Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

‘నోటి’తో పీవీ.., ‘నోట్’తో మోదీ కౌంటర్ స్టోరీ!

సరిగ్గా ముప్పయ్యేళ్ల క్రితం.. 1994-95 సంవత్సరంలో వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా శాలినీ మిశ్రా అనే మహిళా ఐఏఎస్ అధికారి ఉండేవారు. ప్రస్తుత వరంగల్ మహానగరంలోని హన్మకొండ-వరంగల్ మెయిన్ రోడ్డు మాత్రమే కాదు.. బట్టలబజార్, ఇంతెజార్ గంజ్ పోలీస్ స్టేషన్ రోడ్డు తదితర మార్గాలు అత్యంత ఇరుకుగా ఉండేవి. సిటీ బస్సులు తిరగడం ఒకానొక దశలో గగనంగానే ఉండేది. దీంతో మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న శాలినీ మిశ్రా అత్యంత సాహసానికి ఉపక్రమించారు. శుక్రవారం సాయంత్రం అయిదున్నర గంటల నుంచి ప్రారంభించి సోమవారం ఉదయం పది గంటల వరకు జేసీబీలను వెంటేసుకుని ఇరుకురోడ్లలో గల భవనాలను నిర్ణీత కొలతల ప్రకారం దగ్గరుండి మరీ శాలినీ మిశ్రా ధ్వంసం చేయించేవారు. కనీసం కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా లేకుండా సెలవు రోజుల్లోనే జేసీబీలను రంగంలోకి దించేవారు. ప్రస్తుత ‘హైడ్రా’ వంటి వ్యవస్థ లేని అప్పటి రోజుల్లోనే శాలినీ మిశ్రా ఈ కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా నిర్వహించారు.

ఇంకేముంది వరంగల్ వ్యాపార వర్గాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. కమిషనర్ ‘విధ్వంస’ కార్యక్రమాన్ని నిలువరించేందుకు కలెక్టర్ కు చెప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ సమయంలో జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న అజయ్ మిశ్రా శాలినీ మిశ్రా భర్తే. పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చని వ్యాపారులు భావించారు. సీఎం చంద్రబాబుకు చెప్పుకునేందుకు సాహసించలేదు. ఏదో యుద్ధం జరిగిన ప్రాంతంలా విధ్వంస భవన శకలాలతో కనిపిస్తున్న వరంగల్ వీధుల గురించి ముఖ్యమంత్రికి తెలియకుండా ఉండే అవకాశమే లేదు. కాబట్టి సీఎం ఆదేశం లేకుండా శాలినీ మిశ్రా ఈ చర్యకు పాల్పడే ఛాన్సే లేదని వ్యాపార వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. మరేం చేయాలి..? శాలినీ మిశ్రా కూల్చివేతల చర్యలను ఎలా ఆపాలి..? ఎలాగైనా అడ్డుకోవలసిందే.. ఇవీ వ్యాపారుల ముందున్న ప్రశ్నలు.

ఐఏఎస్ అధికారి శాలినీ మిశ్రా

వెంటనే అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గుర్తుకొచ్చారు. మన వరంగల్ గడ్డపై పుట్టిన తెలుగు బిడ్డ.. మన కష్టాలు నేరుగా ఆయనే చెప్పుకుందాం.. ఈ మహిళా ఐఏఎస్ సంగతి నేరుగా ప్రధాని వద్దే తేల్చుకుందామని ప్రముఖ వ్యాపారులు కొందరు ప్రధాని అపాయింట్మెంట్ కోరారు. అమ్మగారి జిల్లా వాళ్లు అడిగాక పీవీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉండలేకపోయారు. ప్రధానిని కలిసే అవకాశం వెంటనే లభించడంతో ఎగిరి గంతేసిన కొందరు వ్యాపార ప్రముఖులు అర్జంటుగా విమానమెక్కి ఢిల్లీకి వెళ్లారు. తనను కలిసిన వ్యాపారులను ప్రధాని పీవీ ఆత్మీయంగా పలకరించారు. టిఫిన్లు, కాఫీల వంటి సాదర మర్యాదలిచ్చిన పీవీ ఆతిథ్యానికి వ్యాపార ప్రముఖులు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. సార్… అంటూ పీవీకి ఏదో చెప్పబోయారు. అన్నీ తర్వాత మాట్లాడుకుందాం.. హ్యాపీగా ఢిల్లీ కలియదిరిగి, చూసి.. సంతోషంగా సాయంత్రానికి రండి.. డిన్నర్ లో మనసు విప్పి మాట్లాడుకుందాం.. అన్నారు ప్రధాని పీవీ.

