దేశంలో జనాభా లెక్కల సేకరణ సందర్భంలో కుల గణనను కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. దేశ జనాభా లెక్కలతోపాటు కులాల గణనను కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం బీఆర్ఎస్ పార్టీ విజయంగా ఆయన అభివర్ణించారు. బీసీల ఐకమత్యానికి ఒక ప్రబల నిదర్శనమని రవిచంద్ర వ్యాఖ్యానించారు. ఈమేరకు బుధవారం రాత్రి వద్దిరాజు ఓ ప్రకటన విడుదల చేశారు.
అనాదిగా అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయాలకు, అణిచివేతకు గురవుతున్న బీసీల పక్షాన బీఆర్ఎస్ నిలబడి పోరాటాలు చేసిన ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఈ నిర్ణయం తీసుకుందన్నారు. తమిళనాడులో బీసీల సంక్షేమం, అభ్యున్నతికి అమలవుతున్న కార్యక్రమాలు, పథకాలను బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఆ రాష్ట్రంలో పర్యటించి అధ్యయనం చేయడాన్ని ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో చోటు చేసుకున్న తప్పిదాలను ఎండగడుతూ బీఆర్ఎస్ ఉద్యమించిందని ఆయన పేర్కొన్నారు.

కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పించి తీరాల్సిందేనన్న బీఆర్ఎస్ పోరాట ఫలితంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించిందని ఎంపీ రవిచంద్ర చెప్పారు. తమ పార్టీ బీఆర్ఎస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మొదటి నుంచి కూడా అణగారిన వర్గాలకు కొండంత అండగా ఉంటున్న సందర్భాలను ఎంపీ రవిచంద్ర ఈ సందర్భంగా ప్రస్తావించారు.
రాష్ట్ర ఏర్పాటు జరిగిన తొలినాళ్లలోనే ఎస్సీ రిజర్వేషన్స్ వర్గీకరణకు అనుకూలంగా, చట్టసభలలో మహిళలు, బీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలని కోరుతూ తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడమే కాక కేసీఆర్ స్వయంగా ప్రధాని నరేంద్రమోడీని కలిసి వినతిపత్రం అందించారని, బీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు పలుమార్లు లేఖలు రాశారని ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు. అదేవిధంగా ఢిల్లీ వేదికగా పలుమార్లు ధర్నాలు చేపట్టి, సభలు, సమావేశాలు నిర్వహించి ఓబీసీల ఐక్యతను దేశానికి చాటి చెప్పామని ఎంపీ వద్దిరాజు వివరించారు.

కులగణన చేపట్టే సందర్భంగా ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా,తప్పిదాలు జరుగకుండా పారదర్శకంగా,పకడ్బంధీగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, చట్టసభలలో 33%, తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్స్ అమలుకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని ఎంపీ రవిచంద్ర ప్రధాని నరేంద్రమోడీని కోరారు. అలాగే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణను వెంటనే చేపట్టి ఖాళీగా ఉన్న ఆరింటిలో నాలుగు పదవులను బీసీలకే కేటాయిస్తూ ప్రాధాన్యత శాఖలు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.