తెలంగాణాలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమైనదిగా ఆయన అభివర్ణించారు. ఈ అంశంలో మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం పట్ల వద్దిరాజు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అనుసరిస్తూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్ చర్యలు తీసుకుంటారనే ఆశాభావాన్ని ఎంపీ రవిచంద్ర వ్యక్తం చేశారు. ఒకపార్టీ బీ-ఫారంపై గెలిచిన చట్టసభల ప్రతినిధులు ఇంకో పార్టీలోకి ఫిరాయించిన సందర్భాల్లో.. వారికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ఏళ్లతరబడి నాన్చడాన్ని న్యాయమూర్తులు తప్పుబట్టారని, త్వరితగతిన నిర్ణయం తీసుకోవలసిందిగా ఆదేశించడం ఆహ్వానించదగిన పరిణామమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు.
