నాయకులకు ప్రజలపై కృతజ్ఞత పొంగినా, ప్రజలకు నాయకులపై అభిమానం ఉప్పొంగినా ‘పవర్’లో గల కొందరు లీడర్ల పేర్లు మారుతుంటాయ్.. కాదు, కాదు.. పేర్లు మారుస్తూ, పేరు చివరన మరో కులంపేరును ఉటంకిస్తూ తమ అభిమానాన్ని, కృతజ్ఞతను పరస్పరం చాటుకుంటుంటారు. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డిపైనా ఇదే తరహాలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన కృతజ్ఞతాభావాన్ని చాటడం విశేషం. నిన్న హైదరాబాద్ రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ శాఖ నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిపై కృతజ్ఞతతో కూడిన అభిమానాన్ని సభావేదికపైనే చాటారు.
బీసీలకు రేవంత్ చేస్తున్న సేవలను ఆయన కొనియాడుతూ, ‘రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, గౌరవనీయులు రేవంత్ గౌడ్ గారు.. ఎందుకంటా ఉన్నానంటే నేనీ మాట.. నిన్న ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పాను. రేవంత్ రెడ్డిగారిని రెడ్డిగా కాదు, ఒక బీసీ నేతగానే చూస్తూ ఉన్నాం మేము.. అలాంటి లక్షణాలు, అలాంటి ఆలోచన, ఆ విధానం ఆయనలో ఉంది కాబట్టి, నేను వారిని అందుకే రేవంత్ గౌడ్ గారు.. అని సంబోధిస్తా ఉన్నా’ అని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడంతో సీఎం సహా సభలో పాల్గొన్నవారందూ ఉల్లాసభరిత నవ్వులు పూయించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన అప్పటి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఇటువంటి ప్రశంసలను అందుకోవడం విశేషం. ఖమ్మం నియోజకవర్గ ప్రజలు ఆయనను అజయ్ ఖాన్ గా, అజయ్ ముదిరాజ్ తదితర కులాల పేర్లను ఆయన పేరు చివరలో అతికించి తమ అభిమానాన్ని చాటుకునేవారు. ఇందుకు ప్రతిగా ఆయన కూడా స్పందించేవారు. ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు వివిధ పర్వదినాల్లో శుభాకాంక్షలు చెబుతూ అజయ్ కుమార్ సైతం తనను తాను అజయ్ ఖాన్ గా సంబోధించుకునేవారు. సీఎం రేవంత్ రెడ్డితో మాజీ మంత్రి పువ్వాడను పోల్చడం కాదుగానీ, రేవంత్ రెడ్డిని రేవంత్ గౌడ్ గా అభివర్ణిస్తూ పీసీసీ చీఫ్ కొనియాడిన సందర్భంగా అజయ్ కుమార్ కు అప్పట్లో లభించిన ఈ తరహా కృతజ్ఞతాపూర్వక ఘటనలు ఖమ్మం ప్రజల కళ్లముందు మరోసారి కదలాడుతుండడమే అసలు విశేషం.