అధికార పార్టీ నేతలు ఎవ్వరు మాట్లాడటం లేదు! పిల్లల నుంచి పెద్దల వరకు మధు పార్క్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్ నివాసులు గగ్గోలు పెడుతున్నారు! అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు! నిజానికి అది ఆక్రమిత బఫర్ జోన్ స్థలమనే వార్తలు వస్తున్నాయి. కానీ, ఆ బిల్డర్ ఎవ్వరో గానీ, ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తెచ్చుకున్నాడు! 450 మందికి అమ్మి పడేశాడు! అనుమతులు ఇచ్చిన ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఒక్కొక్కరుగా వచ్చి “మేం అడ్డుకుంటాం” అని భరోసా ఇస్తున్నారు. అదే రాజకీయం!

మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణలో భాగంగా ఐదు వేల కోట్ల రూపాయలతో ఇక్కడ వంద అడుగుల గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అది ఆక్రమిత బఫర్ జోన్ కాబట్టి ఖాళీ చేయమని సంబంధిత అధికారులు నోటీసులు జారీ చేశారు. అక్కడ నుంచి లొల్లి మొదలైంది! అందులో వున్న వాళ్లలో అధిక శాతం ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ సెటిలైన వాళ్లే! తెలంగాణ వాళ్ళు కూడా కొంత మంది ఉన్నారు. కానీ, అందరికి ఇక్కడే ఓటు ఉంది!

మూసీ సుందరీకరణ భాగ్యనగరానికి చాలా అవసరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రక్షాళన చేయాలనుకున్నారు కానీ, ఆచరణలోకి రాలేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ ప్రభుత్వం ధైర్యం చేసి ముందడుగు వేసింది. అదొక తేనె తుట్టె అని అర్ధమైంది. అప్పటికి ఇరువైపులా ఆక్రమించి ఇళ్ళు కట్టుకుని ప్రభుత్వ అనుమతులు సంపాదించి ఎన్నో ఏళ్లుగా వుంటూ, కొందరు అద్దెలు సంపాదించుకుంటూ హాయిగా జీవనం సాగిస్తున్న వారికి గుండెల్లో రాళ్ళు పడ్డాయి. కొందరు భీకరంగా నిరసనలు తెలిపారు. కొందరు ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తీసుకుని షిఫ్ట్ అయిపోయారు. ఇన్ని ఇళ్లను ఖాళీ చేయించడం కుదిరే పని కాదని కేసీఆర్ కు అర్ధమైంది. ఈలోపు ఆయన ప్రభుత్వం మారిపోయింది. రేవంత్ రెడ్డి తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా అడుగు పెట్టారు.

మూసీ సుందరీకరణ అద్భుతంగా చేయాలని, ఫ్యూచర్ సిటీ అందంగా తయారు చేయాలని… ఈ రెండు లక్ష్యాలను ఆయన గట్టిగా తలపెట్టారు. చరిత్రలో గొప్ప ముఖ్యమంత్రి అనిపించుకోవాలనే తాపత్రయం ఆయనది! అందుకే విదేశాలు వెళ్లి అక్కడ నదుల సుందరీకరణను పరిశీలించి అంతకన్నా అద్భుతంగా చేయాలనే పట్టుదలతో ఉన్నారు! కానీ, ఆయన మిస్ అయిన లాజిక్ ఒకటి ఉంది! విదేశాలు వేరు భారతదేశం వేరు! ఇది ప్రజాస్వామ్య దేశం! పేదలు అధికంగా వున్న దేశం! విదేశాల్లో వారి ప్రభుత్వాలు ఏం చెబితే అది అక్కడ పాటించి తీరతారు. ఇక్కడలా కాదు! నిరసనలకు రాజకీయాలు తోడవుతాయి! ఏదీ అంత ఈజీ కాదు ఇక్కడ!
అంతెందుకు, మూసీ ఇరువైపులా ఆక్రమిత ప్రాంత నివాసాలకు నీటి సౌకర్యం, విద్యుత్, ఇంటి నిర్మాణ అనుమతులు ఇచ్చిందెవరు? పైగా ఉచితంగా కాదు ఫీజులతో పాటు ఎంతో కొంత అండర్ టేబుల్ అందుకునే అనుమతులు ఇచ్చారు! ఎక్కడో వేరే రాష్ట్రపు అధికారులు కాదు. మన రాష్ట్రానికి సంబంధించి, మన హైదరాబాద్ జోన్ అధికారులేగా! ఒకవేళ ఏదైనా జోన్ లో కాస్త స్ట్రిక్ట్ అధికారి ఉంటే అతనికి రికమండ్ చేసి బెదిరించి భయపెట్టి బతిమలాడి అనుమతులు ఇప్పించడానికి ఆయా రాజకీయ పార్టీ నేతలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. చాలామంది అధికారులు ఈ న్యూసెన్స్ ఎందుకులే అని తీసుకునే వాళ్ళు తీసేసుకుని, వద్దనుకునే వాళ్ళు వద్దనుకుని మొత్తానికి అనుమతులు అయితే ఇచ్చేస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ఎందరో వలస వచ్చి ఆక్రమించి ఇళ్ళు కట్టేసుకున్నారు. అనుమతులు ఇచ్చి ఇన్నేళ్లు ఇంటి పన్నులు వసూలు, విద్యుత్, నల్లా బిల్లులు వసూలు చేసిన ప్రభుత్వమే ఇప్పుడు ఖాళీ చేయండి అంటోంది. ప్రత్యామ్నయం జాగానో, డబ్బులో, ఇళ్ళో ఇస్తానని చెబుతోంది! కానీ, 70 శాతం ఇందుకు సుముఖంగా లేరు.

