Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

కాంగ్రెసోళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలి: ఎంపీ వద్దిరాజు

వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఇల్లెందు నియోజకవర్గం నుంచి గులాబీ దండు వేలాదిగా కదం తొక్కాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఈ సభకు హాజరయ్యే పార్టీ శ్రేణులను చూసి కాంగ్రెసోళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ అధ్యక్షతన మంగళవారం ఇల్లెందు నియోజకవర్గ పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

వరంగల్ లో పది లక్షల మందితో జరిగే సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడుతారోనని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఏడాదిన్నరకే ప్రజలు విసిగి, వేసారి పోయారన్నారు. ఆచరణలో సాధ్యం కాని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయలేక చేతులెత్తేశారని విమర్శించారు. కేసీఆర్ ను దూరం చేసుకుని తప్పు చేశామని ప్రజలంతా పశ్చాత్తాప పడుతున్నారని అన్నారు.

కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేద్దామని భ్రమ పడుతున్న ముఖ్యమంత్రి తాను కూర్చున్న కుర్చీ కూడా కేసీఆర్ పెట్టిన భిక్షగా గురైరగాలని అన్నారు. కేసీఆర్ పోరాటం చేయకపోతే ఇవాళ రాష్ట్రమే వచ్చేది కాదని ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అద్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ, వరంగల్ సభ విజయవంతానికి దిశా నిర్ధేశం చేశారు. బహిరంగ సభకు హాజరయ్యే ముందు పార్టీ కార్యకర్తలంతా తమ తమ గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించుకుని బయలుదేరాలని పిలుపునిచ్చారు.

ఇల్లెందులో కార్యకర్తలనుద్ధేశించి మాట్లాడుతున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

పాతికేళ్ల పార్టీ పేరంటానికి రండి..!
కాాగా ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కు సన్నాహకంగా ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. మేళ, తాళాల నడుమ పార్టీ ముఖ్య నాయకుల ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి వరంగల్ సభకు ఆహ్వానించారు. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, తెలంగాణ ఉద్యమకారుడు దిండిగాల రాజేందర్ అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళా నేతలు, కౌన్సిలర్లు వెంట నడిచారు. ఇల్లెందు మున్సిపాలిటీ 7 వార్డులో గల 2 నెంబర్ బస్తీలో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్తల కుటుంబాల్లో ముఖ్యులైన బజారు సత్యనారాయణ, ఎంఏ రవూఫ్, చాగర్ల సరళ, సామల రవితేజ ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి, కుటుంబ సభ్యులందరినీ వరంగల్ లో జరిగే రజతోత్సవ సభకు హాజరు కావాలని ఎంపీ వద్దిరాజు కోరారు. ఒక ప్రాంతీయ పార్టీ పాతికేళ్లుగా క్రియాశీలకంగా ప్రజల కోసం అంకితమై పని చేయడం చాలా అరుదు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ తర్వాత అంతటి ఘనత బీఆర్ఎస్ కే దక్కిందన్నారు. అందుకే.. బీఆర్ఎస్ పాతికేళ్ల సంబురం పండుగలా నిర్వహిస్తున్నామని వద్దిరాజు తెలిపారు. ఈ సభకు తాము ఊహించిన దానికంటే ఎక్కువ మంది కార్యకర్తలు తరలివస్తున్నారని చెప్పారు. ఈ సభ విజయవంతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని రవిచంద్ర కోరారు.

వనజీవి రామయ్య చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

ఖమ్మం – మానుకోట రోడ్డుకు ‘వనజీవి’ పేరు పెట్టాలి: వద్దిరాజు
తన జీవితం మొత్తం మొక్కలు నాటాడానికే అంకితం చేసిన పద్మశ్రీ దరిపల్లి రామయ్య ధరిత్రి ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచి ఉంటారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇటీవల మృతి చెందిన వనజీవి రామయ్యకు మంగళవారం రవిచంద్ర నివాళులు అర్పించారు. రెడ్డిపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి చిత్ర పటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన, అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ, రామయ్య పేరు ఎప్పటికీ గుర్తుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా ఖమ్మం – మహబూబాబాద్ రోడ్డుకు వనజీవి రామయ్య మార్గ్ పేరుతో నామకరణం చేయాలని ఎంపీ రవిచంద్ర కోరారు. ఖమ్మం నుంచి రెడ్డిపల్లి వరకు 8 కిమీ మేర వనజీవి రామయ్య మొక్కలు నాటారని గుర్తు చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఆ చెట్లన్నీ కూల్చేసినందున, మళ్ళీ అదే వరసలో మొక్కలు నాటి సంరక్షించి రామయ్య కు నివాళులు అర్పించాలని కోరారు. ఈ విషయం లో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. రామయ్య చరిత్ర భావి తరాలకు తెలిసేలా కర్ణాటక తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా పాఠ్య పుస్తకాల్లో ఆయన చరిత్ర ను ప్రవేశ పెట్టాలని ఎంపీ రవిచంద్ర కోరారు. జిల్లాలో కూడా ఆయన స్మారకం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Popular Articles