ఖమ్మం జిల్లా పోలీసులు ఐదు ఎరువుల దుకాణాలపై కేసులు నమోదు చేశారు. అంతేకాదు ఆయా దుకాణాల ట్రేడ్ లైసెన్సులను రద్దు చేయాలని కూడా వ్యవసాయ శాఖకు జిల్లా పోలీసు శాఖ సిఫారసు చేసింది. రైతుల యూరియా అవసరాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది ఎరువుల దుకాణదారులు యూరియా కావాలంటే ఇతర ఎరువులు లేదా పురుగుల మందు డబ్బాలు కొనుగోలు చేయాలని రైతులకు షరతులు పెడుతున్నారని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఈ విధంగా షరతులు పెడుతున్న ఐదు ఎరువుల దుకాణాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేసి కేసులు నమోదు చేశారని ఆయన చెప్పారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా పకడ్బందీ చర్యలు తీసుకోవడంలో భాగంగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నేలకొండపల్లి, చింతకాని, రఘునాథపాలెం, సత్తుపల్లి మండలలోని ఎరువుల దుకాణాలలో బుధవారం ఆకస్మికంగా సోదాలు నిర్వహించినట్లు సీపీ చెప్పారు. రైతులకు యూరియాతో పాటు ఇతర బయోస్టిమ్యులెంట్ ట్యాగ్ చేసి యూరియాను విక్రయిస్తున్నట్లు గుర్తించారని తెలిపారు. వారి ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయాలని వ్యవసాయ శాఖకు సిఫార్సు చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.

రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని అవసరం లేకున్నా యూరియాతో పాటు ఇతర ఎరువులు, పురుగు మందు డబ్బాలు బలవంతంగా అంటగట్టి, వ్యాపార లాభాల కోసం రైతులకు ఆర్థిక భారం మోపుతున్నారని సీపీ పేర్కొన్నారు. రైతులు సైతం యూరియా కొనుగోలు సమయంలో దుకాణదారులు ఏవైనా షరతులు పెడితే స్థానిక పోలీసులకు, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఈ సందర్భంగా సూచించారు.