Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

మంత్రి శ్రీధర్ బాబు తండ్రి ‘ఎన్కౌంటర్’ అయ్యారా!?

దుద్దిళ్ల శ్రీపాదరావు గుర్తున్నారా? ఈతరం వారికి పెద్దగా తెలియకపోవచ్చుగాని, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లోనేకాదు, తెలంగాణా రాజకీయాల్లోనూ చారిత్రక నేపథ్యం గల కాంగ్రెస్ నాయకుడు. సర్పంచ్ స్థాయి నుంచి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ స్థాయికి ఎదిగి, ఆ పదవికే వన్నె తెచ్చిన నేపథ్యం దుద్దిళ్ల శ్రీపాదరావు సొంతం. ఆయన మరెవరో కాదు ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తండ్రి.

తెలుగుదేశం ప్రభంజనం వీచిన రోజుల్లోనే.. 1983 ఎన్నికల్లో మంథని నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర శ్రీపాదరావుది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీపాదరావు 1994 ఎన్నికల్లో ఓటమి చెందడానికి కారణాలు అనేకం. అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించిన నాయకుడిని సైతం పల్లెత్తు మాట అనని హుందాతనపు రాజకీయానికి మారుపేరుగాప్రాచుర్యం పొందిన శ్రీపాదరావుకు సంబంధించిన క్లుప్త చరిత్రకు సంబంధించిన సారాంశమిది.

దశాబ్దాల రాజకీయ నేపథ్యం, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్ గా పదవీ బాధ్యతలు నిర్వహించిన నిఖార్సయిన కాంగ్రెస్ నాయకుడు దుద్దిళ్ల శ్రీపాదరావు ‘ఎన్కౌంటర్’ లో చనిపోయారా? తెలుగు న్యూస్ ఛానళ్లలో నంబర్ వన్, నంబర్ టూ స్థానాల్లో తరచూ రికార్డుల్లో గల నరేంద్ర చౌదరికి చెందిన Ntv కలిగించిన సందేహమిది. యూ ట్యూబర్ల ప్రేరణో, వెరైటీనో తెలియదుగాని ఈ మధ్య ప్రముఖ ఛానళ్లు కూడా పొలిటీషియన్లతో ‘Podcast Show’ పేరుతో ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. మీడియా సంస్థలు రాజకీయ నాయకులను ఇంటర్వ్యూలు చేయడం కొత్త ప్రక్రియేమీ కాదు. కాకపోతే ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్, ఎదుట గల వ్యక్తికి వేర్వేరుగా భారీ నిడివిగల మైకులు కనిపిస్తుండడమే బహుషా ‘Podcast Show’ శైలి కావచ్చు.

ఇటువంటి ‘Podcast Show’ పేరుతోనే ప్రముఖ న్యూస్ ఛానల్ Ntv తెలంగాణా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును తాజాగా ఇంటర్వ్యూ చేసింది. శ్రీధర్ బాబు రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పనితీరు, సీఎంతో శ్రీధర్ బాబు అనుబంధం, సమన్వయం తదితర అంశాలతో 1.07 గంటల నిడివితో ‘Podcast Show’ నిర్వహించింది. ఇదే ‘Podcast Show’ వీడియోను ముక్కలు ముక్కలుగా చేసి వాటిని యూ ట్యూబులో అప్ లోడ్ చేశారు. ఆకట్టుకునే థంబ్ నెయిల్స్ తో తక్కువ నిడివి గల వీడియోను వ్యూయర్స్ వద్దకు తీసుకువెళ్లే ప్రక్రియను అందరూ పాటిస్తుంటారు. Ntv కూడా అమలు చేస్తోంది. ఇందులో తప్పేమీ లేకపోవచ్చు.

