Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

ప్రజలు బాధపడుతున్నారు: ఎంపీ రవిచంద్ర

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడడంతో తాము చేసిన పొరపాటుకు ప్రజలు బాధపడుతున్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 125 రోజులవుతున్నా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన రూ. 2 లక్షల రుణమాఫీ, వరి క్వింటాలుకు రూ. 500 బోనస్, రూ. 4 వేల పింఛన్లు అమలు జాడ లేదని ఆయన అన్నారు. ఖమ్మం లోకసభ నియోజకవర్గ ఎన్నికల సన్నాహాక సమావేశం సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం వీ.ఎం.బంజరలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత, పార్టీ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, పేదలకు తెల్ల రేషన్ కార్డులిస్తామని హడావిడి చేసి విస్మరించారన్నారు. కాంగ్రెస్ పార్టీకి లోకసభ ఎన్నికల్లో కూడా పొరపాటున ఓటేస్తే, వాళ్లు ప్రజల్ని పూర్తిగా మర్చిపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రజలకు ఇప్పుడిప్పుడే బాగా తెలిసి వస్తున్నదని, బీఆర్ఎస్ ఓడిపోవడం, కేసీఆర్ అధికారం కోల్పోవడం పట్ల అన్ని వర్గాల వాళ్లు బాధపడుతున్నారని చెప్పారు. తాము చేసిన పొరపాటును గ్రహించిన ప్రజలు లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఏకపక్షంగా ఓట్లు వేస్తారన్న విశ్వాసాన్ని ఎంపీ వద్దిరాజు వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అంకితభావం, నిబద్ధత కలిగిన నాయకుడని, ఆయన ఓడిపోవడం సత్తుపల్లి ప్రజల దురదృష్టమన్నారు. సండ్ర ఓడిపోయారంటే కేసీఆర్ గారు కూడా నమ్మలేకపోయారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.

వీఎం బంజర సమావేశంలో మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర

పార్లమెంటులో తెలంగాణ ప్రజల పక్షాన బలమైన వాణి వినిపించిన బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావును మనమందరం సైనికుల మాదిరిగా పనిచేసి భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దామని ఎంపీ వద్దిరాజు గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాగా రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికై పదవీ ప్రమాణం చేసిన ఎంపీ వద్దిరాజును బీఆర్ఎస్ నాయకులు ఇదే వేదికపై సత్కరించారు.

Popular Articles