వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు నూతనోత్సాహంతో బయలుదేరాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెంలో వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ, ఏప్రిల్ 27 సభ విజయవంతం కావడానికి అనుసరించాల్సిన అంశంపై పార్టీ కార్యకర్తలకు దిశా, నిర్ధేశం చేశారు. పండుగ వాతావరణంలో జరుగుతున్న ఈ సభ తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించబోతోందని చెప్పారు. అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, బీఆర్ఎస్ ను దూరం చేసుకుని తప్పు చేశామని ప్రజలంతా పశ్చాత్తాప పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అడగని పథకాలు సైతం ఆచరణలో అమలు చేసి చూపించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు.

వరంగల్ సభకు వాహనాల ఏర్పాటు, సదుపాయాల కల్పన పై జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ సమీక్షించారు. ఆ రోజు గ్రామ గ్రామాన పార్టీ జెండాలు ఆవిష్కరించుకుని, వరంగల్ బయలుదేరాలని సూచించారు. తొలుత అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు నివాళులు అర్పించారు. అనంతరం వరంగల్ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను నేతలు ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు శీలం కవిత, గ్రామ సర్పంచ్ రేణుక తదితరులు పాల్గొన్నారు.

