జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని రెడ్డి కాలనీలో 15వ వార్డు కౌన్సిలర్ భర్త నాగవెల్లి రాజలింగమూర్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా పొడవడంతో అతను కుప్పకూలిపోయాడు. కొద్దిసేపు మృత్యువుతో పోరాడిన రాజలింగమూర్తి చివరికి ప్రాణాలు కోల్పోయాడు.
వివిధ అంశాల్లో రాజలింగమూర్తి తరచూ వార్తల్లోని వ్యక్తిగా నిలిచేవాడని స్థానికులు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు అంశంలోనూ ఫిర్యాదు చేసిన వ్యక్తిగా రాజలింగమూర్తి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. స్థానికంగా అనేక అంశాల్లో కూడా ఇతని ఫిర్యాదులు అసంఖ్యాకంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా హత్యోదంతంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాజలింగమూర్తి హత్యకు గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.