మంత్రి శ్రీధర్ బాబుతో యాంకర్ ‘పాడ్ కాస్ట్ షో’ చేసిన చిత్రం

కానీ ప్రముఖ న్యూస్ ఛానల్ గా ప్రాచుర్యంలో గల తుమ్మల నరేంద్ర చౌదరికి చెందిన Ntvలోనూ శ్రీధర్ బాబుతో నిర్వహించిన ‘Podcast Show’లోని 5.16 నిమిషాల నిడివిగల ఓ వీడియోకు పెట్టిన‘థంబ్ నెయిల్’ శ్రీపాదరావు మరణంపై సరికొత్త సందేహాలను రేకెత్తించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ ‘థంబ్ నెయిల్’ ఏమిటంటే.. ‘నాన్న ఎన్కౌంటర్ సెన్సేషన్ కోసమే!’ అనే హెడ్డింగ్ ను కలిగి ఉండడం. ‘PODCAST WITH IT MINISTER SRIDHAR BABU’ అనే సబ్ హెడ్డింగ్ కూడా థంబ్ నెయిల్ లో పెట్టారు. థంబ్ నెయిల్ లో శ్రీధర్ బాబు ఇంటర్వ్యూ లోని దృశ్యపు ఫొటోను, ఆయన తండ్రి శ్రీపాదరావు ఫైల్ ఫొటోను కూడా వాడారు.ఈ థంబ్ నెయిల్ చూసిన వారికి మంత్రి శ్రీధర్ బాబు తండ్రి ‘ఎన్కౌంటర్’ అయ్యారా? అనే సందేహం కలగకమానదు. శ్రీపాదరావు గురించి తెలిసినవారు ఇది తప్పుడు థంబ్ నెయిల్ అని గ్రహించవచ్చు.. కానీ ఇప్పటి తరంవారికి శ్రీపాదరావు రాజకీయ నేపథ్యంపై పెద్దగా అవగాహన ఉండవకపోవచ్చు. ఓహో.. శ్రీపాదరావు ‘ఎన్కౌంటర్’ అయ్యారా? అని భావించవచ్చు.

వాస్తవానికి శ్రీపాదరావు ‘ఎన్కౌంటర్’ కాలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంట్లో జరిగిన దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు 1999 ఏప్రిల్ 13వ తేదీన శ్రీపాదరావు మహదేవపూర్ మండలం అన్నారం గ్రామానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తన అనుచరులతో వస్తున్న శ్రీపాదరావును అప్పటి పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్ట్ పార్టీ నక్సల్స్ అటకాయించి, మాట్లాడాలంటూ అడవిలోకి తీసుకువెళ్లి కాల్చి చంపారు. ఈ దారుణ హత్యకు పాల్పడిన పీపుల్స్ వార్ నక్సల్స్ చర్యపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. శ్రీపాదరావును చంపడం పొరపాటు చర్యగా కేంద్ర కమిటలో చర్చ జరిగినట్లు ఆ తర్వాత చోటు చేసుకున్న ఓ ఘటనలో పీపుల్స్ వార్ దళనేత ఒకరు వెల్లడించాడనేది వేరే విషయం.

ఎన్ టీవీ పెట్టిన థంబ్ నెయిల్

ఈ పరిస్థితుల్లో మంత్రి శ్రీధర్ బాబుతో ‘Podcast Show’ నిర్వహించిన Ntv వంటి సంస్థ ప్రజాభిమాన నేతగా ప్రాచుర్యం పొందిన శ్రీపాదరావు వంటి నాయకుడు ‘ఎన్కౌంటర్’ అయినట్లు థంబ్ నెయిల్ పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఎన్కౌంటర్’కు గురయ్యేది నక్సలైట్లు, టెర్రరిస్టులు.. కొన్ని సంఘటనల్లో దోపిడీలకు పాల్పడే బందిపోట్లు, మాఫియా డాన్ లు, వారి అనుచరులు కూడా ఎన్కౌంటర్లలో చనిపోతుంటారు. యూపీ తరహా ఎన్కౌంటర్లలో మాఫియా ముఠాలు ఎక్కువగా హతమైన లెక్కలు ఉన్నాయి. మరికొన్ని ఉదంతాల్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లలో అనూహ్యంగా సాధారణ పౌరులే కాదు, కొందరు ముఖ్యులు కూడా ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు లేకపోలేదు. ‘ఎన్కౌంటర్’ అనే పదాన్ని ఉచ్ఛరించినపుడు చదివే పాఠకులకు, చూసిన ప్రేక్షకులకు ఒకేరకమైన భావన కలగకపోవచ్చు.. భిన్న భావనకూ ఆస్కారం ఉందనేది అందరికీ తెలిసిందే.

