Top 5 This Week

Related Posts

మేడారం గద్దెల డిజైన్ మారుస్తున్నారా..!?

మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లుల గద్దెల డిజన్ ను మార్చేందుకు దేవాదాయశాఖ ప్రయత్నిస్తోంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో వనదేవతలైన సమ్మక్క, సారలమ్మ తల్లులు భక్తుల కోర్కెలు తీర్చేందుకు గద్దెలపై కొలువు దీరుతుంటారు. రెండేళ్లకోసారి జరిగే మహాజాతర సందర్భంగా మాత్రమే వనం నుంచి సమ్మక్క, సారమ్మల, గోవిందరాజు, పగిడిద్దరాజులు జాతర ప్రాంగణంలోని గద్దెలపై కొలువుదీరి లక్షలాది మంది భక్తులకు దర్శనమిస్తుంటారు. దశాబ్దాలుగా వనదేవతల గద్దెల రూపు భక్తుల మదిలో నిక్షిప్తమై ఉంది. ఎటువంటి గుడి, గోపురం వంటి ఆకృతి ఇక్కడ ఉండవు.

అయితే మేడారం జాతరలో శాశ్వత అభివృద్ధి పనుల కోసం నిర్దేశించిన మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా అమ్మవార్ల గద్దెల రూపాన్ని కూడా మార్చేందుకు దేవాదాయశాఖ సంసిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మేడారంలోని ఐటీడీఏ గెస్ట్ హౌజ్ మీటింగ్ హాలులో 2026 మహాజాతరపై సమీక్షా సమావేశాన్ని గురువారం నిర్వహించారు. వచ్చే జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మేడారం మహాజాతర నిర్వహిస్తున్నట్లు పూజారుల సంఘం తేదీలను ఖరారు చేస్తూ ఇటీవలే ప్రకటన కూడా విడుదల చేసింది.

మేడారంలో ప్రస్తుత గద్దె (జాతర జరిగినప్పటి చిత్రం)

ఈ నేపథ్యంలోనే నిర్వహించిన సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ వాస్తుశిల్పి (ఆర్కిటెక్ట్‌) రాజశేఖర్‌ ప్రొజెక్టర్‌ ద్వారా స్క్రీన్ పై మేడారం తల్లుల గద్దెల సరికొత్త డిజైన్‌ను ప్రదర్శించారు. అయితే ఈ డిజైన్ శాశ్వతంగా ఉండేలా గ్రానైట్ రాయితో రూపొందించే యోచన చేస్తున్నారట. వచ్చే జనవరి నెలాఖరులో జరిగే మహాజాతరలోకు ముందే మేడారం వనదేవతల కొత్త గద్దెలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. అయితే కొత్తగా రూపొందించిన ఈ గద్దెల డిజైన్‌ ను ఆదివాసీ సంఘాలు ఆమోదిస్తాయా? ఈ అంశంలో ఆదివాసీ ముఖ్యులు, పూజారుల సంఘం ఎలా స్పందిస్తాయనేది చర్చనీయాంశంగా మారింది.

Popular Articles