హైదరాబాద్: హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసులో తెలుగు న్యూస్ ఛానల్ N Tv సీఈవో వై. రాజశేఖర్, యాంకర్ దేవీల కోసం పోలీసుల వేట సాగుతోందా? హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ‘సిట్’కు నాయకత్వం వహిస్తున్న వీసీ సజ్జన్నార్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు, హెచ్చరికలు ఈ ప్రశ్నకు ఔననే సమాధానంగా ఉన్నాయి. తమ సీఈవో ఇంటిపైన, యాంకర్ దేవీ ఇంటిపైన పోలీసులు దాడులు చేశారనే N Tv మహిళా విలేకరి ప్రశ్నకు సజ్జన్నార్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఈ అంశంలో అత్యంత కీలకంగా ఉండడం గమనార్హం. సిట్ అంటేనే ఇన్వెస్టిగేషన్ అని, నోటీసులు ఎందుకివ్వాలని ఆయన ప్రశ్నించారు. ‘మీ సీఈవోగారు ఎక్కడ ఉన్నారండీ..? ఇన్వెస్టిగేషన్ కు సహకరించండి. ఎందుకు పారి..పోతున్నారూ..?’ అని సీపీ సజ్జన్నార్ ప్రశ్నించారు.
అదేవిధంగా యాంకర దేవీ విచారణకు వస్తానని చెప్పి, సెల్ స్విచ్ఛాఫ్ చేసి వెళ్లిపోతే ఎట్లా? మీరు కరెక్టుగా ఉంటే రండి. విచారణకు సహకరించండి. మీరు తప్పు చేయకపోతే ఎందుకండీ భయం? మహిళా ఆఫీసర్ ను ఇట్లాగే అగౌరవపరుస్తారా? ఏం ఆధారముందండీ మీదగ్గర? వాళ్లెట్లా జీవించాలె? అని సజ్జన్నార్ సూటిగా ప్రశ్నించారు. ఎక్కడ ఉన్నా పట్టుకుని వస్తానని, చట్టం ముందు ప్రవేశపెడుతానని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని సజ్జన్నార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దీంతో N Tv సీఈవో రాజశేఖర్, యాంకర్ దేవీలు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు మీడియా వర్గాలు భావిస్తున్నాయి.

అయితే ఈ నేపథ్యంలోనే యాంకర్ దేవీ బుధవారం ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేయడం గమనార్హం. తాను వార్తను మాత్రమే చదివానని, ప్రతిరోజూ వార్తలు చదివినందుకే తనకు జీతం ఇస్తారని, ఏ వార్త వచ్చినా తాను చదవుతానని ఆమె పేర్కొన్నారు. విచారణ పేరుతో తనను మెంటల్ టార్చర్ కు గురి చేశారని ఆమె ఆరోపించారు. జరిగినదానికి క్షమాపణలు కూడా చెప్పామని, తాను కూడా మహిళనేనని, తనకు ఆత్మాభిమానం ఉంటుందని, తనకో కుటుంబం ఉంటుందన్నారు. ఇది చాలా అన్యాయమని, ఇలా తనను రోడ్లమీద పరుగెత్తించడం న్యాయం కాదని, తాను ఎక్కడికీ పారిపోలేదని దేవి తన వీడియోలో పేర్కొన్నారు.
మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఎన్ టీవీ ఛానల్ లో వార్తా కథనం ప్రసారమైందనే అభియోగంపై నమోదైన కేసులో ఇప్పటికే ఛానల్ తెలంగాణా ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ను, రిపోర్టర్ సుధీర్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేసు దర్యాప్తు పరంపరలో భాగంగా ఛానల్ సీఈవో రాజశేఖర్, యాంకర్ దేవీల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నట్లు తాజా పరిణామాల ద్వారా స్పష్టమవుతోంది.

