ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు వ్యూహం మార్చారు. ‘ఆపరేషన్ కగార్’తో కకావికలమవుతున్న కేడర్ ను కాపాడుకునేందుకు మావోయిస్టు పార్టీ నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఛత్తీస్ గఢ్, మహారాష్ట్రలతో కూడుకున్న దండకారణ్యంలో మావోయిస్టులు సాయుధపరంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు ఆ రాష్ట్ర పోలీసు అధికారులను, నిఘా వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ ఆంగ్ల మీడియా సంస్థ ఆసక్తికర వార్తా కథనాన్ని ప్రచురించింది. మావోల తాజా వ్యూహం వల్ల వారి ఉనికిని పసిగట్టడంలో భద్రతా దళాలకు సైతం సమస్యగానే మారినట్లు పోలీసు నిఘా వర్గాలు వెల్లడించినట్లు ఆ మీడియా సంస్థ తన కథనంలో స్పష్టం చేసింది. వచ్చే మార్చి నెలాఖరు నాటికి నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామని కేంద్రం పదే పదే పునరుద్ఘాటిస్తున్న నేపథ్యంలో మావోల తాజా వ్యూహం చర్చనీయాంశంగా మారింది.
ప్రసిద్ధి గాంచిన జాతీయ ఆంగ్ల పత్రిక ప్రచురించిన ఆ వార్తా కథనంలోని సారాంశం ప్రకారం.. మావోలను ఏరివేేసేందుకు ఛత్తీస్ గఢ్, మహారాష్ట్రల్లో కేంద్రం దాదాపు 20 వేల మంది భద్రతా బలగాలను మోహరించింది. ఆయా రాష్ట్రాల దండకారణ్యంలో జరుగుతున్న నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో 2024లో 217 మంది మావోయిస్టులు మరణించారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన నక్సలైట్ల సంఖ్య 460కి పెరిగింది. గత మే 21వ తేదీన ఛత్తీస్ గఢ్ దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతితో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ముఖ్యంగా వామపక్ష తీవ్రవాదంలో ఇది భారీ నష్టం. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ ఘటన మావోయిస్టు ఉద్యమ బాటపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.

ఇటువంటి ఘటనల్లో నాయకత్వపరంగా జరుగుతున్న భారీ నష్టపు పరిణామాల్లో మావోయిస్టులు ప్రస్తుతం ఇంద్రావతి నేషనల్ పార్కుకే పరిమితమయ్యారు. అంతేకాదు అజ్ఞాతంలో గల అనేక మంది మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెట్టి అబూజ్ మడ్, బీజాపూర్, సుక్మా ప్రాంతాలకు చెందిన స్థానికులతో కలిసి నివసిస్తున్నారు. ఆపరేషన్ కగార్ కారణంగా పెద్ద సంఖ్యలో నాయకులను, కేడర్ కోల్పోయిన మావోయిస్టు పొలిట్ బ్యూరో నెలరోజుల క్రితం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం తిరుగుబాటు ఉద్యమానికి పరిస్థితి అనుకూలంగా లేదని ఓ సర్క్యులర్ ను కూడా కేడర్ కు జారీ చేసింది. అన్ని విభాగాల కార్యకర్తలు ‘అండర్ గ్రౌండ్’లోకి వెళ్లాలని ఆదేశించింది. అయితే పోలీసులు తమ ఉనికిని గుర్తించకుండా ఉండేందుకు భారీ సంఖ్యతో కూడిన బెటాలియన్లతో కాకుండా చిన్న చిన్న టీంలుగా విభజించాలని ఆదేశించింది. ఇటువంటి సమయంలోనూ భద్రతా బలగాలు ఉనికిని గుర్తించినా భారీ ప్రాణనష్టాన్ని తగ్గించడం, కేడర్ మనుగడను పెంచడమే లక్ష్యంగా ఇటువంటి మార్పులకు పార్టీ పొలిట్ బ్యూరో ఆదేశించింది.

