర్చించవచ్చు. డాడీ.. రజతోత్సవ సభలో మీ ప్రసంగం బాగోలేదని, బీజేపీ విషయంలో మీదైన శైలిలో మాట్లాడలేదని.. తన భావాలను తండ్రితోనే ఆమె నేరుగా పంచుకోవచ్చు. ఫాం హౌజ్ కు వెళ్లి గంటల తరబడి జన్మనిచ్చిన తండ్రితో మాట్లాడవచ్చు. ఓ కూతురుగానే కాదు, పార్టీలో కీలక నాయకురాలిగా, ఎమ్మెల్సీగా కవితకు ఈ విషయంలో సర్వ హక్కులూ సంక్రమించి ఉన్నాయి.

కానీ కవిత చేసిందేమిటి? నిక్కచ్చిగా చెప్పాలంటే తండ్రి రాజకీయ అడుగులనే ఆమె ప్రశ్నించారు. కొందరినే కలుస్తున్నారని, అందరినీ కలవడం లేదని ఆక్షేపించారు. రజతోత్సవ సభలో పార్టీని 2001 నుంచి వెన్నంటి ఉన్నవారితో మాట్లాడించాల్సిందని హితవు చెప్పారు. ఎల్కతుర్తి సభలో బీజేపీని దునుమాడాల్సిందని తండ్రికే సూచన చేశారు. నిజానికి దాదాపు పాతికేళ్ల టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రస్థానంలో కేసీఆర్ కు ‘నీతులు’ చెప్పే స్థాయికి ఆయన తనయ ఎదగడం ఒకింత పుత్రికోత్సాహంగానే భావించవచ్చునేమో..? కానీ ఇవన్నీ ‘డాడీ’తో డాటర్ అంతర్గతంగా చర్చిస్తే హుందాగా ఉండేదేమో? కానీ కవిత అలా చేయలేదు. మొత్తం ఏడు పేజీల లేఖ రాశారు. నాలుగు పేజీల్లో పార్టీ చీఫ్ కేసీఆర్ తీరునే ప్రశ్నించారు.
కవిత రాసిన లేఖ ‘లీక్’ అయ్యింది. ఇంకేముంది బీఆర్ఎస్ రాజకీయాల్లో రచ్చ రచ్చ.. ప్రత్యర్థి రాజకీయ పక్షాలు ఇదే అస్త్రంగా తమదైన శైలిలో స్పందించాయి. కొడుకు గ్రాడ్యుయేషన్ ఉత్సవంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన కవిత తిరిగి ఇండియాకు చేరడానికి ముందే లీకైన లేఖపై తెలంగాణా రాజకీయాల్లో ఎడతెగని చర్చ. ఆమె పార్టీ ఏర్పాటు చేస్తోందని, అసలు కవిత రాసిన లేఖ ఫేక్.. అంటూ అనేక కథనాలతో మీడియా తమదైన వార్తా కథనాలను వండి వడ్డించాయి. సోషల్ మీడియా రచ్చ గురించి కొత్తగా చెప్పేదేముంది? మొత్తానికి బీఆర్ఎస్ లో ఏదో ముసలం మొదలైందనేది రాజకీయంగా సాగిన చర్చ.

మొత్తానికి లీకైన లేఖపై కవిత క్లారిటీ ఇచ్చారు. లేఖ తానే రాశానని చెప్పారు. ఇటువంటి లేఖలు రాయడం తొలిసారి కాదన్నారు. గతంలోనూ రాశానని చెప్పారు. పార్టీ కేడర్, లీడర్లే కాదు, అన్ని స్థాయిలవారూ మాట్లాడుకుంటున్న విషయాలనే తాను చెప్పానని పేర్కొన్నారు. డాడీకి తాను రాసిన లేఖ ఎలా లీకైందంటూ సరికొత్త ప్రశ్నను సంధించారు. తనకే ఈ పరిస్థితి ఎదురైతే పార్టీలోని ఇతరుల సంగతేమిటని సందేహించారు. ‘డాడీ’ దేవుడని, ఆ దేవుని చుట్టూ దయ్యాలు ఉన్నాయని మరో రాజకీయ చర్చకు తావు కల్పించే వ్యాఖ్య చేశారు. ఇప్పుడు ఇదే అంశంపై బీఆర్ఎస్ లోనే కాదు, ఇతర రాజకీయ పక్షాల్లోనూ తీవ్ర చర్చ సాగుతోంది.
కేసీఆర్ పరిభాషలో చెప్పాలంటే ‘పిడికెడు’ మందితో ప్రారంభించిన ఉద్యమాన్ని ఉవ్వెత్తును ఎగసిపడేలా చేసి, అనేక మరపురాని ఘట్టాల మధ్య తెలంగాణా రాష్ట్రాన్ని సాధించిన పార్టీ చీఫ్ దయ్యాల చెరలో చిక్కుకున్నారా? ఇదే ప్రశ్నపై ప్రస్తుతం సాగుతున్న అసలు చర్చ. అంతేకాదు.. లేఖ రాసింది డాటర్ కవిత.. ఆ లేఖ చేరింది డాడీ కేసీఆర్ కు. కానీ మధ్యలో లేఖ లీక్ ఎలా అయ్యింది? రాసినవారు లీక్ చేసినట్టా? లేఖను అందుకున్నవారు లీక్ చేసినట్టా? లేక ఫాం హౌజ్ లో కేసీఆర్ ను నిత్యం వెన్నంటి ఉండేవారు ఎవరైనా లీక్ చేసి ఉంటారా? ఇదే జరిగితే అసలు లేఖ డాడీకి చేరిందా? చేరలేదా? ఈ విషయంలో కవిత తప్పు పడుతున్నదెవరిని? దయ్యాలుగా అభివర్ణించింది ఎవరిని? ఇటువంటి అనేక ప్రశ్నలకు ఇప్పటికిప్పుడు సమాధానం లేకుండాపోయింది.

