(సమీక్ష ప్రత్యేక కథనం)
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం సరికొత్త యోచన చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై గల పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ గేట్ల వద్ద ‘టోల్ ఫ్రీ’ ప్రాతిపదికన వాహనాలను అనుమతించాలంటూ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. ఆయా టోల్ గేట్ల వద్ద జనవరి 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, జనవరి 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆయా మార్గంలో టోల్ రుసుము లేకుండా వాహనాలను వదలాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోమటిరెడ్డి తన లేఖలో అభ్యర్థించారు.
అంతేకాదు సంక్రాంతి పండుగ రోజుల్లో జనవరి 8వ తేదీ నుంచి విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ ఉంటుందని, పండుగకు వెళ్లే ప్రయాణీలకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైతే తానే స్వయంగా బైకుపై తిరుగుతూ పర్యవేక్షిస్తానని కూడా మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ‘టోల్ ఫ్రీ’ నిర్ణయం, ఆలోచన, కోమటిరెడ్డి నితన్ గడ్కరీకి రాసిన లేఖపై సోషల్ మీడియాలో పలువురు వెటకరిస్తున్నారు. ఈమేరకు నెటిజన్లు ప్రభుత్వ నిర్ణయాన్ని ఆక్షేపిస్తూ పోస్టులు పెడుతున్నారు. విపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందినవారే కాదు, తెలంగాణా ఉద్యమకారులు సైతం ‘టోల్ ఫ్రీ’ ప్రతిపాదనను వ్యతిరేకిస్తుండడం గమనార్హం.

‘బోడి టోల్ గేట్ చార్జీలు రద్దు చేస్తే తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిష్ట ఏమొస్తుంది? పండుగలకు తమ స్వగ్రామాలకు వెళ్లే అన్ని కార్లకు ఉచితంగా పెట్రోల్ కూడా రానుబోను ఫుల్ ట్యాంక్ కొట్టేస్తే గౌరవంగా ఉంటుంది . అలాగే దారి ఖర్చుల కోసం ఓ ఐదువేలు లేదా దూరాన్నిబట్టి పదివేల వరకు ఇవ్వాలి.’ అని వ్యంగ్యాస్త్రం విసురుతున్నారు. ఈ ప్రతిపాదనను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెత్తబుట్టలో పడేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా హోరెత్తుతున్న ఇటువంటి పోస్టుల్లో కొన్నింటిని దిగువన చూడవచ్చు.