కానీ దుద్దిళ్ల శ్రీపాదరావు ప్రజా నాయకుడు, పలుసార్లు ఎమ్మెల్యేగా, శాసనసభ స్పీకర్ గా పనిచేసిన నాయకుడు. అతన్ని హత్య చేయడం పొరపాటేనని పీపుల్స్ వార్ సంస్థ సైతం అంగీకరించిన నేపథ్యం ఉంది. ఇంతటి చారిత్రక రాజకీయ నేపథ్యం గల ప్రజానాయకుడు ‘ఎన్కౌంటర్’ గురైనట్లు ప్రముఖ సంస్థగా భావిస్తున్న Ntv వంటి సంస్థ కూడా ఇటువంటి థంబ్ నెయిళ్లు పెడితే, వ్యూస్ వస్తాయేమోగాని, క్రెడిబిలిటీ మాత్రం పెరగదు. పైగా థంబ్ నెయిల్ లోని హెడ్డింగ్ వాక్యాన్ని మంత్రి శ్రీధర్ బాబు చెబుతున్నట్లుగానే గోచరించడం గమనార్హం. సంచలనం కోసమే తన తండ్రి ‘ఎన్కౌంటర్’ అయ్యారని శ్రీధర్ బాబు చెబుతున్నట్లుగా థంబ్ నెయిల్ లో క్లియర్ గా ఉంది.

దుద్దిళ్ల శ్రీపాదరావు (ఫైల్ ఫొటో)

మంత్రి శ్రీధర్ బాబుతో నిర్వహించిన ‘పాడ్ కాస్ట్ షో’లో యాంకర్ కు కూడా ఈ అంశంపై సరైన అవగాహన ఉన్నట్లు లేదు. ‘దురదృష్టం’ అనే పదాన్ని ఉచ్ఛరించారే తప్ప శ్రీపాదరావు ప్రాణాలు కోల్పోవడానికి గల కారణాలపై యాంకర్ స్పష్టమైన ప్రశ్నను వేయలేదు. అందువల్ల చెప్పొచ్చేదేమిటంటే.. శ్రీధర్ బాబు వంటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేసేటపుడు విషయంపై పూర్తి అవగాహన ఉన్నవారిని ఎంచుకుంటే మంచిది. నరేంద్ర చౌదరి ఛానల్ ఉద్యోగ నెట్ వర్క్ లో తోపుల్లాంటి విలేకరులు కూడా ఉన్నట్టుంది. వారితో యాంకర్లకు కాస్త తర్ఫీదు ఇప్పించి ప్రశ్నలు వేయిస్తే బాగుంటుంది. లేదంటే శ్రీపాదరావు వంటి ప్రముఖ ప్రజానాయకుడు, ప్రజానేత ‘ఎన్కౌంటర్’కు గురైనట్లు థంబ్ నెయిల్ పెడితే, స్పీకర్ పదవికే ఔన్నత్యం తీసుకువచ్చిన ఆ నాయకుడి కీర్తిపై పడే మచ్చ ఏమీ ఉండకపోవచ్చు. నరేంద్ర చౌదరి ఛానల్ ‘ఇజ్జత్’ మాత్రమే పోతుందన్నది నిర్వివాదాంశం.

Popular Articles