లీకైన కవిత లేఖపై తాజా పరిణామాలను లోతుగా పరిశీలించినపుడు ఓ డాటర్ తన డాడీ రాజకీయం తీరును నేరుగా తప్పుపడుతున్నట్లుగానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కవిత వ్యాఖ్యల ప్రకారం.. తన చుట్టూ ఉన్న దయ్యాలకు కేసీఆర్ ‘బందీ’గా మారినట్లు డాటర్ చెప్పకనే చెప్పినట్టా? అనే ప్రశ్న ప్రమాణికంగా రాజకీయ చర్చ సాగుతోంది. తన చుట్టూ పరిభ్రమిస్తున్న దయ్యాలను గుర్తించలేని స్థితిలో ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన కేసీఆర్ వంటి గొప్ప నాయకుడు ఉన్నట్టా? ఇదే నిజమైతే ఆ దయ్యాలను అక్కడి నుంచి డాటర్ కవిత తరిమికొట్టలేరా? ఆ శక్తి తనకు లేకపోతే అన్న కేటీఆర్ సహాయం తీసుకుని సైతం దయ్యాలను అక్కడి నుంచి తరిమేయవచ్చు కదా? ఇవి మరికొన్ని ప్రశ్నలు.
దేవుడైన తన తండ్రి చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పిన కవిత వ్యాఖ్యలు కేసీఆర్ కు నష్టం కలిగించేవిగా బీఆర్ఎస్ వర్గాలే అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నాయి. లేఖలు, లీకులు, దయ్యాల వ్యాఖ్యల వంటి అనేక పరిణామాలు కేసీఆర్ రాజకీయ ‘చరిత్ర’పైనే చర్చకు దారి తీసే విధంగా మారాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. కవిత వ్యవహార శైలిపై బీఆర్ఎస్ లో ఎవరికీ సానుభూతి లేదని, శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం కనిపించిన సీన్ లో పార్టీ నేతలుగాని, కార్యకర్తలుగాని లేకపోవడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. అంతేకాదు.. బీసీ నినాదం, సామాజిక తెలంగాణా వంటి పదాలతో కవిత కేసీఆర్ కు కొత్త తలనెప్పులను కలిగించిందంటున్నారు. పార్టీలో గల పద్ధతి ప్రకారం నియోజకవర్గాల ఇంఛార్జిల అనుమతి లేకుండా జిల్లాల పర్యటనలతో పార్టీ కేడర్ లో అయోమయాన్ని సృష్టించినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల దృష్టిని సైతం తనవైపునకు తిప్పుకున్న కేసీఆర్ వంటి నాయకుడు ప్రస్తుతం ‘కూతురు’ రూపంలో ఎదుర్కుంటున్న స్థితిని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలో గల డైలాగ్ లను గుర్తుకు తెస్తున్నాయని గులాబీ పార్టీ కేడర్ గుసగుసలాడుకుంటోంది. ఇంతకీ ఆ సినిమాలో త్రివిక్రమ్ రాసిన పాపులర్ డైలాగ్ లు ఏమిటో గుర్తున్నాయి కదా? ‘
‘శత్రువులు ఎక్కడో ఉండర్రా..! చెల్లెళ్లు, కూతుళ్ల రూపంలో మారువేషాలేసుకుని మన కొంపలోనే తిరుగుతా ఉంటారు..’ అనే డైలాగ్ లను రావు రమేష్ పాత్ర ద్వారా త్రివిక్రమ్ శ్రీనివాస్ పలికిస్తారు.
-ఎడమ సమ్మిరెడ్డి

