హైదరాబాద్: బీసీ కులాల వారందరం మరింత ఐకమత్యంతో పోరు సల్పితేనే న్యాయమైన హక్కులు, రాజ్యాధికారంలో సముచితమైన వాటా దక్కించుకోల్గుతామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు అన్నారు. పార్లమెంటులో చట్టం చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో పొందుపర్చిన తర్వాతే రిజర్వేషన్ల పెంపుదల సాధ్యమవుతుందని తెలిసి కూడా కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. హైదరాబాద్ అశోకా హోటల్ లో ఆదివారం జరిగిన బీసీ ప్రజా ప్రతినిధుల, కుల సంఘాల నాయకుల సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల అంశంలో రేపోమాపో ఏదో అద్భుతం జరుగుతుందని అనుకోవడం పొరపాటుగా చెప్పారు. ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలవాలనే కుయుక్తులతో కాంగ్రెస్ అలవికాని హామీలెన్నో ఇచ్చి, ప్రజలను నమ్మించిందని, తీరా అధికారం చేపట్టాక మోసగిస్తున్నదని విమర్శించారు.కాంగ్రెస్ నాయకులు పులి మీద స్వారీ చేస్తున్నారని, ఇక కిందకు దిగడమనేది చాలా కష్టంతో కూడుకున్న అంశంగా ఆయన వ్యాఖ్యానించారు. తాము మునుపటి మాదిరి బీసీలం కాదని, దేశ కాల పరిస్థితులు అర్థం చేసుకుంటున్న తెలివైన వారమని ఎంపీ రవిచంద్ర అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే తమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బీసీలకు, మహిళలకు 33శాతం చొప్పున చట్టసభల్లో రిజర్వేషన్స్ ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని కేంద్రానికి గుర్తు చేస్తూ తీర్మానించి పంపారని చెప్పారు. స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాలలో 42%, చట్టసభల్లో మహిళలతో పాటుగా 33% చొప్పున రిజర్వేషన్స్ సాధించుకోవాలంటే అశోకా హోటల్ లో, ఇందిరాపార్క్ వద్ద ధర్నాలతో సాధ్యపడదని, మన కార్యక్షేత్రాన్ని ఢిల్లీకి మార్చి పోరుబాట పట్టాల్సిందేనని ఎంపీ వద్దిరాజు పిలుపునిచ్చారు. రిజర్వేషన్స్ పెంపుదల, రాజ్యాధికారంలో సరైన వాటా కోసం ఢిల్లీలో పలుమార్లు జరిగిన సభలు, సమావేశాల ఏర్పాట్లను తాను దగ్గరుండి చూసుకున్నానని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఎన్ని మాటలు చెప్పినా, కుప్పిగంతులు వేసినా ఏ మాత్రం ప్రయోజనం లేదని, పార్టీ అధినేత రాహూల్ గాంధీపై వత్తిడి పెంచి పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టించడమే సరైన మార్గమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి 100 మందికి పైగా, ఇండియా కూటమికి 300 మందికి పైగా ఎంపీలు ఉన్నారని, ప్రధాని నరేంద్రమోదీని రాహూల్ గాంధీ కలిసి బిల్లు పార్లమెంటులో పెడితే బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతునిస్తుందని ఎంపీ వద్దిరాజు చెప్పారు.
దేశవ్యాప్తంగా బీసీలలో చైతన్యం పెరిగిందని బీజేపీ కూడా గుర్తించిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాకుండా చట్టసభల్లో కూడా రిజర్వేషన్స్ సాధించుకునేందుకు మనమంతా మరింత సంఘటితమై కేంద్రంపై ఒత్తిడి పెంచుదామని ఎంపీ రవిచంద్ర అన్నారు. సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, వి. శ్రీనివాస్ గౌడ్, నేరెళ్ల ఆంజనేయులు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్టా మధుకర్, బొల్లం మల్లయ్య యాదవ్, బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్, బీసీ నాయకులు జనార్థన్, గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొని ప్రసంగించారు.