Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

‘కల్చరల్ పాలసీ బూజు దులపండి’

ఉద్యమం చేసి ఎందరో ప్రాణాలు పోగొట్టుకుని తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధానంగా సాగిన ఉద్యమం దిగ్విజయమై 12 ఏళ్ళు కావస్తోంది. కేవలం రాజకీయ నేతలు లబ్ది మినహా ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ కనిపించడం లేదు. గత కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఎక్కువగా తాత్కాలిక అభివృద్ధి పనులకే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు.

అసలు అభివృద్ధి మూలాల్లోంచి మొదలుపెట్టాలి. సమగ్రంగా పునాదులు వేసుకుంటూ రావాలి. సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలి. అప్పుడే తెలంగాణ అభివృద్ధి భౌగోళికంగా జరుగుతుంది. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను, తెలంగాణ కళలను విస్మరించి అద్భుతమైన ప్రగతిపథంలో పయనిస్తున్నాం అనుకుంటే పొరబడినట్లే! రైతు భరోసా, కల్యాణ లక్ష్మి, విద్యార్థులకు చేయూత, పెన్షన్లు ఇతరత్రా స్కీములు ఇవన్నీ అభివృద్ధి కిందకు రావు. అసలైన అభివృద్ధి అంటే తెలంగాణ పల్లెల్లోంచి మొదలుకావాలి. ఇప్పటికి కనీస రోడ్లు, కరెంటు, బడి లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. మౌలిక సౌకర్యాలు కల్పించుకుంటూ ముందడుగు వేయాలి.

కళారంగం పట్ల చిన్నచూపు:
ముఖ్యంగా ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా ముందు భాషా సాంస్కృతికంగా ఎదగాలి. కానీ, దురదృష్టవశాత్తు పాలకులు సంస్కృతిని పట్టించుకోరు. పట్టించుకోవాల్సిన కళా రంగాన్ని చిన్న చూపు చూస్తారు. కళా రంగం వికసిస్తే ఆ రాష్ట్రం సస్యశ్యామలం అనే నానుడి వూరికినే రాలేదు. కానీ, అదొక వినోదం అని కొట్టిపారేస్తుంటారు. విశేషమేమిటంటే ఏ కార్యక్రమం దిగ్విజయం కావాలన్నా ముందు, వెనుక కళాకారులు ఉండి తీరాల్సిందే.

ఇంతటి మహత్తర శక్తి కలిగిన సాంస్కృతిక రంగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. సాంస్కృతిక వికాసం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుచూపుతో ప్రముఖ దర్శకుడు కవి చిత్రకారులు బి. నర్సింగరావును గత ఏడాది నవంబర్ నెలలో ఆహ్వానించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లోనే ఆయనతో భేటీ అయ్యారు. తెలంగాణ కళలు, సినిమా, పురావస్తు సంపదను ఎలా పరిరక్షించుకోవాలి? ఎలా అభివృద్ధి చేయాలి? ఎలా విశ్వ వ్యాప్తం చేయాలి? అని చర్చించుకున్నారు. డిసెంబర్ 9వ తేదీలోపు సాంస్కృతిక సమగ్ర పాలసీ తయారు చేసి తనకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

అద్భుతమైన కల్చరల్ పాలసీ:
ఈ అంశంఫై సమగ్ర అవగాహన కలిగిన బి. నర్సింగరావు 80 ఏళ్ల వయసులో తెలంగాణ అభివృద్ధి కోసం ఉత్సాహంగా నడుం బిగించారు. ఎన్నో దేశాల సాంస్కృతిక వికాసాన్ని అధ్యయనం చేశారు. ఎందరో మేధావులతో చర్చించారు. రేవంత్ రెడ్డి కోరిన విధంగా అద్భుతంగా కల్చరల్ పాలసీ రూపొందించి ఇచ్చిన సమయం కన్నా ముందే ముఖ్యమంత్రికి అందించారు. తెలంగాణ కల్చరల్ పాలసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల్లోకి వెళ్లి ఏడు నెలలు గడిచింది.. అతీ, గతీ లేదు! అద్భుతం.. అని మెచ్చుకున్నారు కానీ, అమలుకు నోచుకోలేదు! గతంలో సాంస్కృతిక రంగానికి వున్న బడ్జెట్ ను మూడింతలు పెంచారు.. కానీ, పాలసీ మాత్రం మూలన పడింది.

నిజానికి బి.నర్సింగరావు రూపొందించిన సాంస్కృతిక విధానం అపురూపం అని చెప్పుకోవచ్చు. ఆయన తన సుదీర్ఘ అనుభవాన్నీ, విశ్వజనీనమైన తన ఆలోచనలను మిళితం చేసి తీర్చిదిద్దిన ఆ విధానం అమల్లోకి తీసుకు వస్తే, దేశంలోని అన్ని రాష్ట్రాలే కాదు ప్రపంచ దేశాలు కూడా తెలంగాణ కల్చరల్ మోడల్ ను అనుసరించి తీరాల్సిందే! అంతటి మహత్తర ప్రణాళిక ఆయన రూపొందించారు.

సంస్కృతీ, సంప్రదాయాలు, భాషా వికాసం, కళల పరిరక్షణ, కళాకారుల అభ్యున్నతి, ఆడిటోరియాల అభివృద్ధి, కొత్త ఆడిటోరియాలు.. వెరసి ఏకంగా ఆయన కల్చరల్ విలేజ్ ను హైదరాబాద్ లో సృష్టించే అపూర్వ ఆలోచనతో అద్భుతంగా రూపొందించారు. తెలంగాణలో ఎందరో కళాకారులు వున్నా ప్రత్యేకంగా సినిమా రంగంలో వెనకబడి ఉన్నారు. తెలంగాణ సినిమా రంగం అభివృద్ధి కోసం ఆయన అనేక ఆలోచనలతో కార్యక్రమ రూపకల్పన చేశారు. ఇక అసలైన పురావస్తు శాఖ అభివృద్ధికి, మ్యూజియంల పరిరక్షణకు, తెలంగాణ విలువైన సంపదను కాపాడుకుంటూ వెలుగులోకి తీసుకొచ్చేందుకు బృహత్తర విధానం తీర్చిదిద్దారు. ఇవి అమల్లోకి వచ్చి ఒక రూపంలోకి రావడానికి ఆయన మూడేళ్ళ సమయం అడిగారు. ఒక వైపు తెలంగాణ కళలు కళకళలాడేలా చేస్తూనే మరో వైపు భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ కళను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లి యువ కళాకారులకు ఉపాధి బాట కల్పించాలని ఆయన చేసిన శ్రమ ఇప్పటికి అలా వృధాగా పడి ఉండటం, నిర్లక్ష్యానికి గురి కావడం విచారించాల్సిన విషయం.

కేసీఆర్ ప్రభుత్వం కొన్ని అత్యవసర విషయాలను విస్మరిస్తే, అదే బాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నట్లు అనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఆలోచనలు విభిన్నంగా ఉన్నా, అవి ఆచరణకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రధానమైన తెలంగాణ కల్చర్ పాలసీ బూజు దులిపి ఆచరణలోకి తీసుకురావాలి. తద్వారా తెలంగాణ కళ విశ్వ వ్యాప్తం కావాలి. ఎందరికో ఉపాధి బాట కావాలి. కళలు వికసిస్తేనే ఆ రాష్ట్రం కళకళలాడుతుంది. కళాకారులు సంతోషంగా ఉంటేనే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.

– డా. మహ్మద్ రఫీ

Popular Articles