తెలంగాణ ప్రభుత్వం జరిపించిన కులగణన సర్వే దేశానికి ‘రోల్ మోడల్’, ‘రేర్ మోడల్’ అని గొప్పగా ప్రకటించుకుందే తప్ప, శాస్త్రీయ పద్ధతులు పాటించలేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2014లో ఒకే ఒక్క రోజులో శాస్త్రీయంగా, నిబద్ధతతో, చిత్తశుద్ధితో సర్వే జరిపించారని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం జరిపించిన సర్వే తప్పుల తడకగా ఉందని, బీసీలు లెక్కలతో సహా వివరించి ఉద్యమించారని అన్నారు. బీసీల జనాభాను కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 24 లక్షలు తక్కువ చేసి చూపిందని, 52%గా ఉన్న జనాభాను 46 శాతమే అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిందని ఎంపీ రవిచంద్ర ఆరోపించారు. ఢిల్లీ తెలంగాణ భవన్ లో గురువారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేఆర్ సురేష్ రెడ్డి, విప్ దీవకొండ దామోదర్ రావు, మాజీ ఎంపీ మాలోతు కవితలతో కలిసి ఎంపీ రవిచంద్ర గురువారం విలేకరులతో మాట్లాడారు.
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో చిత్తశుద్ధి లేకనే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చి హడావిడి చేశారన్నారు. ప్రత్యేక రైలులో తెలంగాణ నుంచి ఢిల్లీకి వచ్చిన వారెందరో, ధర్నాకు హాజరైన వారెంత మందో, దేనిగురించి వచ్చారో, ఆ హైడ్రామా దేనికోసమో, వారి ఆర్భాటం ఎందుకో ఆ పార్టీ నాయకులకే తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ధర్నాకు ఆ పార్టీ అగ్రనేతలు రాహూల్, ప్రియాంకాగాంధీలు హాజరు కాలేదని, రాజ్యాగంలోని 9వ షెడ్యూల్ ద్వారా 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలంటూ రాష్ట్రపతికి కనీసం విజ్ఞప్తి కూడా చేయలేదన్నారు. కాంగ్రెస్ ధర్నా వల్ల తెలంగాణకు, బీసీలకు ఒరిగిందేమీ లేదని ఎంపీ రవిచంద్ర వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన 432 హామీలను నెరవేర్చలేక, చేతగాక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించడమే ఒక పనిగా పెట్టుకున్నారని ఎంపీ రవిచంద్ర అన్నారు. నోటికొచ్చిన వాగ్ధానాలు చేసి, మోసపూరిత, మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, వాటి అమలు గురించి బీసీలు,అన్ని వర్గాల ప్రజల నుంచి వత్తిడి పెరగడంతో ఆ పార్టీ నాయకులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. చట్టసభల్లో మహిళలు,బీసీలకు 33% రిజర్వేషన్స్ అమలు చేయాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ 2014లోనే తీర్మానించి కేంద్రానికి పంపిన విషయాన్ని ఎంపీ వద్దిరాజు మరోసారి గుర్తు చేశారు.
ధర్నాలు, డ్రామాలు, బీఆర్ఎస్ నాయకులపై అనవసరమైన ఆరోపణలకు రేవంత్ రెడ్డి స్వస్తి చెప్పి, బీసీల 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంపై దృష్టి పెట్టాలని ఎంపీ రవిచంద్ర డిమాండ్ చేశారు. ఇందుకు కాంగ్రెస్ అధిష్టానం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీపై వత్తిడి తెచ్చి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు పెట్టించాలని డిమాండ్ చేశారు. దీనికి తమ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించాలని, విద్యా, ఉద్యోగ రంగాలలో కూడా రిజర్వేషన్స్ అమలు పర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నేతన్నలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.