Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

‘సాక్షి’ రిపోర్టర్ పై పోలీసుల దాష్టీకం

– నువ్వు సాక్షి రిపోర్టర్‌వు అయితే ఏంట్రా… వీడెబ్బ గుర్తుకు రావాలి… కుమ్మండ్రా కొడుకును అంటూ మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ జర్నలిస్ట్‌ను ఈడ్చుకుంటూ రక్షక్‌ వాహనంలోకి విసిరేసి వికటాట్టహాసం
– తాను హృద్రోగినని వేడుకున్నా వదలని ఖాకీ క్రౌర్యం
– ఆదివారం అర్ధరాత్రి స్టేడియం ఫుడ్‌ కోర్టు వద్ద ఓ మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ వీరంగం
– ఆమెకు వత్తాసు పలికిన రక్షక్‌ పోలీస్‌ వాహన కానిస్టేబుళ్లు
– చివరకు ఓ సీఐ చొరవతో వదిలేసిన పోలీసులు
– నీచాతి నీచంగా జర్నలిస్ట్‌ను తిట్టిన మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌
– ఇంతకూ ఆయన చేసిన నేరం ఏమిటో తెలుసా… విధినిర్వహణ ముగించుకుని ఇడ్లీ పార్సిల్‌ చేయించుకుందామని ఫుడ్‌ కోర్టుకు వెళ్ళడం
– పోలీస్‌ కమిషనర్‌కు కోటేశ్వరావు ఫిర్యాదు చేయడంతో చర్యలు
– మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ను పోలీసు కంట్రోల్‌ రూముకు మార్చిన వైనం
– మరో కానిస్టేబుల్‌ను వేకెన్సీ రిజర్వుకు పంపింపిన సీపీ
– మరో ఇద్దరు కానిస్టేబుళ్ళపై చర్యలు తీసుకునే ఆలోచనలో కమిషనర్‌

సాక్షి దినపత్రికలో కోటేశ్వరావు సీనియర్‌ జర్నలిస్ట్‌. కృష్ణా జిల్లా బ్యూరోలో పనిచేస్తారు. ఎన్నికల న్యూస్‌ కవరేజీ విధుల్లో ఉన్న కోటేశ్వరావు ఆదివారం రాత్రి 11.30 గంటల తరువాత వరకు నామినేషన్‌ల వివరాలు సేకరించి న్యూస్‌ ఐటమ్‌ రాసి పంపించారు. ఆ తరువాత భోజనానికి వెళదామనుకుంటే సమయం మించి పోవడంతో హృద్రోగి అయిన ఆయన టాబ్లెట్లు వేసుకుని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం వద్ద ఉన్న ఫుడ్‌ కోర్టు వద్ద ఇండ్లీ తినేందుకు వెళ్ళాడు. అప్పటికే రాత్రి 12 గంటలు కావడంతో పోలీసులు ఫుడ్‌ కోర్టును మూసివేయిస్తున్నారు. ఒక బండి వద్ద ఇడ్లీ ఉండటంతో పార్సిల్‌ కట్టి ఇవ్వాల్సిందిగా కోరిన కోటేశ్వరావు అక్కడే నిలబడ్డాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మహిళా పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ జ్యోతి (మాచవరం పోలీస్‌ స్టేషన్‌) అందరూ వెళ్ళి పోవాలని ఆదేశించారు. ఇడ్లీ పార్సిల్‌ చేస్తున్నందున కొంచెం దూరం జరిగిన కోటేశ్వరావు నిలబడ్డారు.

ఆ సమయంలో మరో కానిస్టేబుల్‌ సారుకు చపాతీ కావాలంటూ అక్కటే కట్టించుకుని ఆ మహిళా పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌ కళ్ళముందే తీసుకు వెళ్ళాడు. ఆమెకు అతను కనిపించినా కనిపించనట్లే… దూరంగా ఉన్న జర్నలిస్ట్‌ కోటేశ్వరావు మాత్రం కనిపిస్తున్నాడు. ఏంట్రా… ఎన్ని సార్లు చెప్పాలి? వెళ్ళూ… అంటూ గట్టిగా అరిచారు. మేడం… ఇడ్లీ తీసుకుని వెళతానని చెప్పాడు. నాకే ఎదురు చెబుతావురా… కొడకా.. అంటూ కాలర్‌ పట్టుకుని ఈడ్చుకుంటూ రక్షక్‌ వాహనం వద్దకు వచ్చారు. అక్కడే ఉన్న మరో ఐదు మంది కానిస్టేబుళ్లు జర్నలిస్టును బూతులు తిడుతూ నువ్వు సాక్షి రిపోర్టర్‌వు అయితే మాకేంటిరా… ఏమి చేస్తావురా… నీ ఐడీ కార్డు చూపించురా… అంటూ క్రౌర్యాన్ని ప్రదర్శించారు. ఐడీ కార్డు తీసి చూపించాడు. ఇందులో విశాఖపట్నం అని ఉంది. నీవు జర్నలిస్టువు కావు. నకిలీ నాకొడుకువు. నెట్టరా జీపులోకి అంటూ విసిరిపడేశారు.

