దొంతు రమేష్.. ఈనెల 13వ తేదీన శంషాబాద్ ఎయిర్ పోర్టులో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వార్తల్లోకి వచ్చిన సీనియర్ జర్నలిస్టు. తెలుగు న్యూస్ ఛానల్ N Tvలో తెలంగాణా ఇన్ పుట్ ఎడిటర్ హోదాలో గల దొంతు రమేష్ సహా ఇద్దరు జర్నలిస్టుల అరెస్ట్, కోర్టులో హాజరు, రిమాండ్ విధింపునకు కోర్టు తిరస్కరణ, షరతులతో కూడిన బెయిల్ మంజూరు, పాస్ పోర్టులు స్వాధీనం చేయాలనే ఆదేశం వంటి వరుస పరిణామాలు తెలిసిందే.
మహిళా ఐఏఎస్ అధికారిపై ‘ఆఫ్ ది రికార్డ్’ పేరుతో N Tv ప్రసారం చేసిన ఓ వార్తా కథనం నైతికమా? అనైతికమా? అనే అంశంలోకిగాని, చర్చలోకి గాని ‘సమీక్ష’ న్యూస్ వెబ్ సైట్ నిర్వాహకునిగా, సీనియర్ జర్నలిస్టుగా నేను వెళ్లడం లేదు. కానీ ఈ ఘటనలో అరెస్టయిన దొంతు రమేష్ బెయిలుపై విడుదలైన తర్వాత తన ‘ఎక్స్’ ఖాతాలో శుక్రవారం చేసిన ఓ పోస్టు అనేక ప్రశ్నలను, సందేహాలను లేవనెత్తుతోంది. ఆయా అంశాలేమిటనేది తెలుసుకునే ముందు దొంతు రమేష్ చేసిన ‘ఎక్స్’ పోస్టులోని పూర్తి అక్షర సారాంశాన్ని యథాతథంగా దిగువన ఓసారి చదవండి.

ఫ్రెండ్స్ నమస్తే.
సంబంధం లేని ఒక వార్తా కథనానికి, నాకు లెంక పెడుతూ, దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్లో తెలంగాణా రాష్ట్ర భాగస్వామ్య వార్తల కవరేజీ కోసం అలాగే వెకేషన్ ట్రిప్ కోసం వయా బ్యాంకాక్ మీదుగా నా భార్యతో స్విట్జర్లాండ్ కు వెళ్తున్న నన్ను, పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విచారణ పేరిట నాకు ఏమాత్రం సంబంధం లేని అనేక ప్రశ్నలతో గంటల తరబడి వేధించిన విషయం కూడా విదితమే. ఐతే, పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించింది మొదలు, గౌరవ జడ్జిగారు నా రిమాండ్ ను తిరస్కరించి అర్ధరాత్రి దాటిన తరవాత విడుదల చేసే వరకు, కష్టకాలంలో అండగా ఉండి వ్యక్తిగతంగా నాకు , ఎన్టీవీ కి బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతఙ్ఞతలు.
అలా, పండగ పూట నేను చేయని తప్పుకు పాలకపక్షం పైశాచికానికి, అధికారగణం అణచివేతకు గురౌతున్న క్లిష సమయంలో, రాజకీయ పార్టీలు, పంథాలు, సిద్ధాంతాలకు అతీతంగా నా వెన్నంటి ఉన్న మిత్రులు, జర్నలిస్టు సోదరులు, రాజకీయ నేతలు, బీసీ సంఘాల నాయకులు, జర్నలిస్టు సంఘాల నాయకులు, వివిధ పత్రికలు, ఎలెక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు,సోషల్ మీడియా వారియర్స్ కు , నా ఎన్టీవీ కుటుంబానికి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
దొంతు రమేష్,
ఇన్పుట్ ఎడిటర్,
ఎన్టీవీ, హైదరాబాద్.
చదివారు కదా పోస్టులోని అంశాలను..?
