Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

ఎమ్మార్వో ‘స్టింగ్ ఆపరేషన్’: పత్రిక ఎడిటర్ సహా ఇద్దరి అరెస్ట్!

ఓ ఈ-పేపర్ పత్రిక ఎడిటర్ ను, అతని సోదరున్ని వరంగల్ జిల్లా ఐనవోలు పోలీసులు అరెస్ట్ చేశారు. వార్తా కథనాలు రాస్తూ ఐనవోలు తహశీల్దార్ కె. విక్రమార్ కుమార్ ను బెదించి, భారీ మొత్తం నగదును డిమాండ్ చేసి, కొంత మేర వసూల్ చేసిన కేసులో పోలీసులు ఆ పత్రికకు చెందిన ఎడిటర్ సహా ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

వరంగల్ కేంద్రంగా ‘జన నిర్ణయం’ అనే ఈ-పేపర్ లో ఐనవోలు ఎమ్మార్వో విక్రమ్ కుమార్ పై వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. ఎమ్మార్వో విక్రమ్ కుమార్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే సారాంశంతో మూడు వార్తా కథనాలను ప్రచురించారు. అయితే వార్తా కథనాలను నిలిపివేసేందుకు ‘జననిర్ణయం’ ఈ-పేపర్ ఎడిటర్ దామెర రాజేందర్, అతని సోదరుడు రవీందర్ ఎమ్మార్వో విక్రమ్ కుమార్ తో బేరసారాలకు దిగారు. తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని, తనపై ఇటువంటి నిరాధార వార్తా కథనాలు రాయడం, డబ్బు డిమాండ్ చేయడం అన్యాయమని విక్రమ్ కుమార్ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే పత్రికకు చెందిన ఎడిటర్ సోదరుడు దామెర రవీందర్ తొలుత, అతని అన్న దామెర రాజేందర్ ఆ తర్వాత ఎమ్మార్వో విక్రమ్ కుమార్ తో బేరసారాలకు దిగారు. తదుపరి కథనాలు రాయకుండా ఉండేందుకు రూ. 2.00 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే తనపై నిరాధారంగా మూడు వార్తా కథనాలు రాసి, రూ. 2.00 లక్షలు డిమాండ్ చేసిన ఆ పత్రిక ఎడిటర్ రాజేందర్, అతని తమ్ముడు రవీందర్ పై ఎమ్మార్వో విక్రమ్ కుమార్ రివర్స్ ‘స్టింగ్ ఆపరేషన్’ చేయడం విశేషం. పోలీసు అధికారుల సలహాలు, సహాయంతో పత్రిక ఎడిటర్ రాజేందర్, అతని సోదరుడు రవీందర్ ల సంభాషణలను ఎమ్మార్వో రికార్డు చేశారు.

ఐనవోలు ఎమ్మార్వో విక్రమ్ కుమార్

రాజేందర్, రవీందర్ ల వసూళ్ల నిర్వాకాన్ని ‘రికార్డు’ చేసే ప్రక్రియలో భాగంగా రూ. 10 వేల చొప్పున ఎమ్మార్వో విక్రమ్ కుమార్ వారికి ఆన్ లైన్ ద్వారా పంపించారు. ఆ తర్వాత మిగతా నగదును తీసుకునేందుకు ఆఫీసుకు రావాలని ఎమ్మార్వో ఆహ్వానించారు. నేరుగా ఆఫీసుకే వచ్చిన రవీందర్ ఎమ్మార్వో విక్రమ్ కుమార్ నుంచి రూ. 30 వేల నగదును తీసుకుని జేబులో కుక్కుకోగానే, అప్పటికే అక్కడ కాపుకాసిన పోలీసులు రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేశారు. రవీందర్ సోదరుడు, జననిర్ణయం పత్రిక ఎడిటర్ దామెర రాజేందర్ ను సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రేసవుట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో నిందితులైన రవీందర్, రాజేందర్ లపై బీఎన్ఎస్ చట్టంలోని 308(2), 351(2), 353(1), 356(3), r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Popular Articles