ఖమ్మం: ఖమ్మం నగర శివారు వెలుగుమట్లలో రియల్ వ్యాపారం నిర్వహిస్తున్న ‘పారుపల్లి కన్ స్ట్రక్షన్స్’ లిమిటెడ్ సంస్థ కార్యకలాపాలు లీగల్ వివాదంలో చిక్కుకున్నాయి. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని వెలుగుమట్ల గ్రామ సర్వే నెం. 143/ఎఎ లోని 2.00 ఎకరాల్లో, సర్వే నెం. 143/బి లోని 3.00 ఎకరాల్లో, సర్వే నెం. 143/ఎఎలోని 5.05 ఎకరాల్లో నిర్మిస్తున్న నివాస గృహాలపై ఖమ్మానికి చెందిన దమ్మాలపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఖమ్మం రెండో అదనపు జిల్లా కోర్టులో దావా (ఓఎస్ నెం. 16/2021) దాఖలు చేశారు.
ఆస్తి పంపిణీ విభాగాలకోసం తన క్లయింట్ కుటుంబ సభ్యులైన దమ్మాలపాటి సుగుణమ్మ, దమ్మాలపాటి (అలియాస్) పారుపల్లి విజయలక్ష్మి, దమ్మాలపాటి కార్తీక్, పారుపల్లి శ్రీకవిత, పారుపల్లి కన్ స్ట్రక్షన్స్ లపై దావా వేసినట్లు దమ్మాలపాటి శ్రీనివాసరావు తరపు న్యాయవాదులు బహిరంగ ప్రకటన చేశారు. ఈ దావా పెండింగ్ లో ఉన్న పరిస్థితుల్లోనే తమ క్లయింట్ పరోక్షంలో సదరు కుటుంబ షభ్యులు కోర్టులో కేసుల విషయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ వారికి తెలియకుండా మభ్యపరిచి సదరు షెడ్యూల్ భూమిలో నివాస గృహాలు నిర్మించి విక్రయించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు న్యాయవాదులు పేర్కొన్నారు. దరిమిలా ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ను, ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ లను ప్రతివాదులుగా చేర్చవలసిందిగా కోరుతూ తమ క్లయింట్ దమ్మాలపాటి శ్రీనివాసరావు పిటిషన్ వేశారని పేర్కొన్నారు.

అదేవిధంగా కేసు పెండింగ్ లో గల షెడ్యూల్ దాఖలా ఆస్తి గురించి దస్తావేజులు తయారు చేసినందువల్ల వారిని, మరో 31 మందిని ప్రతివాదులుగా చేర్చాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, ఈ పిటిషన్లకు ఐఏ నెం. 13/2026, 14/2026 ద్వారా ఫైల్ చేసినట్లు దమ్మాలపాటి శ్రీనివాసరావు తరపున న్యాయవాదులు పేర్కొన్నారు.
దావా నెం. 16/2021, పిటిషన్లు కోర్టు ముందు పెండింగ్ లో ఉన్నప్పటికీ, పేర్కొన్న ప్రతివాదులు మరికొందరు వ్యక్తులతో కుమ్ముక్కై రహస్యంగా మరికొన్ని డాక్యుమెంట్లు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియవచ్చిందని న్యాయవాదులు పేర్కొన్నారు. అందువల్ల ప్రకటించిన షెడ్యూల్ ఆస్తిని నివాస గృహాల రూపంలోగాని, మరే రూపంలోగాని కొనుగోలు చేయవద్దని, ఎవరైనా క్రయం చేస్తే తమ క్లయింట్ పై ఎటువంటి బైండింగ్ ఉండదని, కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని దమ్మాలపాటి శ్రీనివాసరావు తరపున న్యాయవాదులు ప్రకటించారు. ఈ అంశంలో ఏవేని అభ్యంతరాలుంటే తమకుగాని, తమ క్లయింట్ కు గానీ రాతపూర్వకంగా తెలియజేయాలని కూడా అడ్వకేట్లు సూచించారు. సదరు విషయంలో ఈనెల 1వ తేదీన తెలంగాణా రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)కి లీగల్ నోటీసు పంపినట్లు కూడా తెలిపారు. కోర్టు దావాలో గల ఆస్తిపై తయారు చేస్తున్న డాక్యుమెంట్లలో హద్దులు మార్పు,చేర్పులుగా తయారు చేస్తున్నట్లుగా తెలియవచ్చిందని యావత్ ప్రజానీకానికి తెలియపరుస్తున్నట్లు దమ్మాలపాటి శ్రీనివాసరావు తరపు న్యాయవాదులు ప్రకటించారు.

కాగా ఈ ప్రకటనలో పేర్లు వెల్లడించిన 31 మంది ప్రతివాదుల్లో ఖమ్మం నగరానికి చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు. పేరెన్నిక గల ఓ విద్యా సంస్థ నిర్వాహకులు, రాష్ట్రస్థాయిలో ప్రాచుర్యం గల వ్యాపారవేత్తలు, ఓ జాతీయ బ్యాంకు తదితరులు కూడా ప్రతివాదుల జాబితాలో ఉన్నారు. దమ్మాలాపాటి శ్రీనివాసరావు తరపున న్యాయవాదులు చేసిన ఈ ప్రకటన ఖమ్మం నగర ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఫైల్ ఫొటోలు: పారుపల్లి కన్ స్టక్షన్స్ సంస్థ ఖమ్మం నగర శివారల్లోని వెలుగుమట్లలో నిర్మిస్తున్న నివాస గృహాలు