తనకు సంబంధం లేని ఒక వార్తా కథనానికి, తనకు లెంక (అచ్చు తప్పు కాబోలు.. బహుషా లింక్ కావచ్చు) పెడుతూ, దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్ లో తెలంగాణా రాష్ట్ర భాగస్వామ్య వార్తల కవరేజీకోసం, అలాగే వెకేషన్ ట్రిప్ కోసం వయా బ్యాంకాక్ మీదుగా తన భార్యతో స్విట్జర్లాండ్ కు వెళ్తున్న తనను శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. అని రమేష్ పేర్కొన్నాడు. ఈ పరిణామాల్లో తనకు, తాను పనిచేస్తున్న సంస్థకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ పోస్టులో రమేష్ ధన్యవాదాలు తెలిపాడనేది వేరే విషయం.
తన ఎక్స్ పోస్టులో రమేష్ వాదనలో పొంతన కుదరని సందేహాలు ఏమిటంటే.. దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్ కు వార్తల కవరేజీ కోసం తనను ప్రభుత్వం తీసుకువెడుతోందా? లేక N Tv యాజమాన్యం సొంత ఖర్చుతో తనను దావోస్ కు పంపిస్తోందా? లేదంటే ప్రపంచ స్థాయి వార్తలను కవర్ చేసేందుకు తనకు గల ఆసక్తితో సొంత ఖర్చుతో వెడుతున్నాడా? అనే ప్రశ్నకు రమేష్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరముంది. ఎందుకంటే ఇటువంటి ముఖ్య సందర్భాల్లో ప్రభుత్వం ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులను విదేశాలకు తీసుకువెళ్లడం కొత్తేమీ కాదు. కానీ మీడియా ప్రతినిధులను ప్రభుత్వం తరపున తీసుకువెళ్లడమే నిజమైతే మిగతా సంస్థలకు చెందినవారు కూడా ఈ జాబితాలో ఖచ్చితంగా ఉంటారు.
ఈ వార్తా కథనం రాస్తున్న సమయానికి., అంటే శుక్రవారం రాత్రి 7 గంటల వరకు కూడా మీడియా ప్రతినిధులను దావోస్ కు తీసుకువెళ్లే అంశంలో ప్రభుత్వం తరపున నిర్ణయమేదీ జరగలేదు. ఈ విషయాన్ని సమాచార శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సమీక్ష’కు స్పష్టంగా తెలియజేశారు. అందువల్ల దొంతు రమేష్ వయా బ్యాంకాక్, స్విట్జర్లాండ్ మీదుగా దావోస్ కు వెళ్లడం నిజమే అయితే అక్కడ తన బస కోసం బుక్ అయిన హోటల్ వివరాలు, సమ్మిట్ కు వెళ్లి వార్త కవర్ చేసేందుకు లభించిన నిర్వాహకుల అనుమతి పత్రం వంటి డాక్యుమెంట్లు తన ఎక్స్ పోస్టులో అటాచ్ చేస్తే రమేష్ వాదనకు మరింత బలం చేకూరేది.
అంతేకాదు హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఈ కేసులో సిట్ అధికారి వీసీ సజ్జన్నార్ చేసిన కీలక వ్యాఖ్య కూడా తేలిపోయేది. తప్పు చేేయకుంటే ఎందుకు పారిపోతున్నారు? సాయంత్రం 5.30 గంటలకు టికెట్ బుక్ చేసుకుని వెళ్లాల్సిన అవసరమేముందనే సజ్జన్నార్ సంధించిన ప్రశ్నకు రమేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లయ్యేది. ఇంకో ప్రశ్న ఏమిటంటే.. కెమెరామెన్ వెంట లేకుండానే దావోస్ సమ్మిట్ కవరేజీకి వెళ్లడానికి N Tv యాజమాన్యం రమేష్ ను అనుమతించిందా? అనే విషయాన్ని కూడా ఇదే పోస్టులో అతను స్పష్టం చేస్తే వాదన మరింత స్ట్రాంగ్ గా, విశ్వసనీయతతో కూడి ఉండేది.