ఇక మధు పార్క్ బ్రిడ్జ్ విషయానికి వద్దాం. అక్కడ గాంధీ తాత విగ్రహం పెడతాం, మీకు వేరే జాగా ఇస్తాం, అపార్ట్మెంట్ కట్టించి ఇస్తాం.. అని ప్రభుత్వం చెబుతున్నా అక్కడ నివసిస్తున్న 450 కుటుంబాలు నమ్మడం లేదు. దాదాపు చాలా వరకు బ్యాంక్ లోన్లు తీసుకుని కొన్న ఫ్లాట్స్ అవి! అసలు మూసీకి అనుకుని బాపు ఘాట్ ఉండగా, బాపు విగ్రహం ఉండగా మళ్ళీ ఇప్పుడంత పెద్ద గాంధీ విగ్రహం ఎందుకు? అన్ని వేల కోట్ల ఖర్చు ఎందుకు? ఒకవేళ అలాంటిది కట్టి పర్యాటకులను ఆకర్షించాలనుకుంటే భాగ్యనగరంలో మూసీ దగ్గరలోనే అనేక ప్రభుత్వ భూములు ఖాళీ గా ఉన్నాయి. అక్కడ కట్టొచ్చు! ఎన్టీఆర్ కట్టిన అతి పెద్ద మహాత్మాగాంధీ బస్ స్టాండ్ దగ్గర చాలా స్థలం ఉంది. అక్కడా పెట్టొచ్చు! ఉస్మానియా ఆసుపత్రికి అనుకుని బోలెడంత స్థలం ఉంది. అక్కడా కట్టొచ్చు! నివాసిత అపార్ట్మెంట్ ఖాళీ చేసి కూల్చేసి కట్టాలనుకోవడమే అతి పనికిమాలిన నిర్ణయం! అసలు బాపు విగ్రహం ఇప్పుడు ఎందుకు అని ఆయన ముని మనవడు తుషార్ గాంధీ కూడా అన్నారు. ఒకవేళ ఓటు బ్యాంక్ కు అనుకున్నా, సచివాలయం పక్కన అంత పెద్ద అంబేద్కర్ విగ్రహం కట్టించినా కేసీఆర్ ను తిరిగి గెలిపించలేదు జనం! మహాత్మాగాంధీ విగ్రహంతో ఓట్లు రాలి పడవు!
మూసీ ఇరువైపులా బఫర్ జోన్ ప్రాంతంలో ఆక్రమించి కట్టిన ఇళ్లను కూల్చాలని నిర్ణయం తీసుకున్నప్పుడే పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వానికి ఇలాంటి వ్యతిరేకత మంచిది కాదు. అందుకే బలవంతపు చర్యలకు దిగకుండా వున్న దాంట్లో మూసీ ప్రక్షాళన సుందరీకరణ చేయడం అత్యుత్తమ మార్గం! అనవసర డాంబికాలకు పోయి ఏవేవో ఊహించుకుని ఆ భ్రమలో ఏదో చేసేద్దాం అనుకుంటే ప్రజలకు ఓటు హక్కు అనే బలమైన ఆయుధం ఉంది! తగిన బుద్ధి చెప్పే నేర్పరితనం జనానికి ఉంది! ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మంచి కార్యక్రమాలు ఎన్నో చేయవచ్చు. మూసీ ప్రక్షాళన కూడా ఆ దిశగా చేయాలని ప్రియమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి.

✍️ డా. మహ్మద్ రఫీ

