తెలంగాణా జర్నలిస్టు సమాజంలో సంచలనం. రెండు వేర్వేరు ఘటనల్లో ఖమ్మం నల్లగొండ జిల్లాల పోలీసులు ఇద్దరు ‘జర్నలిస్టు’లపై కేసులు నమోదు చేశారు. ఇందులో ఒకరు నకిలీ జర్నలిస్టుగా ప్రాచుర్యంలోకి రాగా, మరో ఘటనలో ఓ న్యూస్ ఛానల్ కు చెందిన రిపోర్టర్ పై కేసు నమోదైంది. వివరాల్లోకి వెడితే..
ఖమ్మం జిల్లా పోలీసులు హెచ్ఎంటీవీ రిపోర్టర్ పై కేసు నమోదుచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను రఘునాధపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ వివరించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్ గ్రామ పరిధిలోని గుట్టల నుండి మట్టిని తరలిస్తున్న లారీ టిప్పర్లను అడ్డగించి అనుమతి లేకుండా మట్టి అక్రమంగా తరలిస్తున్నారంటూ నగరానికి చెందిన HMTV ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ మానుకొండ రవి కిరణ్ పై రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఇన్స్‌పెక్టర్ ఉస్మాన్ షారీఫ్ తెలిపారు.
గత నెల 27వ తేదీన సైట్ లోకి అక్రమంగా ప్రవేశించిన రిపోర్టర్ మట్టి టిప్పర్లను అడ్డగించి మట్టిని అక్రమ రవాణా చేస్తున్నట్లు న్యూస్ చనాల్ వార్తను ప్రచారం చేస్తానంటూ…. టిప్పర్ డ్రైవర్లను బెదిరించారని HGIEL ఏపీ ఆర్ ఇన్ఫ్రా కంపెనీకి చెందిన సైట్ ఇన్చార్జ్ దారగాని పాపారావు ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్స్‌పెక్టర్ తెలిపారు.
అదేవిధంగా నల్లగొండ జిల్లా ఘటనలో ఓ పోలీస్ అధికారిని బెదిరించారనే అభియోగంపై ఓ నకిలీ విలేకరిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. నల్లగొండ జిల్లాలో నకిలీ విలేకరుల దందాకు ఈ ఘటన ద్వారా పోలీసులు గట్టి ఝళక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ పత్రిక పేరుతో ఓ ముఠా గత కొంత కాలంగా పోలీసు శాఖకు చెందిన అధికారులను టార్గెట్ గా ఎంచుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు అభియోాగాలు వచ్చాయి.
ఇందులో భాగంగానే ఓ సీఐని బెదిరించి రూ. 5 లక్షలు డిమాండ్ చేశారని, సదరు సీఐ ఈ ముఠా బెదిరింపులకు తట్టుకోలేక రూ. 1.10 లక్షలు ఇచ్చారని తెలుస్తోంది. అయినప్పటికీ అంతటితో ఆగకుండా మరో రూ. 4 లక్షలు ఇవ్వాలంటూ సీఐ కుటుంబాన్ని నకిలీ విలేకరుల ముఠా వేధింపులకు గురి చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో నకిలీ విలేకరిగా భావిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి, మిగతా ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు నల్లగొండ, ఇటు ఖమ్మం సంఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.