ప్రభుత్వ రవాణా సౌకర్యాలతోనే వ్యాపారులంతా ఢిల్లీ వీధులన్నీ చుట్టుముట్టి వచ్చారు. పర్యాటక ప్రాంతాలనూ చూసి ఆస్వాదించారు. అనుకున్నట్టుగానే ప్రధాని పీవీ వ్యాపారులతో రాత్రి డిన్నర్ చేస్తూ.. ‘ఎలా ఉంది ఢిల్లీ..?’ అని ప్రశ్నించారు. ‘ అబ్బో ఢిల్లీ, అద్భుతం సర్.. చాలా బాగుంది. ముఖ్యంగా రోడ్లన్నీ చాలా విశాలంగా ఉన్నాయి సర్..’ అంటూ వ్యాపారులు ఎనలేని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పీవీతో చెప్పారు. ‘మన వరంగల్ కూడా ఢిల్లీలాగా ఉండాలి, అది నా కోరిక కూడా..’ అని పీవీ వ్యాఖ్యానించడంతో శాలినీ మిశ్రాపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వ్యాపారులకు నోట మాట రాలేదు. ఇంకేం చెప్పాలో పాలుపోలేదు. ‘వస్తాం సర్.. మీ దయ ఉండాలి..’ అంటూ వ్యాపారులు వరంగల్ తిరుగు ముఖం పట్టారు. ఇప్పుడు కనిపిస్తున్న వరంగల్ లోని అనేక మార్గాల్లో గల విశాలమైన రోడ్లు అప్పట్లో శాలినీ మిశ్రా తీసుకున్న సాహసోపేత కూల్చివేతల చర్యల ఫలితమే. మూడు దశాబ్ధాల క్రితంనాటి ఈ సంగతుల ప్రస్తావన ఇప్పుడెందుకూ అంటే..?

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి పంచ ప్రాణాలతో సమానమని భావిస్తున్న ఐదు ప్రాజెక్టులకు కేంద్రం సాయమందించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థించారు. దాదాపు గంటసేపు ప్రధానితో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రెండో దశ, రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం, రీజనల్ రింగ్ రైల్వే, హైదరాబాద్ డ్రై పోర్టు నుంచి బందరు పోర్టుకు గ్రీన్ ఫీల్డ్ హైవే, రైల్వే కనెక్టివిటీ, మూసీ నది పునరుజ్జీవం, రాష్ట్రానికి సెమీ కండక్టర్ యూనిట్ ప్రాజెక్టులను ప్రధాని ముందుంచారు. రాష్ట్రానికి మరో 29 మంది ఐఏఎస్ అధికారులను కేటాయింపు తదితర అంశాలను కూడా ప్రధానికి సీఎం విన్నవించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇందుకు ప్రధాని మోదీ స్పందించిన తీరే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ సీఎం రేవంత్ తో ప్రధాని మోదీ ఏమన్నారంటే..?

‘మీరు రాష్ట్రానికి కావలసిన ప్రాజెక్టులపై నాకు దరఖాస్తు ఇచ్చారు. తెలంగాణా రాష్ట్రం వద్ద పెండింగ్ లో గల కేంద్ర పథకాలకు సంబంధించిన దరఖాస్తును మీకు ఇస్తున్నాను, వాటి పరిష్కారం సంగతి చూడండి’ అంటూ మొత్తం ఆరు పెండింగ్ అంశాల ‘నోట్’ (జాబితా)ను ఇచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డే ఢిల్లీ మీడియాకు స్వయంగా చెప్పడం గమనార్హం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కు ప్రధాని ఇచ్చినపెండింగ్ అంశాల్లో పీఎఈవై, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ, చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు, బీబీనగర్ ఎయిమ్స్, శంషాబాద్ 100 పడకల హాస్పిటల్, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ వంటి అంశాలున్నాయి. ఆయా పథకాల్లో తెలంగాణా ప్రభుత్వం చెల్లించాల్సిన నిధుల ప్రస్తావన ఉంది.

ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని శాలువాతో సత్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

మొత్తంగా సీఎం రేవంత్ వినతికి ప్రతిగా ప్రధాని మోదీ ఇచ్చిన పెండింగ్ ‘నోట్’ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘మా ఇంటికొచ్చి అడగడం మాత్రమే కాదు.. మీ ఇంటి నుంచి మాకేం చేశారు’ అనే తరహాలో ప్రధాని ఇచ్చిన పెండింగ్ జాబితా ఉందనేది రాజకీయ విశ్లేషకుల భావన. దేశంలో ఏ ముఖ్యమంత్రికీ ఎదురుగాని అనుభవం రేవంత్ రెడ్డికి ఎదురైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎవరు ఎందుకు ఢిల్లీకి వస్తున్నారనే విషయంపై సెంట్రల్ ఇంటలిజెన్స్ వర్గాలు ముందే సమాచార సేకరణ చేసి కేంద్రానికి నివేదిస్తుంటాయి. అందువల్లే కాబోలు వరంగల్ వ్యాపారులకు పీవీ నరసింహారావు ‘నోటి’ మాటతో, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డికి ప్రస్తుత ప్రధాన మోదీ ‘నోట్’ రూపంలో కౌంటర్ ఇచ్చారేమో! ఈ తాజా ఘటనకు, 30 ఏళ్ల క్రితం వరంగల్ వ్యాపారులకు పీవీ నరసింహారావు చెప్పకనే చెప్పిన ఢిల్లీ వీధుల కథకు సారూప్యత ఉందో, లేదోకాని, రెండు అంశాల్లోనూ అత్యంత ఆసక్తికర పాయింట్లు ఉన్నాయనేదే అసలు విషయం.

Popular Articles