Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

తుపాకీకే సవాల్… ఏమిటీ ధైర్యం? ఎవరీ నేత?!

‘అన్నలూ…నన్ను క్షమించండి…మళ్లీ ఆరోపణలు రాకుండా చూసుకుంటాను. ఈ ఒక్కసారికి క్షమించండి.‘

‘నేను ఏ పొరపాటు చేయలేదు. మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. దయచేసి మరోసారి విచారణ జరపాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను.’

నక్సలైట్ పార్టీల వాల్ పోస్టర్లు, కరపత్రాల విడుదల, పత్రికా ప్రకటనలు జారీ చేసిన సందర్భాల్లో ఆరోపణలు ఎదుర్కున్నవారి అభ్యర్థనలు ఇవి. ఇలా అభ్యర్థించినవారిలో అనేక మంది రాజకీయ నేతలు, కాంట్రాక్టర్లు, అవినీతి ఆరోపణలు గల అధికారులు ఉన్నారు… కానీ అది గతం..

వర్తమానంలోకి వస్తే…

‘జనక్షేత్రంలో తేల్చుకుందాం…అవాస్తవ ఆరోపణలకు భయపడేది లేదు. రాజకీయ బ్రోకర్లు మీకు సానుభూతిపరులుగా మారారు. నక్సలైట్ నేత సబిత బేషరతుగా నాకు క్షమాపణ చెప్పాలి…ములుగు జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీశ్వర్ చేసిన సవాల్ కు సంబంధించిన వ్యాఖ్యల సారాంశమిది. అశ్చర్యంగా లేదూ?

ఎక్కడో…ఏదో తేడా కొడుతోంది కదూ? తెలంగాణాలో నక్సలైట్ల ఉనికే లేదని పోలీసు ఉన్నతాధికారులు అనేక సందర్భాల్లో ప్రకటించారు. తాజాగా రాష్ట్ర రాజధానిలో నక్సలైట్ కార్యకలాపాల ఆరోపణలపై ఓ దంపతుల జంటను కూడా అరెస్ట్ చేశారు. ఏటూరునాగారం దండకారణ్యం అంటే నక్సలైట్ కార్యకలాపాలకు ఒకప్పడు తిరుగులేని అటవీప్రాంతం. మావోలు, సీపీ గ్రూపు ఫణిబాగ్చి, రామచంద్రన్, జనశక్తి, ప్రతిఘటన, ప్రజాప్రతిఘటన, సీపీయూఎస్ఐ తదితర తీవ్రవాద గ్రూపుల కార్యకలాపాలకు పెట్టని కోటగా ప్రాచుర్యం పొందిన ఏటూరునాగారం ప్రాంతం నుంచే… ఓ ప్రజా ప్రతినిధి నక్సలైట్లకు సవాల్ విసిరిన ఉదంతం ఓ సంచలనం. ఇందుకు కారణాలు ఏవైనప్పటికీ, తనపై చేసిన ఆరోపణలకు ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి సిద్ధమని, బహిరంగ విచారణకు రావాలని జగదీశ్వర్ మావోలకు సవాల్ విసిరారు.

ఇక అసలు విషయంలోకి వస్తే…జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీశ్వర్ ను టార్గెట్ గా చేస్తూ మావోయిస్టు పార్టీ ఏటూరునాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సబిత పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. ఏటూరునాగారం ప్రాంతంలోని 34 ఎకరాల భూమి సంబంధించి జగదీశ్వర్ పై మావోయిస్టు నేతగా పేర్కొన్న సబిత పలు ఆరోపణలు చేశారు. పోలీసుల అండతో జగదీశ్వర్ రియల్ ఎస్టేట్ దందాలు, భూ ఆక్రమణ, గూండాయిజం, అవినీతి, పెత్తనం చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే శ్మశాన వాటికకు సంబంధించిన 34 ఎకరాల గ్రామ ఉమ్మడి భూమిని దౌర్జన్యంగా ఆక్రమించారన్నది ఆరోపణల సారాంశం. జెడ్పీ చైర్మెన్ జగదీశ్వర్ నే గాక, ఓ పత్రికా విలేకరిని, మరికొందరు రాజకీయ నేతలను కూడా ఈ లేఖలో మావోయిస్టు నేతగా పేర్కొన్న సబిత హెచ్చరించారు. ఆయా నాయకులు, వ్యక్తులు తమ పద్ధతులు మార్చుకోకుంటే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని కూడా లేఖలో వార్నింగ్ ఇచ్చారు.

మావోయిస్టుల బెదిరింపు లేఖలో చేసిన ఆరోపణలకు జెడ్పీ చైర్మన్ జగదీశ్వర్ ఏమీ భయపడ లేదు. గజ గజ వణకిపోవడమూ లేదు. మావోల ఆరోపణలకు సవాల్ విసిరారు. కొందరు రాజకీయ బ్రోకర్లు మావోయిస్టు పార్టీకి సానుభూతిపరులుగా ఉండి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి తన రాజకీయ ఎదుగుదలను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆయన విలేకరుల సమావేశం పెట్టి మరీ ఆరోపించారు. ములుకు జిల్లా అభివృద్ధికి కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తానని, తన చరిత్ర ఏమిటో తనపై పత్రికా ప్రకటన జారీ చేసినవారికి తెలుసని మావోయిస్టు నేత సబితను ఉద్దేశించి జగదీశ్వర్ వ్యాఖ్యానించారు. తనను భయపెట్టాలని చూస్తే భయపడేది లేదని, ఏటూరునాగారం జనక్షేత్రంలో తేల్చుకుందామని, ఆరోపణలు అవాస్తవమని తేలితే తనకు సబిత బేషరతుగా క్షమాపణ చెప్పాలని జగదీశ్వర్ డిమాండ్ చేశారు.

మావోలకు తనదైన శైలిలో సవాల్ విసిరిన జగదీశ్వర్ ఎవరో చెప్పలేదు కదూ? కేవలం టీఆర్ఎస్ నాయకుడే కాదు. మాజీ మావోయిస్టు కూడా. ఆ పార్టీ అగ్రనేత ఆర్కేకు ఒకప్పటి కొరియర్. రాడికల్ యువజన సంఘం ఏరియా కమిటీ కార్యదర్శి, తెలంగాణా జనసభకు నాయకత్వం వహించిన నేపథ్యం, రెండుసార్లు పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న చాకచక్యం. ఓ దినపత్రికలో కొంత కాలం విలేకరిగా పనిచేసిన అనుభవం. మొత్తం ఎపిసోడ్ లో కొసమెరుపు ఏమిటంటే… మావోల పేరుతో విడుదలైన లేఖ అసలుదా? నకిలీదా? అనే సంశయాలు కూడా ఉండడం.

Popular Articles