Friday, March 6, 2026

Top 5 This Week

Related Posts

అతని బతుకే కాదు., చావూ ప్రత్యేకమే! అతడే ఇతడు..!!

ఆ ‘చార్వాకుడు’ ఎలా చనిపోయాడో గాని ఈ ‘చార్వాకుడు’ మాత్రం అధికార, అనధికార, న్యాయ, అన్యాయ, బంధు, అబంధు, సహచర, అసహచర ఉద్యోగ గణాలతో అవిశ్రాంతంగా పోరాడి కన్నుమూశాడు. అతని బతుకే గాదు అతని చావూ ప్రత్యేకమే. అతడే ఇతడు.. పేరు తోటకూర వెంకటేశ్వర్లు ఎలియాస్ చార్వాక వెంకటేశ్వర్లు. నిజంగానే తోటకూర కాడలాగా, ఎముకల గూడుకు చర్మం కప్పినట్టు, పీలగా, ఎర్రగా, పొడవుగా, తెల్లచొక్కా, తెల్లప్యాంటు వేసుకుని బెజవాడ సున్నపుబట్టిల సెంటర్లో ముడ్డెనక చేతులు కట్టుకుని కనిపిస్తుండేవారు.

ఈయన ఎవరా అని ఆరా తీస్తే మా మిత్రుడు, న్యాయం, అన్యాయం, పౌరహక్కులంటూ నానా యాగీ చేసే మల్లెల శేషగిరిరావు చెప్పాడు.. ‘ఆయన తోటకూర వెంకటేశ్వర్లని, మహామొండి మనిషని, పట్టుకుంటే దేన్నీ వదలడని, తన సహోద్యోగుల కుట్రతో పోయిన ఉద్యోగం కోసం ‘లా’ చదివి కోర్టులో తన కేసును తానే వాదించుకుంటున్నారని, ఉన్న ఆస్తులు కరిగి, కన్నపిల్లలు ఈయన మూలాన అవస్థలు పడుతున్నారని’.. ఇలా ఏవేవో చెప్పారు.
ఇదెప్పుడో 1996,97ల నాటి సంగతి. అప్పుడిన్ని అతి తెలివితేటలు లేకపోవడంతో ప్రతిదానికీ చలించేవాణ్ణి.. మరయితే ఈ కేసును ‘అమ్నెస్టీ ఇంటర్నేషనల్’ దృష్టికి తీసుకువెళదామా? అంటే.. ‘నువ్వొకడివి తయారయ్యావా’ అంటూ ముగ్గురం కలిసి విజయవాడ నుంచి హైదరాబాద్ లో జరిగిన అమ్నెస్టీ ఇంటర్నేషనల్ మీటింగ్ కి వచ్చాం. ఆనాటి అమ్నెస్టీ ఇండియా చాప్టర్ అధ్యక్షులు సౌమ్యాభౌమిక్ మొదలు ఎవరెవర్నో కలిసినట్టు గుర్తు. మూడు రోజుల పాటు ఆయనతో కలిసి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీ హాస్టల్ లో ఉన్నాం. శేషగిరికి ఆయన తత్వం ముందే తెలియడం వల్ల.. ఆయనతో మాట్లాడే పని నాది.

అప్పుడు తెలిసింది ఆయనేమిటో.. వన్ బై టూ టీ తాగినా ఆయన వాటా ఆయన ఇవ్వాల్సిందే. షేరింగ్ ఆటో అయినా అంతే.. రైలుచార్జీ అయినా అంతే..

నిజాయితీ నిప్పులాంటిదంటారు గాని చాలా ఖరీదైన వ్యవహారం. చాలా పోగొట్టుకోవాలి. చాలా చెల్లించుకోవాలి. మరెన్నో మోయాలి. ఇంతటి నిష్కర్ష, నిజాయితీ, నీతిని, రాజీ లేని తనాన్ని సమాజం భరాయించలేదు.

వెంకటేశ్వర్లు నిక్కచ్చితనం ఎంతటిదంటే వాళ్ల పిల్లల పాస్ పోర్టు, ఇతరత్రా ప్రభుత్వ సంక్షేమ సాయాల్నీ అందకుండా చేసేంతటిది. ఇంట్లో కూర లేదంటే.. ‘అన్నంలో నీళ్లు పోసుకుని తినండి’ అనడమే కాదు ‘తాను తినేంతటి’ నిజాయితిని కుళ్లు సమాజం జీర్ణించుకోగలుగుతుందా? చుట్టుపక్కల వాళ్లు సరే, కట్టుకున్న వాళ్లు, కన్నవాళ్లకైనా ఆయన మింగుడుపడతాడా!? ఈయన్ని వదిలించుకోకుండా ఎవరైనా ఉండగలుగుతారా!? ఈ మనిషికి ఏదో ఒక ముద్ర వేయకుండా ఈ హిపోక్రాటిక్ సొసైటీ మనజాలుతుందా..

ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల సంతరావూరులో పుట్టిన వెంకటేశ్వర్లు 1976-81 మధ్య “చార్వాక” తెలుగు మాస పత్రికను ప్రచురించి ఊరూరా పంచి ‘దేవుడు లేడు, దెయ్యం లేదు’ అంటూ ఇంటింటా చాటింపు వేసేవారట.

రాడికల్ హ్యూమనిస్ట్, 3 సార్లు విజయవాడ లో హేతువాద మానవవాద అధ్యయన తరగతులను నిర్వహించిన ఘనత ఆయనది. హేతువాద మానవవాద ఉద్యమానికి ప్రేరణ, త్యాగశీలత వెంకటేశ్వర్లు సొంతం.

వ్యక్తిగా వ్యవస్థలపై పోరాటంలో గెలవలేమన్న నిజం తెలిసినా ఎన్నడూ ఓటమిని అంగీకరించని నిరంతర సృజనశీలి. తన ఈతి బాధలను, ఇంటి గుట్టును పరుల ఎదుట ఏకరవు పెట్టడం ఇష్టం లేని వెంకటేశ్వర్లు 26-12-2025న గుంటూరులో చనిపోయే ముందు తన శ్రీమతి, ముగ్గురు పిల్లల దగ్గర ఓ హామీ తీసుకుని కన్నుమూశారు. అదే.. ‘నా చావును టాం,టాం చేయాల్సిన పని లేదు. నేను సామాన్యుణ్ణి. ఎవరకీ చెప్పాల్సిన పని లేదు. మీరు నలుగురు కలిసి అంత్యక్రియలు పూర్తి చేయండి.’

బహుశా నాకు తెలిసి గతంలో ఇటువంటి పని ప్రముఖ న్యాయవాది, పౌరహక్కుల సంఘం నేత కన్నబిరన్, ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ హేమా పరిమి (విజయవాడ) చేసినట్టు గుర్తు. ఆ తర్వాత ఈయనేననుకుంటా.

తన మిత్రులతో తోటకూర వెంకటేశ్వర్లు (టీషర్ట్ ధరించిన వ్యక్తి-ఫైల్ ఫొటో)

తనను తాను సామాన్యుడుగా అభివర్ణించుకోవడం ఆయన నిరాడంబరతకు నిదర్శనం. కానీ ఆయన జీవితం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్యం కాదు. ఆయన పోరాటం, ఘర్షణ, ఆరాటం అన్నీ వ్యక్తిగతంగా కనిపించినా అవేవీ వ్యక్తిగతం కావు. సమాజంతో, సమాజంలోని కుళ్లు సంప్రదాయాలతో, ద్వంద్వ విలువలతో ఆయన జీవితాంతం సాగించిన యుద్ధమే అది. వ్యక్తిగత జీవితం సమాజంతో సంబంధం లేకుండా ఉండగలదా? కుటుంబంతో అనుబంధం లేకుండా సాగగలదా? అన్న ప్రశ్నలు ఇక్కడ తప్పక ఎదురవుతాయి.

సమాజంలో మన భావాలు, మన జీవితం సమాజానికి ఏ సంకేతాలు ఇస్తాయో కూడా ప్రశ్నించాల్సిందే. వెంకటేశ్వర్ల జీవితం ఆ ప్రశ్నను నిర్లక్ష్యం చేయలేనంత బలంగా ముందుకు తెస్తుంది. అందుకే ఆయన జీవితం, పోరాటాలు కేవలం స్మరణగా కాకుండా, లోతైన అధ్యయనం, విశ్లేషణకు అర్హమైనవిగా నిలుస్తాయి.

జర్నలిజం వృత్తిమిత్రుల తరఫున మేము విజయవాడలో సీనియర్ జర్నలిస్టు కొల్లి సత్యనారాయణను అభినందించిన సందర్భంలో మీరు చెప్పిన మాటలు ఇప్పుడు పదేపదే గుర్తొస్తున్నాయి.. “బతకడం కోసం పోరాటం చేయాలి, అన్యాయాన్ని ఎదిరించాలి.”

ఏమైనా, నిజాయితీకి మూల్యం చెల్లించిన జీవితం- సమాజానికి మిగిల్చిన ప్రశ్న మీ జీవితం. మీ మరణవార్త విన్నప్పటి నుంచీ కన్నీళ్లు ఆగడం లేదు వెంకటేశ్వర్లు గారూ..! మీకిదే మా నివాళి.

✍️ ఆకుల అమరయ్య
(సీనియర్ జర్నలిస్ట్)

Popular Articles