జఫర్ గఢ్: జనగామ జిల్లా జఫర్ గఢ్ లో సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆదివారం అరెస్ట్ చేసింది. మావోయిస్ట్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభియోగాలపై ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. భారతీయ న్యాయ సంహిత-2023 చట్టంలోని సెక్షన్ 152, ఉపా చట్టం-1967 ప్రకారం సెక్షన్ 13, 39 కింద ఇన్నయ్యను అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ ప్రకటించింది.

మన తొలివెలుగు యూ ట్యూబ్ ఛానల్ లో ‘Gade Innaiah Aggressive on Amit Shah on Maoists Encounter’ శీర్షికన ప్రసారమైన వీడియోలో 16.40 నిమిషాల ఇన్నయ్య వ్యాఖ్యలను ఎన్ఐఏ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. అదేవిధంగా ఎన్కౌంటర్ లో మరణించిన మావోయిస్ట్ పార్టీ నాయకుడు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భంగా అమరుల బంధుమిత్రుల సంఘం పేరుతో కొందరిని సమీకరించి చేసిన ప్రసంగపు అంశాలను ఎన్ఐఏ ఇన్నయ్యపై నమోదు చేసిన కేసులో ప్రస్తావించడం గమనార్హం.

జఫర్ గఢ్ లో ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాధ పిల్లల ఆశ్రమంలోనే ఆయనను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. నాంపల్లిలోని ఎన్ఐఏ కోర్టులో ఇన్నయ్యను హాజరుపరిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