మావోల తాజా వ్యూహాన్ని ధ్రువీకరిస్తూ ఆ పార్టీ నాయకుడు రూపేష్ ఛత్తీస్ గఢ్ కు చెందిన జర్నలిస్ట్ వికాస్ తివారీకి ఇచ్చిన ఇంటర్య్యూలో స్పష్టం చేసినట్లు ఛత్తీస్ గఢ్ పోలీసు అధికారి ఒకరు ప్రస్తావించారు. తాజా వ్యూహంలో భాగంగానే ఇంకా మిగిలి ఉన్న పార్టీ సీనియర్ మావోయిస్టు నాయకులను ఏకాంత ప్రాంతాలకు తరలించడం, వారిని గుర్తించకుండా ఉండేందుకు స్థానిక గ్రామస్తులతో కలిసిపోవడానికి గ్రామీణ దుస్తులలో మారువేషంలో ఉంచినట్లు రూపేష్ తన ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఆ పోలీస్ అధికారి పేర్కొన్నారు. కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ ఎన్కౌంటర్ తర్వాత మిగిలిన నాయకుల భద్రతపై తీసుకున్న వ్యూహాత్మక మార్పు గురించి రూపేష్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడారని గుర్తు చేశారు.

కాగా నింగి నుంచి వైమానిక నిఘా ద్వారా మిగిలిన తమ కేడర్ ను గుర్తించకుండా ఉండేందుకు బెటాలియన్లను మావోయిస్ట్ పార్టీ చిన్న చిన్న స్క్వాడ్ లుగా విభజించినట్లు నిఘా విభాగపు పోలీసులు గుర్తించారు. నిర్దేశిత స్థావరాలను వదిలేసిన మావోయిస్టులు ఎక్కువగా బీజాపూర్ లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ భూభాగానికి వెళ్లిపోయారని అంచనా వేస్తున్నారు. అయితే రహదారి సౌకర్యం సరిగ్గా లేక భద్రతా దళాలు నేషనల్ పార్క్ అడవుల్లోకి చొచ్చుకువెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు. ఇదే దశలో మావోయిస్టులు పరిసర గ్రామాల ప్రజలను స్పాటర్లుగా, పోలీసుల కదలికల సమాచారాన్ని అందించే ఇన్ఫార్మర్లుగా మార్చుకున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. చిన్న చిన్న స్క్వాడ్ లతో ఇది ప్రస్తుతం మావోయిస్టులకు సరికొత్త కేంద్రంగా మారుతోందని ఆ వర్గాలు పసిగట్టాయి.
దండకారణ్యంలో ప్రస్తుతం మావోయిస్టులు ‘మారువేషం’లోరి మారి గ్రామస్తుల్లో కలిసిపోయారని, తమ సైనిక యూనిఫాం ఆలివ్ గ్రీన్ దుస్తులను వదిలేసి, సాధారణ దుస్తుల వాడకంలోకి మారిపోయినట్లు నిఘా విభాగపు అధికారులు చెబుతున్నారు. దీంతో తాము ఏమాత్రం గుర్తించకుండా స్థానికంగా జరిగే వివిధ రాజకీయ సమావేశాల్లో పాల్గొంటున్నారని, గ్రామాల్లోనే ఎక్కువ కాలం గడుపుతున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే దశలో ఆపరేషన్ కగార్ కారణంగా తాము భారీ ఎత్తున నష్టపోయినట్లు మావోయిస్టు పార్టీ అంగీకరిస్తూ ఓ నివేదికను విడుదల చేయడం గమనార్హం. మొత్తంగా పరిశీలించినపుడు ఛత్తీస్ గఢ్ అడవుల్లో ‘జనతన సర్కార్’ను నడిపిన మావోలు ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో తమ వ్యూహం మార్చుకోవడం విశేషం. ‘ఆత్మరక్షణ’ పద్దతుల అనుసరణలో భాగంగా ఆలివ్ గ్రీన్ డ్రెస్ కోడ్ నుంచి సివిల్ దుస్తుల్లోకి మారిన సాయుధ నక్సల్స్ మున్ముందు అనుసరించే యుద్ధ వ్యూహాలపై ప్రభుత్వ వర్గాలు సహజంగానే గట్టి నిఘాను ఏర్పాటు చేసి మరింత సమాచార సేకరణలో నిమగ్నమయ్యాయి.