ఛత్తీస్ గఢ్ లో గురువారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్ ఘటనల్లో మరణించిన నక్సలైట్ల సంఖ్య భారీగా పెరిగింది. బీజాపూర్ జిల్లా గంగలూరు అటవీ ప్రాంతంలో ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఎన్కౌంటర్ లో తొలుత ఇద్దరు నక్సలైట్లు, ఓ పోలీస్ జవాన్ మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం వచ్చింది. ఆ తర్వాత మధ్యాహ్నం ఈ సంఖ్య 20కి చేరింది. తాజా సమాచారం ప్రకారం ఈ సాయంత్రం 5.00 గంటల వరకు ఎన్కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల సంఖ్య 26 మందికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా వివరాలు ప్రకటించాల్సి ఉంది.
మరోవైపు కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల ఉదంతంలో నలుగురు మావోయిస్టు నక్సలైట్లు మరణించారు. బీజాపూర్ జిల్లా గంగలూరు లో నక్సల్స్, పోలీసుల మధ్య జరిగిన ఎన్కౌంటర్ లో ఓ పోలీసు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా ఛత్తీస్ గఢ్ లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్ల ఘటనలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ‘ఎక్స్’ ఖాతా ద్వారా స్పందిస్తూ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి దేశం మావోయిస్టు రహితంగా మారుతుందని పునరుద్ఘాటించారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ నక్సల్స్ లొంగిపోవడం లేదని, ఇటువంటి వారిపట్ల మోదీ సర్కార్ కఠిన వైఖరిని అవలంభిస్తోందని అన్నారు. ‘నక్సల్స్ ముక్త భారత్ అభియాన్’ దిశగా మన భద్రతా బలగాలు మరో పెద్ద విజయాన్ని సాధించాయని కొనియాడారు.