సార్‌ నేను హార్ట్‌ పేషంట్‌ను మాత్రలు వేసుకున్నాను. వెంటనే టిఫిన్‌ చేయకుంటే షివరింగ్‌ వచ్చి పడిపోయి చచ్చిపోయే అవకాశం ఉందని వేడుకున్నా వినలేదు. మీరు నా గురించి ఎవరికైనా ఫోన్‌చేసి కనుక్కోండి అంటూ రిపోర్టర్‌ బ్రతిమిలాడగా నగరంలోకి ఒక సీఐకీ లేడీ హెడ్‌ కానిస్టేబుల్‌ ఫోన్‌ చేశారు. ఆయన రిపోర్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకుని నేను మావాళ్లకు చెబుతాను మీరు వెళ్ళండి అంటూ వాళ్లకు ఫోన్‌ ఇవ్వాలని చెప్పారు. ఫోన్‌ తీసుకున్న హెడ్‌ కానిస్టేబుల్‌ సీఐ గారు చెప్పిన మాటలు విని వీడిని వదలొద్దన్నాడు.. ఉంచు నాకొడుకును అంటూ జీపులోనే మరో పది నిమిషాలు ఉంచి ఆ తరువాత దించారు. ఈలోపులో ఎంతో మంది ఫుడ్‌ కోర్టుతో తిని వెళుతున్నా వాళ్లను పట్టించుకోలేదు.

కోటేశ్వరావు విశాఖపట్నం నుంచి బదిలీపై విజయవాడకు సుమారు సంవత్సరం క్రితం వచ్చారు. మాకందరికీ తెలిసిన వాడు. ఎంతో సౌమ్యుడు. వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఒకరిని అకారణంగా ఒక మాట అనే వాడు కాదు. విశాఖపట్నంలో జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలో ఎంతో మంది పోలీసు ఆఫీసర్ల చేత శభాష్‌ అనిపించుకున్న వాడు. ఐపీఎస్‌ అధికారి ఏకే ఖాన్‌ ద్వారా బెస్ట్‌ క్రైం రిపోర్టర్‌గా అవార్డు అందుకున్నవాడు. జనీవా నుంచి ఉత్తమ జర్నలిస్టు అవార్డు కూడా అందుకున్నాడు. అకారణంగా ఒకరిని ఒక మాట అనే మనస్తత్వం ఆయనకు లేదు.

అటువంటి వ్యక్తిపై అకారణంగా పోలీసులు దౌర్జన్యం చేశారు. పైగా సీపీ గారికి రిపోర్టర్‌ ఫిర్యాదు చేయగానే జర్నలిస్టుపై దాష్టీకానికి పాల్పడిన మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌తో పాటు ఉన్న కానిస్టేబుళ్లు కలిసి ఫుడ్‌ కోర్టులో షాపులు పెట్టుకున్న కొందరు వ్యభిచారులను కలిసారు. మాకు మీరు సహకరించాలని, విలేకరి నాకొడుకు మాపై సీపీకి రిపోర్టు ఇచ్చాడు. మిమ్మల్ని డబ్బులు అడిగేందుకు వస్తే మేము పట్టుకున్నామని చెప్పాలంటూ వాయిస్‌ రికార్డు చేశారు.
చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు పోలీసులు చేసిన ఈ వ్యవహారంపై కూడా సీపీ సీరియస్‌గా స్పందించినట్లు సమాచారం. ఇటువంటి ఘటనలు పురరావృతం అయితే పోలీస్‌ డిపార్టుమెంట్‌కు ఎంతో చెడ్డపేరు వస్తుందని పోలీసులను సీపీ హెచ్చరించినట్లు తెలిసింది.

కొంతమంది ఇటువంటి సిబ్బంది అనుచిత ప్రవర్తన వల్ల నగరంలోని యావత్‌ పోలీస్‌ యంత్రాంగానికే చెడ్డపేరు వస్తుంది. ఈ సంఘటనే ఉదాహరణ.

– జి.పి. వెంకటేశ్వర్లు, సీనియర్‌ జర్నలిస్ట్, విజయవాడ

ఫొటో: బాధిత జర్నలిస్ట్ కోటేశ్వర్ రావు

Popular Articles