ఈనెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పాలేరు నియోజకవర్గం కదం తొక్కాలని, ఓరుగల్లు దద్దరిల్లాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. రజతోత్సవ సభకు సన్నాహకంగా గురువారం సాయంత్రం తిరుమలాయపాలెంలో పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గాలికొదిలి ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు.
కేవలం ఏడాదిలోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయని, బీఆర్ఎస్ ను దూరం చేసుకుని తాము ఏం కోల్పోయామో ప్రజలంతా గ్రహించారని అన్నారు. రేవంత్ సర్కార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో అత్యుత్సాహం ప్రదర్శించి, అడవులను ధ్వంసం చేసి సుప్రీంకోర్టు చీవాట్లు తినాల్సి వచ్చిందన్నారు. నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు అత్యుత్సాహం చూపి కేసులు పెట్టి నిర్భంధాలకు గురిచేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు.

వరంగల్ సభ తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పై ప్రత్యేక దృష్టి సారించబోతోందని, సభ్యత్వ నమోదు, గ్రామస్థాయి కమిటీల నియామకం జరపబోతోందని అన్నారు. రజతోత్సవ సభను సక్సెస్ చేయడంలో పాలేరు నియోజకవర్గ పార్టీ శ్రేణులు ప్రముఖ పాత్ర పోషించాలని అన్నారు. సభలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు సూధన్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.