మరో సందేహం ఏమిటంటే.. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత 14వ తేదీ అర్ధరాత్రి ప్రాంతంలో రమేష్ మీడియాతో మాట్లాడారు. కానీ తాను దావోస్ కు వార్తల కవరేజీ కోసం వెడుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారనే విషయాన్ని ఆ సందర్భంలో చెప్పకపోవడం గమనార్హం. దావోస్ లో జరిగే ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్ కు వార్తల కవరేజీ కోసమే రమేష్ వెళ్లడం వాస్తవమని కాసేపు నమ్మినప్పటికీ, భార్యతో కలిసి వెళ్లేందుకు తాను పనిచేస్తున్న ఛానల్ అనుమతిస్తే మాత్రం అది ఖచ్చితంగా ఓ గొప్ప విశేషమనే చెప్పాలి. తమ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కుటుంబపరంగా ఇంత వెసులుబాటును కల్పించిన యాజమాన్యాన్ని ప్రశంసించక తప్పదు.
ఇక చివరగా ప్రస్తావించాల్సిన ముఖ్యాంశం ఏమిటంటే.. 1993-94 నుంచి నాకు తెలిసినటువంటి దొంతు రమేష్ కెరీర్ పరంగా వివిధ పత్రికల్లో, ప్రముఖ న్యూస్ ఛానల్స్ లో ఎదిగిన తీరుకు అతని ఒకప్పటి స్నేహితునిగా ఎంతో గర్విస్తుంటాను. ఇదే సందర్బంలో కురవి మండలం తట్టుపల్లి నుంచి విదేశాలకు వెకేషన్ ట్రిప్ వెళ్లేగలిగే ఆర్థిక స్థితిమంతుని స్థాయిని కలిగినందుకు కూడా రమేష్ పురోగతిపై అతని ఓల్డ్ ఫ్రెండ్ గా ఎంతో సంతోషిస్తున్నాను. అందువల్ల మొత్తంగా ఈ అంశంలో చెప్పొచ్చేదేమిటంటే దావోస్ లో జరిగే అతి ముఖ్యమైన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్ లో ప్రపంచ స్థాయి ఆంగ్లభాషను సునాయసంగా ఆకలింపు చేసుకునే విధంగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించిన రమేష్ భాషా నైపుణ్యతపైనా మహదానందం కలిగిన పూర్వ స్నేహితుడిగా నాకు ఎటువంటి సందేహం కూడా లేదు.
అందువల్ల ఈ అంశంలో రమేష్ అరెస్ట్ పట్ల అతని పాత స్నేహితునిగా ఒకింత సానుభూతిని వ్యక్తం చేస్తూ, తోటి జర్నలిస్టుగా నాకు కలిగినటువంటి ఈ సందేహాలకు నివృత్తి కలిగే విధంగా అవసరమైన డాక్యుమెంట్లు సహా దొంతు రమేష్ తన ఎక్స్ ఖాతాలో మరో పోస్ట్ పెడతారని, తద్వారా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న భిన్నవాదనలకు చెక్ పెడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను..
అంతేకాదు సంబంధం లేని ఓ వార్తా కథనంతో దొంతు రమేష్ కు ‘లంకె’ పెట్టి అరెస్ట్ చేయడం ద్వారా అతన్ని మానసిక క్షోభకు గురిచేసినందుకు పోలీసుల వ్యవహార తీరుకు చెక్ పెట్టల్సిన అవసరం కూడా ఉంది. అందువల్ల ప్రసారం చేసిన ఆ వార్తకు సోర్స్ చెప్పాల్సిన అవసరం లేకపోయినా, అందుకు బాధ్యులెవరనేది ‘సిట్’ అధికారులకు ఇన్ పుట్ ఎడిటర్ హోదాలో రమేష్ వివరించి ఉంటారనే ఆశిస్తున్నాను. వార్తా కథనాలను తెప్పించేందుకు అసైన్మెంట్ ఇచ్చే బాధ్యతల్లో గల రమేష్ కు ఖచ్చితంగా అందుకు బాధ్యులెవరని తెలిసే ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను.

✍️ ఎడమ సమ్మిరెడ్డి

