దేశ జనాభాలో 60%పైగా ఉన్న బీసీలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తంచేశారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 80 ఏండ్లు సమీపిస్తున్నా రాజ్యాధికారంలో బీసీలకు సరైన వాటా లభించకపోవడం, చాలా కులాల వాళ్లు చట్టసభల్లో కాలు కూడా పెట్టకపోవడం బాధాకరమన్నారు. బీసీలపై ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలా వివక్ష కొనసాగుతుండడం విచారకరమని ఎంపీ రవిచంద్ర మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్య, ఉద్యోగ రంగాలలో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, ప్రతి వార్షిక బడ్జెట్ లో 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని కామారెడ్డి బహిరంగ సభలో కాంగ్రెస్ ఆర్భాటంగా ప్రకటించి అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే ప్రస్తుతం మాయమాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తున్నదని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో, ఎన్నికల మేనిఫెస్టోలో, ప్రచార సభల్లో చేసిన వాగ్దానం మేరకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందేనని ఎంపీ రవిచంద్ర డిమాండ్ చేశారు.

అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కేంద్రానికి పంపించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తున్నదన్నారు. కేంద్రంలోని బీజేపీ పాలకులు ఇది తెలంగాణకు సంబంధించిన అంశంగా చూస్తూ ఏ మాత్రం స్పందించడం లేదన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అన్ని వర్గాల ప్రజలు ఒత్తిడి పెంచడంతో తెలంగాణ పాలకులు, కాంగ్రెస్ నాయకత్వం దేశ రాజధాని ఢిల్లీ చేరుకుని హడాహుడి చేస్తున్నదని, ధర్నాలు, ప్రెస్ మీట్స్ వల్ల ప్రయోజనం ఉండదన్నారు.ప్రధాని నరేంద్రమోడీని ఒప్పించేందుకు సోనియా, రాహూల్ గాంధీల నేతృత్వంలో అఖిలపక్షాన్ని తీసుకెళ్లడమే ఉత్తమ మార్గమని ఎంపీ రవిచంద్ర అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోడీ కూడా ఓబీసీకి చెందిన వారేనని, ఆయనపై మరింత ఒత్తిడి పెంచి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టించేందుకు ఇదే సరైన సమయమన్నారు. కాంగ్రెస్, దాని నేతృత్వంలోని ఇండియా కూటమికి లోకసభ, రాజ్యసభ ల్లో 300 మందికిపైగా సభ్యులున్నారని, బీసీ బిల్లుకు సునాయాసంగా ఆమోదం లభిస్తుందని, ఇందుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతునిస్తుందని ఎంపీ రవిచంద్ర వివరించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మార్గదర్శనంలో బీసీలందరూ రాజకీయ అస్తిత్వ, ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, చట్టసభల్లో రిజర్వేషన్స్ సాధించే వరకు పోరాడుతూనే ఉంటామని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఈ సందర్భంగా స్పష్టం చేశారు.