Top 5 This Week

Related Posts

ఐక్యతే మున్నూరుకాపుల బలం: ఎంపీ వద్దిరాజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులు చూపిన ఐక్యతను, శక్తిని స్పూర్తిగా తీసుకుని మున్నూరుకాపులు ముందుకు సాగాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు .తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హయాంలో బీఆర్ఎస్ నుంచి 10మంది మున్నూరుకాపు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే, కాంగ్రెస్ నుంచి 2023లో ఒక్కరు మాత్రమే ఎన్నికయ్యారని ఆయన అన్నారు. గడచిన 75ఏండ్లలో మున్నూరుకాపు మంత్రి లేని కేబినెట్ ఇదొక్కటేనని ఎంపీ రవిచంద్ర ఆవేదన వ్యక్తంచేశారు. మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పదవులకు హైదరాబాద్ జలవిహార్ ప్రాంగణంలో ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన అనంతరం జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఉత్తేజిత ప్రసంగం చేశారు.

కులగణన సందర్భంగా పాలకులు మున్నూరుకాపు జనాభాను తక్కువ చేసి చూపడం కూడా ఒక కుట్రేనని ఎంపీ రవిచంద్ర అన్నారు. మనమందరం వివిధ సంఘాలుగా కాకుండా అపెక్స్ కౌన్సిల్ పొందుపర్చిన రాజ్యాంగం ప్రకారం ‘ఒకే కులం-ఒకే సంఘం’ నినాదంతో ముందుకు సాగడం ద్వారా మరింత ఐకమత్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్నారు. సంఘం మాజీ అధ్యక్షుడు కొండా దేవయ్య అనవసరమైన వాదనతో రాజ్యాంగానికి విరుద్ధంగా వేరుపడడం విచారకరమని ఎంపీ వద్దిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అపెక్స్ కౌన్సిల్ అత్యున్నత నిర్ణాయక మండలి అని, ఇదే సుప్రీం అని, దాని నిర్ణయాలే ఫైనల్ అని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు. భవిష్యత్తులో మున్నూరుకాపులంతా ఒకే గొడుగు కిందకు వస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మన పిల్లలను బాగా చదువిస్తూ,వ్యాపార రంగంలో అడుగుపెట్టి ఆర్థికంగా బలపడుతూ రాజ్యాధికారం దిశగా అడుగులేద్దామని, ఇందుకు ఐకమత్యంతో ముందుకు సాగుదామని ఎంపీ వద్దిరాజు పిలుపునిచ్చారు. మనం గతంలో అనుకున్న మాదిరిగా హైదరాబాద్ నగరంలో భారీ బహిరంగ జరిపి మున్నూరుకాపుల సంఘటిత శక్తిని లోకానికి చాటి చెబుదామని అన్నారు.

ఎన్నికైన నూతన కార్యవర్గం, ఇతర నాయకులతో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ, మన జనాభాను తక్కువ చేసి చూపించడం రాజకీయంగా అణచివేయాలని కుట్ర పన్నారన్నారు. మంత్రిమండలిలో మున్నూరుకాపులకు చోటివ్వకపోవడం బాధాకరమన్నారు. అపెక్స్ కౌన్సిల్ సభ్యులు సీ.విఠల్ మాట్లాడుతూ, సంఘం ఎన్నికలు గొప్పగా, ప్రజాస్వామ్యయుతంగా జరిగాయన్నారు. అపెక్స్ కౌన్సిల్ రూపొందించిన నియమ నిబంధనలు (బైలా) దేశ ప్రజలకు భారత రాజ్యాంగం మాదిరిగా మున్నూరుకాపులకు రాజ్యాంగం వంటిందన్నారు. మన సంఘాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్మించుకుంటూ, బలోపేతం చేసుకుంటూ హైదరాబాద్ నగరంలో భారీ బహిరంగ జరుపుకుందామని తెలిపారు.

అపెక్స్ కౌన్సిల్ సభ్యులు రౌతు కనకయ్య మాట్లాడుతూ,రాష్ట్రంలో అత్యధిక జనాభా మున్నూరుకాపులదేనని స్పష్టం చేశారు. నిబద్ధతతో పని చేసుకుంటూ ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చని, త్వరలో రాజకీయ తరగతులు కూడా నిర్వహించుకుని రాజ్యాధికారం సాధించుకునే దిశగా వడివడిగా అడుగులేద్దామన్నారు. స్వర్గీయ బొజ్జం నర్సింహులు రాసిన ‘మున్నూరుకాపు కుల అధ్యయనం 1920-67’ పుస్తకాన్ని ఎంపీ రవిచంద్ర, ఐపీఎస్ మాజీ అధికారి జే.డీ.లక్మీనారాయణలకు కనకయ్య బహుకరించారు. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మన ఐక్యత,సత్తా చూపించాల్సిన అవసరం ఉందన్నారు.

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్మీనారాయణ మాట్లాడుతూ, రాజ్యాధికారం అందుకునేందుకు మనం మొదట ఆర్థికంగా మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు. సరైన ప్రణాళిక,కార్యాచరణతో ముందుకు సాగితే విజయమే మనదేనన్నారు. పటేల్స్ ఎంటర్ ప్రెన్యూర్స్ నెట్ వర్క్ ప్రముఖులు డాక్టర్ పీఏల్ఏన్ పటేల్ మాట్లాడుతూ, ఈ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయని, 33జిల్లాల నుంచి వచ్చిన నాయకులు పాల్గొన్న ఈ ప్రక్రియ కన్నుల పండువగా జరిగిందన్నారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు పటేల్స్ ఎంటర్ ప్రెన్యూర్స్ నెట్ వర్క్ ప్రముఖులు అందించిన చేయూతను ఎంపీ రవిచంద్ర, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు విఠల్, కనకయ్య,మీసాల చంద్రయ్య,ఎన్నికల ప్రధానాధికారి జే.డీ.లక్మీనారాయణ, అధికారులు మంగపతి బాబు,ఎర్రా నాగేంద్రబాబు, ఊసా రఘు, లవంగాల అనిల్ తదితర ప్రముఖులు కొనియాడారు

Popular Articles