హైదరాబాద్: జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర చురుగ్గా పాల్గొంటున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంగళవారం ఆయన కాలినడకన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ రవిచంద్రకు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కే.టీ.రామారావు యూసఫ్ గూడ డివిజన్ బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే.
తనకు అప్పగించిన బాధ్యతల నిర్వహణలో భాగంగా ఎంపీ రవిచంద్ర మంగళవారం ఉదయం యూసఫ్ గూడ డివిజన్ ప్రగతినగర్ లోని వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కాలినడకన ఎన్నికల ప్రచారం చేశారు. ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పుస్తె శ్రీకాంత్, ఆశీస్ కుమార్ యాదవ్, వాసాల వెంకటేష్, పర్వతం సతీష్, కోట్ల వినోద్ కుమార్, మంజుల, భాగ్యలక్ష్మీ, విమల తదితరులు వెంట రాగా ప్రగతినగర్, లక్ష్మీనరసింహా నగర్,యూసఫ్ గూడ చెక్ పోస్ట్ తదితర చోట్ల పలు వీధుల్లో గడపగడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రజలకు రావలసిన బకాయిలను వివరిస్తూ ‘బాకీ కార్డులు’ పంపిణీ చేశారు. గృహిణులు, వ్యాపారస్తులు, మైనారిటీలు, యువకులు, మెకానిక్స్, వృద్ధులను ఎంపీ రవిచంద్ర తదితర నాయకులు కలిసి సర్కారు వైఫల్యాలను వివరిస్తూ బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మాగంటి సునీతను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఓటర్లను అభ్యర్థించారు.
కాగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ కు ఉప ఎన్నిక నేపథ్యంలో వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్,పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తదితర సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర నివాసంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ కు ఘన విజయం చేకూర్చడమే లక్ష్యంగా, ధ్యేయంగా ముందుకు సాగాలని నిర్ణయించారు.